Temple Gopurams Marvels: గోపురాలు శిల్పకళా వైభవానికి నిదర్శనాలు
ABN , Publish Date - Sep 19 , 2025 | 04:57 AM
ఒక దేశంలోని వాస్తు నిర్మాణం ఆ దేశస్తుల మేధోసంపత్తి గురించి తెలియజేస్తుంది. ఆ దేశ ప్రజల నిర్మాణ కౌశలం, కళా కౌశలం, సృజనాత్మకత, అభిరుచి, ఆశచాలు, జీవనశైలి, శ్రమైక జీవన సౌందర్యం లాంటివి ఎన్నో విషయాలు...
తెలుసుకుందాం
ఒక దేశంలోని వాస్తు నిర్మాణం ఆ దేశస్తుల మేధోసంపత్తి గురించి తెలియజేస్తుంది. ఆ దేశ ప్రజల నిర్మాణ కౌశలం, కళా కౌశలం, సృజనాత్మకత, అభిరుచి, ఆశచాలు, జీవనశైలి, శ్రమైక జీవన సౌందర్యం లాంటివి ఎన్నో విషయాలు వారు రూపొందించిన నిర్మాణాలు, వాటిలోని శిల్పాలు, చిత్రాలు తదితరాల ద్వారా తెలుసుకోవచ్చు. భారతదేశ వాస్తుకళ, శిల్పకళ... దేవాలయాలతో పెనవేసుకున్నాయి. దక్షిణ భారతదేశంలో వైదిక దేవాలయాల నిర్మాణాలను బట్టి భారతీయుల ఆధ్యాత్మిక వికాసాన్ని గుర్తించవచ్చు. ద్రవిడుల శిల్పకళ, వాస్తుకళల ఉన్నతికి అవి ప్రతిబంబాలు. ద్రవిడ శిల్పుల అపారమైన మేధో సంపత్తికి ఈ దేవాలయాలు సజీవ సాక్ష్యాలు.
ఈ దేవాలయ నిర్మాణాల్లో గోపురం విశిష్టమైనది. ద్వారం దగ్గర ఉన్నతంగా కనిపించే ఈ గోపురాలు ద్రవిడ శిల్పుల మహోన్నత శిల్పకళా వైశిష్ట్యానికి నిలువెత్తు నిదర్శనాలు. వారు తమ నైపుణ్యంతో ఎత్తయిన గోపురాలను నిర్మించి, ఆలయాల కీర్తిని శాశ్వతం చేశారు. గోపురాన్ని కేవలం ద్వారంగానే కాదు, ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చారు. పట్టణాలు పిడుగుపాటుకు గురికాకుండా, దేవుని స్థానం ఉన్నతంగా కనిపించే విధంగా, ఆ రోజుల్లో దేవాలయాలలో ప్రవేశించలేని అణగారిన వర్గాలకు దేవుని స్థానం కనిపించేలా దేవాలయ ప్రాసాదాలు నిర్మితమయ్యాయి. సనాతన భారతీయ శాస్త్రాలు దేవాలయాన్ని మానవ దేహంతో పోల్చాయి.
గర్భగృహం శిరం ప్రోక్తం అంతరాళం గళం తథా
మండపంచ ముఖంబాహుః కుక్షిఃస్యాన్మండపోమహాన్
ప్రాకారం జానుజంఘేచ గోపురం పాదమేవచ
విశ్వకర్మ వాస్తుశాస్త్రంలోని ఈ శ్లోకం... శయనించి ఉన్న మానవ దేహంలోని అవయవాలతో దేవాలయాన్ని పోల్చింది. ‘‘గర్భగృహం మానవుని శిరస్సు. అంతరాళం మానవుడి గళం. ముఖ మండపం మానవుని బాహువులు. మండపం ఉదరం (పొట్ట). ప్రాకారం మానవుని జానుజంఘాలు (మోకాలు, పిక్కలు). గోపురం మానవుని పాదాలు’’ అని అర్థం. దేవాలయ నిర్మాణంలో ప్రధానమైన కేంద్ర స్థానం గర్భగృహం. అది మానవుని శిరస్సు లాంటిది. దాని ముందు భాగాన్ని ‘ముఖ మండపం’ అంటారు. గర్భగృహానికి ముఖమండపాన్ని కలుపుతూ సన్నని మండపం ఉంటుంది. దాన్నే ‘అంతరాళం’ అంటారు. ఇక ఉదరభాగాన్ని మహా మండపంగా, పాదాలను గోపురంగా, పాదంలోని వేళ్ళను గోపుర కలశాలుగా పోల్చారు. శయనించిన మానవుడి పాదాలు రెండూ ఆకాశం వైపు చూస్తూ ఎత్తుగా నిలిచి ఉన్న విధంగా... ఆకాశంలోకి దూసుకుపోతున్నట్టు గోపుర నిర్మాణాన్ని శిల్పి మలిచాడు.
గోపురం శబ్దార్థాలు
పురద్వారంతు గోపురః - పురద్వారాన్ని గోపురం అంటారు. గోపురం అంటే గవను (దుర్గ పుర ద్వారం), వాకిలి అనే అర్థాలున్నాయి.
ద్వార మాత్రేపి గోపురం - ‘పట్టణానికి ద్వారం’ అని అర్థం.
గోప్యతే శూరైః ఇతి గోపురం - శూరులు రక్షించేది గోపురం. పట్టణ వాకిలిని శూరులైన సైనికులు ఎల్లవేళలా రక్షిస్తూ, కాపలా ఉంటారు.
గౌర్జలం పురం సంస్థాన మన్యతే గోపురం - నీరు ఉనికిపట్టుగా కలిగినది. పూర్వం ఇసుక నేలలో గోపురాన్ని నిర్మించేటప్పుడు పునాది కింద, పునాది చుట్టూ ఉండే ఇసుకలో తేమ శాతం ఉండేటట్టు చూసుకొనేవారు. తేమతో కూడిన ఇసుక ఆ పునాదికి మరింత గట్టితనాన్ని కలిగించి, ఎంత ఎత్తయిన గోపురం బరువునైనా కిందికి కుంగనీయదు. శ్రీరంగం రాజగోపురం, శ్రీకాళహస్తి రాజగోపురం దీనికి ఉదాహరణలు. కాగా వరంగల్‌లోని వేయి స్తంభాల గుడి, ఆగ్రాలోని తాజ్‌మహల్‌లను కూడా మరికొన్ని ఉదాహరణలుగా చెప్పకోవచ్చు.
దగ్గుపాటి నాగవరప్రసాద్ స్థపతి
9440525788
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి