Share News

Hyderabad Police Women: మహిళా శక్తి గుర్రాలపై గస్తీ

ABN , Publish Date - Aug 10 , 2025 | 05:12 AM

అశ్వాన్ని అధిరోహించి... గస్తీ కాయాలంటే మగ పోలీసులేనా..? మేమూ తక్కువేం కాదంటున్నారు మహిళా కానిస్టేబుళ్లు. గుర్రపు స్వారీలో శిక్షణ పొంది... మెరికల్లా తయారై... ‘సిటీ మౌంటెడ్‌ పోలీస్‌ విభాగం’లో భాగం అయ్యారు. అశ్వదళంలో...

Hyderabad Police Women: మహిళా శక్తి గుర్రాలపై గస్తీ

నవ శకం

మహిళా శక్తి... గుర్రాలపై గస్తీ

అశ్వాన్ని అధిరోహించి... గస్తీ కాయాలంటే మగ పోలీసులేనా..? మేమూ తక్కువేం కాదంటున్నారు మహిళా కానిస్టేబుళ్లు. గుర్రపు స్వారీలో శిక్షణ పొంది... మెరికల్లా తయారై... ‘సిటీ మౌంటెడ్‌ పోలీస్‌ విభాగం’లో భాగం అయ్యారు. అశ్వదళంలో రాష్ట్రంలోనే మొట్టమొదటి మహిళా బృందంగా చరిత్ర సృష్టించారు. అసమానతలను దాటి... అవమానలను భరించి... అనుకున్నది సాధించిన ఈ పదిమంది మౌంటెడ్‌ పోలీస్‌ మహిళా టీమ్‌పై ‘నవ్య’ ప్రత్యేక కథనం.

‘చీపుర్లు అమ్ముకోక చదువెందుకు’ అన్నారు...

నాపేరు ఎం.రేణుక. మాది హైదరాబాద్‌. అమ్మానాన్నలు భీమా, వెంకటేష్‌... చీపుర్లు అమ్ముతూ మమ్మల్ని పోషించేవారు. మేం చదువుకొంటామంటే... ‘చీపుర్లు అమ్ముకునేవాళ్లకు చదువెందుకు’ అని కొంతమంది హేళన చేశారు. దాంతో మా మామయ్య భగవాన్‌ నన్ను, అక్కను చేరదీశాడు. ఇద్దరినీ కష్టపడి చదివించాడు. అక్క ఎంబీబీఎస్‌ చదివి డెంటిస్టు అయ్యింది. ఎంబీఏ చదివిన నేను బ్యాంకు ఉద్యోగం చేయాలనుకున్నాను. అనుకోకుండా కానిస్టేబుల్‌ ఉద్యోగానికి అప్లై చేశాను. మొదటి ప్రయత్నంలోనే ఉద్యోగం సాధించాను. పోలీస్‌ ఉద్యోగం వచ్చిందని తెలియగానే ఆ రోజు చదువు వద్దన్నవారి నోళ్లు మూతపడ్డాయి.


4-Navya.jpg

పోలీసులంటే ఇంత భయమా అనిపించేది...

నా పేరు టి.సుభద్ర. మాది కడప. అమ్మానాన్నలు ఓబుల్‌రెడ్డి, మహాలక్ష్మి. వ్యవసాయం చేస్తారు. మేం ముగ్గురం అమ్మాయిలం... ఒక అన్నయ్య. నాన్న వ్యవసాయం చేస్తూనే మమ్మల్ని చదివించారు. నేను బీపీఈడీ చేశాను. మాది రాయలసీమ. నాన్న ఎప్పుడూ ఏదో ఒక గొడవలో పోలీస్‌ స్టేషన్‌లకు వెళ్లాల్సి వచ్చేది. స్టేషన్‌కు వెళ్లినప్పుడు పోలీసులకు ఇచ్చే గౌరవం, వాళ్లు ఊళ్లోకి వస్తున్నారంటే భయపడి ఎక్కడివాళ్లు అక్కడ గప్‌చు్‌పగా ఉండటం గమనించాను. అప్పుడు అనిపించేది... ‘పోలీసులంటే ఇంత భయపడతారా’ అని. అందుకే నేను పోలీస్‌ అయి మా నాన్నకు ఇబ్బందులు లేకుండా చూడాలని అనుకునేదాన్ని. మొదటి నుంచీ ఆటల్లో చురుగ్గా ఉండేదాన్ని. తైక్వాండో నేర్చుకున్నాను. ఇంటర్‌లో ఉన్నప్పుడు హరియాణాలో జరిగిన ‘ఆలిండియా అండర్‌-16 తైక్వాండో’ పోటీల్లో పాల్గొన్నాను. డిగ్రీ అయిపోగానే తెలంగాణలో వచ్చిన నోటిఫికేషన్‌ చూసి అప్లై చేశాను.

ఏం సాధించాం అనేదే ముఖ్యం...

నా పేరు జి.అఖిలాయాదవ్‌. నాన్న హెడ్‌ కానిస్టేబుల్‌. చిన్నప్పటి నుంచి నాన్న ఉద్యోగాన్ని గమనిస్తున్నాను. నేను పీజీ డిప్లమా ఇన్‌ క్లినికల్‌ న్యూట్రిషన్‌ చేశాను. మెడికల్‌ ఫీల్డ్‌ వైపు వెళ్దామనుకున్నా. కానీ నాన్న పోలీస్‌ డిపార్టుమెంట్‌ వైపు ప్రయత్నించమన్నారు. నాన్న ఆధ్వర్యంలోనే శిక్షణ తీసుకున్నా. మొదటి ప్రయత్నంలోనే కానిస్టేబుల్‌ ఉద్యోగం సాధించాను.


నాన్న చెప్పారు... చదువు ఆపద్దని...

నా పేరు మర్రి హవంతిక. మేం ముగ్గురు సంతానం. నాన్న రవీందర్‌ ఆటోడ్రైవర్‌. నేను ఇంటర్‌లో ఉన్నప్పుడు అమ్మ గుండెపోటుతో చనిపోయింది. చెల్లి, తమ్ముడు, నాన్న ఇబ్బంది పడతారని చదువు మానేద్దాం అనుకున్నా. కానీ నాన్న ఒప్పుకోలేదు. ‘అమ్మ లేదని చదువు మానొద్దు. ఆ చదువే రేపటి నీ భవిష్యత్తు’ అని చెప్పారు. నాన్న ఆటో నడిపి కష్టపడి మా ముగ్గురినీ చదివించారు. నేను గురుకులాల్లో చదివి బీకాం పూర్తి చేశాను. చెల్లి బీటెక్‌, తమ్ముడు ఇంటర్‌ చదువుతున్నారు.

ఫుట్‌బాల్‌ ఛాంపియన్‌ అవ్వానుకున్నా...

నా పేరు మొనాలిక. బీఎస్సీ ఎలకా్ట్రనిక్స్‌ చదివాను. నాన్న వేణు... ఫిలిం ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్‌. నాకు చిన్నప్పటి నుంచీ ఆటలు, యోగా అంటే ఇష్టం. స్కూల్లో ఫుట్‌బాల్‌ ఛాంపియన్‌ని. 2018లో అండమాన్‌ నికోబార్‌లో జరిగిన పోటీల్లో పాల్గొన్నాను. ఫుట్‌బాల్‌లో అంతర్జాతీయ స్థాయికి ఎదగాలనుకున్నా. స్పోర్ట్స్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ ఉందికదా అని పోలీస్‌ ఉద్యోగానికి అప్లై చేశాను. మొదటి ప్రయత్నంలోనే ఉద్యోగం వచ్చింది.

ఇద్దరు పిల్లలు... అయినా...

నా పేరు బి.అఖిల. మాది హైదరాబాద్‌లోని బోడుప్పల్‌. నాన్న ఆటోడ్రైవర్‌. అమ్మ కూలీ పనులు చేస్తుంది. మా ఇళ్లలో 10వ తరగతిలోనే పెళ్లి చేసి పంపిస్తారు. నాకూ అలాగే జరిగింది. నాకు పెళ్లై 13 ఏళ్లు. ఇద్దరు మగపిల్లలు. పెద్దవాడు 7వ తరగతి, చిన్నవాడు 5వ తరగతి చదువుతున్నారు. పెళ్లయిన కొద్ది రోజులకే అత్తారింట్లో నరకం ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూశాను. ఈ నరకం నుంచి బయటపడాలంటే ఇంకా చదువుకొని ఉద్యోగం సాధించాలని అనుకున్నాను. అందుకు భర్త, అత్తామామలు, ఆడపడచు ఒప్పుకోలేదు. అయినా పట్టు విడవకుండా, అమ్మానాన్నల సహకారంతో దూరవిద్యలో బీఏ పూర్తి చేశాను. ప్రైవేట్‌ స్కూల్లో టీచర్‌గా చేరాను. ఎస్సై ఉద్యోగం వస్తే భర్త, అత్తింటివారికి గట్టి సమాధానం చెప్పాలనుకున్నా. అప్పుడే కానిస్టేబుల్‌ ఉద్యోగానికి నోటిఫికేషన్‌ వచ్చింది. ఎలాగైనా ఉద్యోగం సాధించాలని నిర్ణయించుకున్నా. చెంగిచెర్ల గ్రౌండ్‌లో ఫిట్‌నెస్‌ ప్రాక్టీస్‌ ప్రారంభించాను. అక్కడ హెడ్‌ కానిస్టేబుల్‌ ప్రభాకర్‌రెడ్డి సార్‌ పరిచయం అయ్యారు. ఆయన ఈవెంట్స్‌కు సంబంధించిన మెళకువలు నేర్పించారు. కోచింగ్‌ ఇచ్చారు. అమ్మమ్మను వెంట తీసుకెళ్లి తెల్లవారుజామున 4 గంటల నుంచే ప్రాక్టీస్‌ చేసేదాన్ని. నా కష్టం వృథా పోలేదు. అనుకున్నట్లుగానే ఉద్యోగం సాధించాను.

శ్రీనివాస్‌ చింత, హైదరాబాద్‌


444-CJ.jpg

కమిషనరేట్‌ చరిత్రలోనే...

సిటీ పోలీస్‌ కమిషనరేట్‌ చరిత్రలో ఎప్పుడూ ఎవరూ చేయలేని ఎన్నో పనులు ఇప్పుడు చేస్తున్నాం. మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. భద్రత, బందోబస్తుల్లోనూ మహిళల భాగస్వామ్యం ఉండాలని ఇటీవల 35మంది ఏఆర్‌ మహిళా కానిస్టేబుళ్లతో స్వాట్‌ (స్విఫ్ట్‌ విమెన్‌ యాక్షన్‌ టీమ్‌) బృందాన్ని ఏర్పాటు చేశాం. వాళ్లు నేర్చుకున్న ఆత్మరక్షణ విద్య చూసి షాకయ్యాను. అప్పుడే నిర్ణయించుకున్నాం... అశ్వదళంలోనూ మహిళల భాగస్వామ్యం ఉండాలని. అందుకు తగ్గట్టుగా మొదటి బ్యాచ్‌గా పది మందిని ఎంపిక చేశాం. అద్భుతంగా హార్స్‌ రైడింగ్‌లో శిక్షణ పొందారు.

సీవీ ఆనంద్‌,

హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌

ఇవి కూడా చదవండి

ఉద్యోగం పోయిన తర్వాత లోన్ EMIలు చెల్లించాలా? మారటోరియం?

ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 10 , 2025 | 05:14 AM