Surprising Foods That Increase Liver Fat: వీటితో కాలేయ కొవ్వు
ABN , Publish Date - Oct 28 , 2025 | 01:51 AM
ధూమపానం, మద్యపానం కాలేయ కొవ్వును పెంచుతాయనే విషయం అందరికీ తెలిసిందే! అయితే ఆరోగ్యకరమైన ఆహారంగా భావించే కొన్ని పదార్థాలు కూడా ఇందుకు దోహదపడుతూ ఉంటాయి....
మీకు తెలుసా?
ధూమపానం, మద్యపానం కాలేయ కొవ్వును పెంచుతాయనే విషయం అందరికీ తెలిసిందే! అయితే ఆరోగ్యకరమైన ఆహారంగా భావించే కొన్ని పదార్థాలు కూడా ఇందుకు దోహదపడుతూ ఉంటాయి. కాలేయ కొవ్వును పెంచే ఆ పదార్థాలు ఇవే!
కొవ్వు తొలగించని పాల ఉత్పత్తులు: పాలు, చీజ్, మీగడ పెరుగు పోషకభరితమైనవే! అయితే వీటి పరిమితి మించితే కాలేయానికి చేటు తప్పదు. కొవ్వు తొలగించని పాల ఉత్పత్తులకూ కాలేయ కొవ్వుకూ సంబంధం ఉంటుందనే ఒక అధ్యయనం తాజాగా అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌లో ప్రచురితమైంది.
బేక్ ఉత్పత్తులు: ఎక్కువ శాతం బేకరీ ఉత్పత్తులన్నీ శుద్ధి చేసిన పిండి, శుద్ధి చేసిన చక్కెరలతోనే తయారవుతాయి. వీటిలో పోషకాలతో నిండిన పైపొర కొరవడుతుంది. కాబట్టి వీటితో తయారయ్యే బ్రెడ్, పేస్ట్రీలు, మఫిన్లు.. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ముప్పును పెంచుతాయి. అన్నం, బ్రెడ్, నూడుల్స్ వల్ల జపాన్ మహిళల్లో కాలేయ కొవ్వు పెరిగినట్టు, క్లినికల్ న్యూట్రిషన్‌లో ఒక అధ్యయనం ప్రచురితమైంది.
ప్రొటీన్ బార్స్: నట్స్, సీడ్స్, ఖర్జూరాలు, ఓట్స్... ఇలా ఆరోగ్యకరమైన పదార్థాలతో తయారయ్యే ప్రొటీన్ బార్స్‌లో కూడా హై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ లాంటి అనారోగ్యకరమైన తీపిని ఉపయోగిస్తారు. కాబట్టి ప్రొటీన్ బార్స్‌ను అతిగా తినడం వల్ల కాలేయ కొవ్వు ముప్పు కూడా పెరుగుతుంది.
నట్స్: అఫ్లాటాక్సిన్ మౌల్డ్ అనే విషపూరిత ఫంగస్ వేడిగా, తేమగా ఉండే వాతావరణాల్లో వృద్ధి చెందుతుంది. వేరుసెనగ, బాదం, పిస్తా, వాల్‌నట్స్, క్వినోవాల్లో ఈ ఫంగస్ పెరిగే అవకాశం ఎక్కువ. కాబట్టి ఈ నట్స్‌ను కొన్న రెండు నెలల్లోపే తినడం మంచిది. అలాగే తినే ముందు వీటిని నీళ్లలో నానబెట్టడం ఉత్తమం.
తీపి పానీయాలు: పండ్ల రసాలు ఆరోగ్యకరమే! కానీ సీసాల్లో దొరికే రెడీమేడ్ పండ్ల రసాల్లో చక్కెరలు అధిక మోతాదుల్లో ఉంటాయి కాబట్టి ఇవి కాలేయ కొవ్వును పెంచుతాయనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.
ఎండిన పండ్లు: ఎండుద్రాక్ష, ఎండు అప్రికాట్స్, ఎండుఖర్జూరాల్లో చక్కెరలు ఎక్కువగా ఉంటాయి. ఫలితంగా కాలేయ కొవ్వు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని పరిమితంగా తినాలి.
ఈ వార్తలు కూడా చదవండి..
రైళ్లు రద్దుపై రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ప్రయాణికులకు కీలక సూచన
కార్తీక మాసంలో ఈ నాలుగు ఆచరిస్తే..
For More AP News And Telugu News