Share News

Prophet Muhammad: నామస్మరణతో కార్యసాఫల్యం

ABN , Publish Date - Sep 19 , 2025 | 04:53 AM

మనిషికి జీవితంలో అనేక సమస్యలు, పరీక్షలు ఎదురవుతాయి. కొన్ని ఇబ్బందులు మన ప్రగతికి ఊహించలేని అవరోధంగా మారుతాయి. అలాంటి పరిస్థితుల్లో దైవనామాన్ని పఠిస్తూ పని మొదలుపెడితే... అది సజావుగా సాగిపోతుందని...

Prophet Muhammad: నామస్మరణతో కార్యసాఫల్యం

సందేశం

మనిషికి జీవితంలో అనేక సమస్యలు, పరీక్షలు ఎదురవుతాయి. కొన్ని ఇబ్బందులు మన ప్రగతికి ఊహించలేని అవరోధంగా మారుతాయి. అలాంటి పరిస్థితుల్లో దైవనామాన్ని పఠిస్తూ పని మొదలుపెడితే... అది సజావుగా సాగిపోతుందని బోధించారు దైవప్రవక్త మహమ్మద్‌. ‘‘అల్లాహ్‌ నామంతో రోజును ప్రారంభించాలి. ఉదయం లేచినది మొదలు రాత్రి నిద్రపోయేవరకూ... చిన్నదైనా, పెద్దదైనా ప్రతి పనినీ దేవుని పేరిటే ప్రారంభించాలి. అల్లాహ్‌ నామంతో మొదలు పెట్టిన పని ఒక ఆశయంగా మారుతుంది. ఆయన నామాన్ని స్మరిస్తే అన్ని పనులూ సాధ్యమవుతాయి. కష్టాలు తొలగిపోతాయి.

అల్లాహ్‌ నామం కేవలం ఒక మాట కాదు. అది ఒక నమ్మకం, మన హృదయంలో అనిశ్చితిని తొలగించి, మన సంకల్పాన్ని దృఢంగా చేసే ఆధ్యాత్మిక బలం. ‘నీవు ఒంటరిగా లేవు. అల్లాహ్‌ ఎప్పుడూ నీకు తోడుగా ఉన్నాడు’ అనే భరోసాను అది అందిస్తుంది. ఆయనను తలచుకుంటూ వేసే ప్రతి అడుగూ విజయానికి (స్వర్గానికి) మార్గం అవుతుంది’’ అని స్పష్టం చేశారు.

అంతిమ దివ్య గ్రంథమైన ఖురాన్‌లోని 114 సూరాలలో (అధ్యాయాలలో) ఒకటి మినహా మిగిలినవన్నీ అల్లాహ్‌ నామమైన ‘బిస్మిలా’్లతో ప్రారంభమవుతాయి. ‘అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్‌ పేరుతో ప్రారంభిస్తున్నాను’ అనే వాక్యంతో మొదలైన ఎన్నో గ్రంథాలు, లేఖలు, సంభాషణలు కనిపిస్తాయి. స్వర్గాన్ని సృష్టించిన, మహోన్నతుడైన ప్రభువు నామాన్ని కొనియాడుతూ ప్రారంభమైన కార్యాలు కూడా దివ్య ఖుర్‌ఆన్‌లో దర్శనమిస్తాయి. ‘‘ఏ పనినైనా ‘బిస్మిల్లా’ అని అనకుండా మొదలుపెడితే అది అసంపూర్తిగా మిగిలిపోతుంది. కాబట్టి పనులన్నిటినీ ఆ నామాన్ని ఉచ్చరిస్తూ ప్రారంభించండి. అది మిమ్మల్ని సైతాన్‌ నుంచి రక్షిస్తుంది. దైవ నామస్మరణ చేస్తున్నంత కాలం మనిషికి సర్వ శుభాలు కలుగుతాయి. అన్ని ఆటంకాలు తొలగిపోతాయి. మనిషికి తోడుగా, నీడగా దైవ సహాయం అందుతుంది. కాబట్టి అంతటా వ్యాపించి ఉన్న అల్లాహ్‌ నామంతోనే ఏ కార్యాన్నైనా మొదలుపెట్టాలి’’ అని దైవప్రవక్త మహమ్మద్‌ బోధించారు.

మహమ్మద్‌ వహీదుద్దీన్‌

ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 19 , 2025 | 04:53 AM