Strengthening Marital Bond: అనుబంధం బలంగా
ABN , Publish Date - Nov 27 , 2025 | 02:22 AM
భార్యాభర్తల అనుబంధానికి దంపతులిద్దరూ సమ ప్రాధాన్యం ఇవ్వాలి. అలాగే పరిస్థితులను అంగీకరించి, వాటికి తగ్గట్టు మసలుకోవాలి. కలిసి ఒకే ఇంట్లో ఒకే వాతావరణంలో జీవించేటప్పుడు, అడపా దడపా చీకాకులు...
కౌన్సెలింగ్
డాక్టర్! మేమిద్దరం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లం. గత రెండేళ్లుగా ఇంటి నుంచే పని చేస్తున్నాం. అయితే ఈ తరహా వర్క్ ఫ్రం హోం బాగున్నట్టే అనిపించినా, గత కొంత కాలంగా మా మధ్య చీకాకులు, కోపతాపాలూ పెరుగుతున్నాయి. వీటిని వదిలించుకుని పూర్వంలా అన్యోన్యంగా మసలుకోగలిగే వాతావరణాన్ని నెలకొల్పే మార్గం ఉందా?
- ఓ సోదరి, హైదరాబాద్.
భార్యాభర్తల అనుబంధానికి దంపతులిద్దరూ సమ ప్రాధాన్యం ఇవ్వాలి. అలాగే పరిస్థితులను అంగీకరించి, వాటికి తగ్గట్టు మసలుకోవాలి. కలిసి ఒకే ఇంట్లో ఒకే వాతావరణంలో జీవించేటప్పుడు, అడపా దడపా చీకాకులు తలెత్తడం సహజమే! అయితే ఇద్దరి మధ్యా గొడవలు తలెత్తడానికి కారణాలను అన్వేషించుకోవాలి. పొరపాటు ఎక్కడ జరుగుతుందో ఎవరికి వారు గమనించుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా కలిసి గడిపే సమయం విసుగు తెప్పించేలా ఉండకుండా అందుకు తగిన పరిష్కారాలు ఆలోచించాలి.
భావవ్యక్తీకరణ: చెబుతున్నది ఆలకించాలే తప్ప, ప్రతిస్పందించడం కోసం వినడం సరి కాదు. స్పందించడం కోసం చెబుతున్నది వినడం మొదలుపెడితే, పర్యవసానాలు తప్పవు
ప్రేమాప్యాయతలు: దంపతుల మధ్య అనుబంధం... ప్రేమ, ఆప్యాయతలతో ముడిపడి ఉండాలి. దాంపత్య బంధం మీద పట్టు సాధించాలంటే దంపతులు ఒకర్నొకరు అర్థం చేసుకోవాలి. సంసార జీవితం సజావుగా సాగించగలిగే మెలకువలను అలవరుచుకోవాలి.
నాణ్యమైన సమయం: పరిమాణం కంటే నాణ్యత ముఖ్యం. ఎంత సమయం కలిసి గడిపాం అనేది కాకుండా ఎంత నాణ్యమైన సమయాన్ని గడిపాం అనేదే ముఖ్యంగా దంపతులు భావించాలి. అలాంటి సమయం కోసం తీరిక చేసుకోవాలి.
ప్రేమ భాష: స్పర్శే ప్రేమ భాష. హత్తుకోవడం, స్పృశించడం, చేతులు కలపడం... ఇవన్నీ దంపతులను మానసికంగా చేరువ చేసేవే! కాబట్టి ప్రతి రోజూ అంతటి సాన్నిహిత్యంతోనే మెలగాలి.
దూర దృష్టి: జీవితం, అనుబంధం, కలిసి జీవితాన్ని కొనసాగించడంలో ఉండే ప్రయోజనాలను దూర దృష్టితో ఆలోచించాలి.
దంపతులిద్దరూ పరస్పర వృత్తులనూ, సమయాలనూ, స్వేచ్ఛలనూ గౌరవించుకుంటూ అద్భుతమైన అనుబంధాన్ని ఏర్పరుచుకోవాలి. అనుకూల భావాలను స్వాగతిస్తూ, ప్రతికూల భావాలకు చోటు లేకుండా చేసుకోవాలి.
డాక్టర్ మధురిమ రెడ్డి పూత,
సైకాలజిస్ట్, హైదరాబాద్
ఈ వార్తలు కూడా చదవండి..
బీసీలకు మోసం జరుగుతుంటే.. బీఆర్ఎస్ నుంచి నో రియాక్షన్: కవిత
For More AP News And Telugu News