Share News

దొంగలో వైరాగ్యం

ABN , Publish Date - Feb 14 , 2025 | 03:01 AM

ఆధ్యాత్మికవేత్తగా, స్వామి వివేకానందకు గురువుగా, ఎందరికో జ్ఞానమార్గదర్శిగా శ్రీ రామకృష్ణ పరమహంస ప్రసిద్ధులు. భక్తిని, ఆధ్యాత్మికతను బోధించడం కోసం వివిధ సందర్భాలలో ఆయన చెప్పిన కథలు...

దొంగలో వైరాగ్యం

ఆధ్యాత్మికవేత్తగా, స్వామి వివేకానందకు గురువుగా, ఎందరికో జ్ఞానమార్గదర్శిగా శ్రీ రామకృష్ణ పరమహంస ప్రసిద్ధులు. భక్తిని, ఆధ్యాత్మికతను బోధించడం కోసం వివిధ సందర్భాలలో ఆయన చెప్పిన కథలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. వాటిలో ఒకటి:

పూర్వం ఒక రాజ మందిరంలోకి దొంగ చొరబడ్డాడు. విలువైన వస్తువులు ఏవైనా దోచుకొని పోవాలని అతని ఆలోచన. రాజు ఉన్న గదిలోకి అతను ప్రవేశించేసరికి... రాజుకు, రాణికి మధ్య సంభాషణ జరుగుతోంది. ‘‘రాజ్యం, సంపద ఎల్లకాలం ఉండవు. దేవుడి కృపే మనకు తోడుగా వస్తుంది. కాబట్టి మన కుమార్తెను నదీతీరంలో నివసిస్తున్న సాధువుల్లో ఒకరికి ఇచ్చి పెళ్ళి చేస్తాను. రేపే మన ప్రతినిఽధులను అక్కడికి పంపుతాను’’ అని రాజు చెప్పడం ఆ దొంగ విన్నాడు. ‘ఈ సమయంలో నేను ఇక్కడికి రావడం నా అదృష్టం. ఏకంగా రాజకుమార్తెను పెళ్లాడే అవకాశం రాబోతోంది. సాధువు వేషం వేసుకొని, రేపు ఉదయం నదీ తీరానికి వెళ్ళి కూర్చుంటాను. రాజకుమార్తెకు నేనే తగిన వరుణ్ణని రాజు, అతని పరివారం భావించేలా నటిస్తాను’ అనుకున్నాడు.


మరుసటి రోజు పొద్దున్నే... అతను సాధువులా తయారయ్యాడు. నది దగ్గరకు వెళ్ళి, అక్కడ ఉన్న సాధువుల వరుసలో ఆఖర్న కూర్చున్నాడు. కొంతసేపటికి రాజ ప్రతినిధులు వచ్చారు. సాధువుల దగ్గర ఆగి, ‘‘రాజ కుమార్తెను వివాహం చేసుకుంటారా?’’ అని అడుగుతున్నారు. వారిలో ఎవరూ అందుకు అంగీకరించలేదు. చివరకు వారు దొంగ దగ్గరకు వచ్చి, అతణ్ణి కూడా అడిగారు. ‘అవున’ని చెప్పాలనుకున్న దొంగకు ఆ క్షణంలో నోట మాట రాలేదు.

రాజ ప్రతినిధులు రాజమందిరానికి వెళ్ళి, జరిగినదంతా రాజుకు చెప్పారు. ‘‘మహారాజా! దాదాపు అందరూ తిరస్కరించారు. ఒక యువ సాధువు మాత్రం ఏదీ మాట్లాడలేదు. అతణ్ణి బహుశా ఒప్పించవచ్చేమో!’’ అన్నారు. అప్పుడు రాజే స్వయంగా నదీతీరానికి వచ్చాడు. సాధువు వేషంలో ఉన్న దొంగకు నమస్కరించాడు. తన కుమార్తెను పెళ్ళాడవలసిందిగా వేడుకున్నాడు.


ఆ క్షణంలో దొంగ మనసు మారిపోయింది. ‘నేను కేవలం సాధువులా వేషం కట్టాను. కానీ రాజే వచ్చి నన్ను ప్రార్థిస్తున్నాడు. గౌరవిస్తున్నాడు. దీనికంతటికీ నేను అర్హుణ్ణి కాదు. రాజుకే అక్కరలేని సంపదలు నాకెందుకు? ఈ క్షణం నుంచి నేను సాధువుగా మారిపోతాను’ అనుకున్నాడు. ఈ ఆలోచన అతణ్ణి తీవ్రంగా ప్రభావితం చేసింది. మోసగించి రాజకుమార్తెను పెళ్ళాడాలనే ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. రాజు ప్రతిపాదనను తిరస్కరించాడు. మిగిలిన సాధువులతో కలిసి, సాధన చేసి, కొంతకాలానికి అందరికీ గౌరవనీయుడిగా మారాడు.

ఈ కథను శ్రీ రామకృష్ణులు తన శిష్యులకు వివరిస్తూ... ‘‘మనిషిలో వైరాగ్యం ఎప్పుడు వస్తుందో, మంచి పనుల పట్ల, దైవం పట్ల ఎలా ఆకర్షితులవుతారో ఊహించడం కష్టం. ఒక్కొక్కసారి తప్పుడు మార్గంలో మనం పయనించాలనుకున్నా... దైవ సంకల్పం మనల్ని మంచి దారిలోకి మళ్ళిస్తుంది. ఉన్నతులుగా మారుస్తుంది’’ అని చెప్పారు.

(18న శ్రీ రామకృష్ణ పరమహంస జయంతి)


Also Read:

ఇద్దరు మహిళలు కలిస్తే ఇలాగే ఉంటుందేమో..

బర్డ్ ఫ్లూ.. సీఎస్ విజయానంద్ ఏం చెప్పారంటే..

అప్పుల తెలంగాణ.. కేంద్ర మంత్రి షాకింగ్ కామెంట్స్..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Feb 14 , 2025 | 03:01 AM