Share News

Six Rituals to Follow During Kartika Month: కార్తికంలో ఆరు నియమాలు

ABN , Publish Date - Oct 24 , 2025 | 02:39 AM

ఆనాటి ఋషులు ఏర్పాటు చేసిన సంప్రదాయాల వెనుక ఎన్నో ఆరోగ్య, ఆధ్యాత్మిక, సామాజిక, జీవనగమన సంబంధమైన ఎన్నో అంశాలు ఉన్నాయి. తమతోపాటు అందరినీ తరింపజేయాలనే నిస్వార్థమైన దృక్పథంతో అనేక...

Six Rituals to Follow During Kartika Month: కార్తికంలో ఆరు నియమాలు

కార్తిక మాసం

ఆనాటి ఋషులు ఏర్పాటు చేసిన సంప్రదాయాల వెనుక ఎన్నో ఆరోగ్య, ఆధ్యాత్మిక, సామాజిక, జీవనగమన సంబంధమైన ఎన్నో అంశాలు ఉన్నాయి. తమతోపాటు అందరినీ తరింపజేయాలనే నిస్వార్థమైన దృక్పథంతో అనేక విధానాలను వారు మనకు ఏనాడో చెప్పారు.వాటిలో... కార్తిక మాసంలో ఆచరించవలసిన నియమాల గురించితెలుసుకుందాం.

స్నానం దీపంచ దానంచ పురాణ శ్రవణం ద్విజాత్‌

బిల్వార్చనం చైవ వన భోజనమాచరేత్‌... ‘‘కార్తిక మాసం అంతటా చేయవలసినవి... స్నానం, దీపం వెలిగించడం, దానం, పండితుల ద్వారా పురాణాన్ని వినడం, లక్ష బిల్వార్చనం, వన భోజనం’’ అని చెబుతోంది శాస్త్రం.

స్నానం: ఆశ్వయుజం, కార్తికం అనే రెండు మాసాలకూ కలిపి ‘శరద్రుతువు’ అని పేరు. ఆశ్వయుజంలో చలి ప్రారంభమైతే... కార్తికంలో కొంత మంచు చేరుతుంది. ఇలాంటి వాతావరణంలో ప్రజలు అనారోగ్యాలకు గురికావడం సాధారణంగా జరుగుతుంది. ఈ వాతావరణ మార్పును శరీరానికి అలవాటు పడేలా చేస్తూ, ఆరోగ్యం దెబ్బతినకుండా ఉండాలంటే... ప్రతి నిత్యం చన్నీటి స్నానం చేయాలి. ‘అసలే చలి. అందులోనూ చన్నీటి స్నానమా?’’ అనుకోకూడదు. ఔషధం తప్పనిసరిగా తీయగానే ఉండాలనుకోవడం సరికాదు. తెల్లవారుజామున స్నానాలు ప్రారంభించాక... మొదటి నాలుగైదు రోజులు జలుబు, ముక్కు బిగుసుకుపోవడం లాంటివి కలుగుతాయి. శత్రువుతో పోరాడేటప్పుడు... రెండు మూడు దెబ్బలు తిని ఊరుకుంటే ఓడిపోయినట్టే కదా! ఆ పరిస్థితిని దాటడం కోసం... స్నానాలను కొనసాగిస్తే శత్రువు లొంగుతాడు. శరీరం ఆ స్నానాలకు అలవాటు పడుతుంది. లేదా... మొదటి రెండు మూడు రోజులు కొద్దిగా వెచ్చగా, ఆ తరువాత రెండు రోజులు గోరు వెచ్చగా... శరీరం అలవాటు పడేలా చేస్తే... ఆ తరువాత పూర్తిగా చన్నీటి స్నానాలు చేయవచ్చు. అది పెద్ద ఇబ్బందే కాదు. ‘స్నానం చేసి తీరాలన్నారు కదా!’ అని అనారోగ్యవంతులు, చన్నీటి స్నానాన్ని తట్టుకోలేని వృద్ధులు, రాత్రంతా పనిపాటలు చేసి పొద్దున్న నిద్రించే ఉద్యోగులు దీన్ని పాటించాలని నిర్బంధమేదీ లేదు. కొన్ని సందర్భాల్లో వారికి అది ప్రమాదకరం కూడా. ఈ విషయాన్ని కూడా పెద్దలు చెప్పారు.

దానం: దానం అనగానే లక్షలో, కోట్లో ఖర్చు చేయనవసరం లేదు. దైవదర్శనం కోసం ఆలయానికి వెళ్ళినప్పుడు... దీపారాధన నిమిత్తం కొంత నూనెను రోజూ ఇవ్వడం, అర్చకులకు శక్తిమేర బియ్యాన్ని సమర్పించడం, భోజనం చేసేటప్పుడు కాకులకు నేతి అన్నపు ముద్దను, పిచ్చుకలకు వడ్ల గింజలను పెట్టడం, చీమల కన్నాల దగ్గర బెల్లపు పొడి వేయడం, కుక్కలకు పెరుగన్నం పెట్టడం, పిల్లుల కోసం పాత్రలో పాలు ఉంచడం... ఇవన్నీ దానాలే. అన్ని జీవులూ భగవంతుని సంతానమే. కాబట్టి ఆ సంతానంలో ఒకరుగా మిగిలిన జీవులనూ మనం ఆదరించాలి. అప్పుడే మనకు, మన కుటుంబానికి ఆయన ఆశీస్సులు కలుగుతాయి.


555-navya.jpg

పురాణ శ్రవణం: స్నానం, దీపం, దానం ద్వారా భౌతిక శుద్ధి కలుగుతుంది. మానసిక శుద్ధి కోసం పురాణాలను వినాలి. మనకు వచ్చే సమస్యల్లో చాలా వాటిని ఎవరికీ చెప్పుకోలేం. ఇరుగు పొరుగువారికి చెబితే... వాటికి చిలవలూ పలవలూ జోడించి ఊరంతా చాటింపు వేయవచ్చు. మరి వాటికి పరిష్కారం ఎలా? పురాణాలు ఎన్నో కథలను చర్చిస్తాయి. వాటిలో చాలా సమస్యలకు పరిష్కారాలు సులువుగా దొరుకుతాయి. గుడిలో పురాణం వినిపించే పండితులను నేటికీ సన్మానిస్తూ ఉండడానికి కారణం... ఈ పరిష్కార లాభమే. అంతేకాదు... ధర్మాచరణను, సత్ప్రవర్తనను పురాణాలు నేర్పుతాయి. చెడు దారులు పట్టినవారికి పతనం తప్పదనే సత్యాన్ని స్పష్టం చేస్తాయి.

లక్ష బిల్వార్చన: మారేడు ఆకులతో కషాయం కాచుకొని, రోజూ ఒక్క అర చెంచా చొప్పున తీసుకుంటే శ్వాసకోశ వ్యాధులు తొలగిపోతాయని, లేత మారేడు ఆకులను దంచి, ముద్ద చేసుకొని, ఆవు నేతిలో మిరియపు గింజంత కలిపి రోజూ తింటే జీర్ణక్రియలో లోపం ఉండదని పూర్వులు చెప్పారు. ఇక... లక్ష మారేడు దళాల మీద నుంచి వచ్చే గాలిని అర్చన ముగిసే వరకూ... సుమారు అయిదు గంటల సేపు పీలిస్తే శ్వాస వ్యాధులు పోతాయనేది వైద్య శాస్త్ర రహస్యం. ఈ మాసంలోని శీతోష్ణస్థితి అనారోగ్యాన్ని కలిగించేది కావడం వల్లే... ఈ పద్ధతిని ఏర్పాటు చేశారు. లేత బిల్వ దళాన్ని నీటిలో వేసుకొని, ఆ నీటిని అయిదారు గంటల తరువాత తాగితే ఆరోగ్యం బాగుంటుంది. మారేడువల్ల కలిగే ఇలాంటి ప్రయోజనాలను బిల్వదళార్చన తరువాత పెద్దలు వివరిస్తూ ఉంటారు. బిల్వం... శివ, విష్ణు ప్రీతికరమైనది. మూడు ఆకులు శివుడి నేత్రాలకు సంకేతం. లక్ష్మీ పూజకు కూడా అవి ప్రశస్తమైనవి. అందుకే... బిల్వ దళాలను కోసిన తరువాత... పది రోజుల పాటు అవే పత్రాలతో పూజ చేయడం దోషం కాదంది శాస్త్రం.


వనభోజనం: వర్ష ఋతువైన శ్రావణ, భాద్రపదాల్లో బాగా కురిసిన వర్షాలకు... అంతకుముందు విత్తనాలుగా ఉన్న మొక్కలు క్రమంగా పెరుగుతాయి. అవి తమలో ఓషధీ శక్తులన్నిటినీ నింపుకొని, దృఢమైన మొక్కలుగా ఉండేది కార్తికానికే. అందుకే కార్తిక వన భోజనాల పేరిట... వయోధికులను తీసుకువెళ్ళి, ఈ ఓషధీ వృక్షాలు, మొక్కల గురించి వివరంగా తెలుసుకుంటే... మన ఆరోగ్యం మన చేతిలో ఉన్నట్టే. సృష్టిలో మొక్కలకు ఉన్న శక్తి ఎంతటిదో కూడా మనకు అర్థం అవుతుంది. ఇలా పైన పేర్కొన్న అన్నిటిలో ఉన్న ఆరోగ్య రహస్యాలను తెలుసుకున్నప్పుడు... కార్తిక మాస ప్రాధాన్యం మనకు అవగతం అవుతుంది.

డాక్టర్‌ మైలవరపు శ్రీనివాసరావు

55-navya.jpg

దీపం: ‘తైలం’ అంటే ‘తిలలను (నువ్వులను’ పిండగా వచ్చినది’ అని అర్థం. కాబట్టి అవకాశం ఉంటే నెల మొత్తం ఆవు నేతి దీపాలు రెండు, లేదా నువ్వుల నూనె దీపాలు రెండు నిత్యం పూజా మందిరంలో వెలిగించాలి. ప్రదోష సమయంలో (సాయంత్రం ముగిసి రాత్రి రాబోవడానికి ముందు... చిరు సంజ చీకటి కాలంలో) ప్రధాన ద్వారానికి అటూ ఇటూ పెట్టాలి. చలి వాతావరణంలో పెరిగే లక్షణం ఉన్న హానికర క్రిములు... ఇలా వీధి గుమ్మం దగ్గిర పెట్టిన దీపానికి ఆకర్షితమై, మంటల్లో పడి మరణిస్తాయి. లేదా ఆ దరిదాపుల్లోకి రావు. దీపం పెట్టిన తరువాత... ఆ వెలుగులో దైవాన్ని దర్శించుకోవాలి. దేవుని స్తోత్రాలు, మంత్రాలు... ఇలా వేటినైనా చదువుకోవచ్చు. దీపాలను పత్తితో చేసిన వత్తులతో, మట్టి ప్రమిదల్లో పెట్టడం శ్రేష్టం.

ఈ వార్తలు కూడా చదవండి..

అబుదాబీలో వరుస భేటీలు.. పెట్టుబడులపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్

పీపీపీ మోడ్ అంటే అమ్మడం కాదు.. వైసీపీపై రఘరామ సెటైర్లు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 24 , 2025 | 02:39 AM