Significance of Shami Puja: శమీ పూజ వెనుక అసలు కథ ఇదే..
ABN , Publish Date - Oct 02 , 2025 | 03:15 AM
విజయదశమి రోజున అపరాజితాదేవిని శమీవృక్షం వద్ద పూజించే సంప్రదాయం ఉంది. శమీ వృక్షం (జమ్మి చెట్టు)లో అపరాజితా దేవి కొలువై ఉంటుందని విశ్వాసం. అమ్మవారి సహస్ర నామాల్లో ‘అపరాజిత’ ఒకటి. అంటే...
విజయదశమి రోజున అపరాజితాదేవిని శమీవృక్షం వద్ద పూజించే సంప్రదాయం ఉంది. శమీ వృక్షం (జమ్మి చెట్టు)లో అపరాజితా దేవి కొలువై ఉంటుందని విశ్వాసం. అమ్మవారి సహస్ర నామాల్లో ‘అపరాజిత’ ఒకటి. అంటే ‘పరాజయం లేనిది’ అని అర్థం. విజయానికి ఆమె అధిదేవత. ‘యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా’ అని ‘అపరాజితా స్తోత్రం’ వర్ణించింది. అపరాజితా దేవి సర్వ జీవుల్లో శక్తి రూపంలో ఉంటుందని భావం. దానవీయ గుణాలపై గెలుపు సాధించడానికి మనలో ఉన్న శక్తిని ప్రేరేపించాలని అమ్మవారిని ప్రార్థించాలి. దేవ దానవులు క్షీరసాగర మథనం చేసినప్పుడు ఉద్భవించిన పవిత్రమైన దేవతా వృక్షాల్లో జమ్మి చెట్టు ఒకటి.. అందుకే యాగాల కోసం నిప్పు రాజెయ్యడానికి జమ్మి చెట్టు కలపనే వినియోగించేవారు. రావణ సంహారానికి ముందు శ్రీరాముడు శమీ వృక్షానికీ, అపరాజితా దేవికీ పూజలు ఆచరించాడని పురాణాలు పేర్కొంటున్నాయి. పాండవులు అజ్ఞాతవాసం మొదలుపెట్టడానికి ముందు తమ ఆయుధాలను శమీ వృక్షం మీద దాచారనీ, అజ్ఞాతవాసం ముగిసిన తరువాత వాటిని తిరిగి తీసుకున్నారనీ మహాభారతంలోని విరాటపర్వంలో కథ ఉంది. విజయదశమి రోజున...
శమీ శమయతే పాపం శమీ శత్రువినాశిని
అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని... అనే శ్లోకం పఠించి, జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే... అపరాజితాదేవి కటాక్షంతో శత్రు భయం తొలగి విజయం చేకూరుతుందనీ, దోషాలు తొలగిపోయి సకల కార్యసిద్ధి కలుగుతుందనీ పెద్దలు చెబుతారు.
పాలపిట్ట దర్శనం...
దసరా పండుగలో శమీ వృక్షంతో పాటు పాల పిట్టకు ఉన్న ప్రాధాన్యం కూడా ఎక్కువే. పాలపిట్టను పవిత్రంగా భావించడం వెనుక ఉన్న జానపద గాథ ప్రకారం... పాండవులు అరణ్యవాసం, అజ్ఞాతవాసం పూర్తి చేసి తిరిగి వస్తూ ఉండగా, వారికి పాలపిట్ట కనిపించింది. వారు దాన్ని చూసినప్పటి నుంచీ వరుసగా అన్నీ విజయాలే కలిగాయట! పాలపిట్ట దర్శనం వల్ల చేసే ప్రతి పనిలోనూ గెలుపు తప్పకుండా లభిస్తుందన్న విశ్వాసం ఉంది.అందుకే విజయ దశమి రోజున పాలపిట్టను దర్శించడం శుభప్రదంగా భావిస్తారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నగదు ఇస్తానన్నా వదల్లేదు.. బాధితురాలి ఆవేదన..
For More AP News And Telugu News