ఓణీల్లో వెలుగు నగలు
ABN , Publish Date - Jun 18 , 2025 | 01:58 AM
ఓణీల ఫంక్షన్‌లో సంప్రదాయ నగలదే పెద్ద పీట అయినా, వాటికి కొంత ఆధునికతను జోడిస్తే సరికొత్తగా వెలిగిపోవచ్చు. ఇందుకోసం అవే నగలకు కొత్త హంగులు అద్దాలి...

ఫ్యాషన్
ఓణీల ఫంక్షన్‌లో సంప్రదాయ నగలదే పెద్ద పీట అయినా, వాటికి కొంత ఆధునికతను జోడిస్తే సరికొత్తగా వెలిగిపోవచ్చు. ఇందుకోసం అవే నగలకు కొత్త హంగులు అద్దాలి.
ఇలాంటి నగలు మేలు
మెడలో రెండు హారాలకు బదులు ఒకే హారాన్ని ఎంచుకునేపనైతే, కాస్త భారీగా ఉండే మధ్యస్త పొడవున హారాన్ని ఎంచుకోవచ్చు. వీటిలో వెచ్చించే డబ్బును బట్టి ప్లెయిన్ గోల్డ్ లేదా వజ్రాల నగలను ఎంచుకోవచ్చు. అలాగే వేడుక సమయాన్ని బట్టి కూడా నగల ఎంపికలో కొన్ని నియమాలు పాటించాలి. వేడుక ఉదయం అయితే పూర్తి బంగారంతో తయారైన నగలు బాగుంటాయి. అలాకాకుండా రాత్రి వేళ అయితే మెరిసే జాతి రాళ్లు, మరీ ముఖ్యంగా పోల్కి, కుందన్, మోజనైట్స్ లేదా వజ్రాల నగలైతే మిరుమిట్లు గొలుపుతూ ఆడపిల్లల అందాన్ని రెట్టింపు చేస్తాయి.
కాసుల పేరు, వరాల మాల
ఓణీల వేడుకలో ఆడపిల్లలకు పోల్కి నెక్లెస్, కాసుల హారం కూడా వేసుకోవచ్చు. ఇవి సంప్రదాయ నగలు కాబట్టి కాసుల హారం పాత ఫ్యాషన్ అనుకోనవసరం లేదు. కాసుల పేరు వద్దనుకునే వారు, ‘రాంపరి వరాల మాల’ వేసుకోవచ్చు. మరీ భారీ నగలు ఎంచుకుంటే పిల్లలు పెద్దయ్యాక వేసుకోలేకపోవచ్చు. కాబట్టి కాస్త తేలికపాటి మాలనే ఎంచుకోవటం మేలు. వీటిని తర్వాత అయినా మార్చుకోవచ్చు.
తక్కువ బరువులో
వడ్డాణం కొనలేకపోతే, బంగారు మెరుగు వేసిన వెండి నగలూ, గిల్టువీ దొరుకుతాయి. మాంగ్ టీకా (పాపడి బిళ్ల), చంపసరాలు, ముక్కు పుడక అలంకరించటం కూడా తాజా ఫ్యాషన్. ఇవి తక్కువ బరువులోనే దొరుకుతాయి. కాబట్టి తక్కువ బంగారంతో ఆడంబరంగా అలంకరించాలనుకుంటే వీటిని ఎంచుకోవాలి. వీటితోపాటు జడ బిళ్లలూ అలంకరించుకోవచ్చు.
ఇవి కూడా చదవండి
సంచలనం.. షర్మిల కాల్స్ రికార్డ్.. అన్నకు సమాచారం
మా అమ్మ, బిడ్డలు ఏడుస్తున్నా పట్టించుకోలేదు.. శిరీష ఆవేదన
Read Latest AP News And Telugu News