ప్రజారథ సారథి
ABN , Publish Date - Jun 18 , 2025 | 02:08 AM
బస్సులో డ్రైవింగ్ సీటు అంటే... అందులో కచ్చితంగా మగవారే కనిపిస్తారు. దశాబ్దాలుగా చూస్తున్న దృశ్యం ఇది. కానీ ఆ సంప్రదాయానికి తెరదించారు వాంకుతోడు సరిత. (డీటీసీ)లో పదేళ్లపాటు...

సంకల్పం
బస్సులో డ్రైవింగ్ సీటు అంటే... అందులో కచ్చితంగా మగవారే కనిపిస్తారు. దశాబ్దాలుగా చూస్తున్న దృశ్యం ఇది. కానీ ఆ సంప్రదాయానికి తెరదించారు వాంకుతోడు సరిత. ఢిల్లీ ట్రాన్స్‌పోర్డు కార్పొరేషన్ (డీటీసీ)లో పదేళ్లపాటు బస్సు నడిపిన ఆమె... ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ)లో మొట్టమొదటి మహిళా డ్రైవర్‌గా చరిత్ర సృష్టించారు. మహిళలు తలుచుకొంటే అసాధ్యమనేది ఏదీ లేదంటున్న సరిత... ‘నవ్య’తో తన అనుభవాలు పంచుకున్నారు.
‘‘యాదాద్రి భువనగిరి జిల్లా సీపీయానాయక్ తండాలో వ్యవసాయ కుటుంబం మాది. అమ్మ రుక్క, నాన్న రాంకోటి. మేం ఆరుగురు సంతానం. ఐదుగురు ఆడపిల్లల్లో నేను చిన్నదాన్ని. స్థానికంగా పదో తరగతి వరకు చదువుకున్నా. అక్కల పెళ్లిళ్లు చేయడంతో మా కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది. రోజు గడవడం కష్టంగా మారింది. దీంతో నేను చదువు ఆపేసి... 2004లో ఊళ్లో ఆటో నడపడం మొదలుపెట్టాను. ఒకటీ రెండు కాదు ఆరేళ్లపాటు ఆటో నడిపాను. అమ్మానాన్నలకు ఆసరా అయ్యాను. ఒక ఆడపిల్ల ఆటో నడపడం అంటే అందరూ వింతగా చూసేవారు. కొందరు అభినందించేవారు.
ఢిల్లీ వెళ్లి డ్రైవింగ్...
అలా ఒక స్వచ్ఛంద సంస్థ దృష్టిలో పడ్డాను. సంస్థవారు నన్ను ఢిల్లీకి తీసుకువెళ్లి డ్రైవింగ్‌లో శిక్షణ ఇప్పించారు. అక్కడ నేను భారీ వాహనాలు నడపడం నేర్చుకున్నాను. సదరు సంస్థ దేశవ్యాప్తంగా మొత్తం 15 మంది మహిళలకు శిక్షణ ఇచ్చింది. అందులో విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్నది నేనొక్కదాన్నే. బాగా నైపుణ్యం సంపాదించాక హెవీ వెహికిల్ లైసెన్స్ తెచ్చుకున్నాను. దాంతో ‘ఢిల్లీ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్’లో డ్రైవర్‌గా ఉద్యోగం లభించింది. ఆ క్షణం ఎంతో ఉద్వేగానికి లోనయ్యాను. దేశ రాజధాని. నిత్యం రద్దీగా ఉండే రోడ్లు. ఆ రహదారులపై భారీ వాహనం నడపడం అంటే సాధారణ విషయం కాదు. అడుగడుగునా సవాళ్లు ఎదురవుతాయి. కానీ నేను ఏ రోజూ ఇబ్బంది పడిందిలేదు. నావల్ల కాదని అనుకోలేదు.
కన్నవారి కోసం...
పదేళ్లపాటు ఢిల్లీ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్‌లో పని చేశాను. ప్రభుత్వ ఉద్యోగం. మంచి జీతం. కానీ ఊళ్లో అమ్మానాన్నలను చూసుకోవడానికి ఎవరూ లేకపోవడం నన్ను బాధించింది. ఓ రోడ్డు ప్రమాదంలో నాన్న కాలు విరిగింది. వయోభారంతో కంటిచూపు మందగించింది. ఇటీవల ప్రమాదవశాత్తూ అమ్మ కాలికి కూడా ఫ్రాక్చరయింది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని సొంతూరికి తిరిగి రావాలని నిర్ణయించుకున్నాను. దాంతో ఢిల్లీలో ఉద్యోగం వదిలేశాను. నేను ఉద్యోగం మానేయడంతో మాకు ఏ ఆధారం లేకుండాపోయింది. దీంతో స్థానిక నాయకులు, అధికారులను కలిశాను. మా కుటుంబ ఆర్థిక పరిస్థితి గురించి వివరించాను. నా నైపుణ్యం, అనుభవాన్ని గుర్తించి ఉద్యోగ అవకాశం కల్పించాలని విన్నవించుకున్నాను. ఆ ప్రయత్నాలు ఫలించాయి. అయితే ప్రస్తుతం ఆర్టీసీలో నేరుగా నియామకాలు లేకపోవడంతో తాత్కాలికంగా జేబీఎం విద్యుత్ బస్సు నడిపేందుకు అధికారులు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు హైదరాబాద్- మిర్యాలగూడ రూట్‌లో విధులు నిర్వర్తిస్తున్నాను. ఢిల్లీ రద్దీ రోడ్లపై బస్సు నడిపిన అనుభవంవల్ల ఇక్కడ డ్రైవింగ్ ఎంతో సులువుగా అనిపిస్తోంది. అన్నిటికీ మించి అమ్మానాన్నలను దగ్గరుండి చూసుకోగలుగుతున్నాను. ఇప్పుడు నా మనసు కాస్త కుదటపడింది.’’
యస్.సోమేశ్వర్
అందుకే పెళ్లి వద్దనుకున్నా...
నలుగురు అక్కలకు పెళ్లిళ్ల సమయంలో డబ్బు సర్దుబాటుకాక అమ్మానాన్న ఎన్నో ఇబ్బందులు పడ్డారు. వారి కష్టం చూసి నేను ఎంతో బాధపడేదాన్ని. నేను వారికి భారం కాకూడదనుకున్నాను. అందుకే ఆటో నడిపాను. కన్నవారికి దూరంగా ఢిల్లీ వెళ్లి ఉద్యోగం చేశాను. నా పెళ్లితో అమ్మానాన్నలపై మరింత భారం మోపకూడదని అనుకున్నాను. అంతేకాదు... నేను అత్తింటికి వెళ్లిపోతే వాళ్లు ఒంటరి అయిపోతారు. వృద్ధాప్యంలో ఏ దిక్కూ లేక అవస్థలు పడతారు. అందుకే చివరి వరకు వారికి తోడుగా ఉండాలని భావించి... పెళ్లి చేసుకోకూడదనే నిర్ణయానికి వచ్చాను.
ఇవి కూడా చదవండి
సంచలనం.. షర్మిల కాల్స్ రికార్డ్.. అన్నకు సమాచారం
మా అమ్మ, బిడ్డలు ఏడుస్తున్నా పట్టించుకోలేదు.. శిరీష ఆవేదన
Read Latest AP News And Telugu News