శరీరం నుంచి దుర్వాసనా
ABN , Publish Date - Jun 18 , 2025 | 01:51 AM
కొంతమందికి శరీరం నుంచి దుర్వాసన వస్తూ ఉంటుంది. వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడం, వాతావరణ కాలుష్యం, మితిమీరి చెమట పట్టడం లాంటి కారణాల వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది...

కొంతమందికి శరీరం నుంచి దుర్వాసన వస్తూ ఉంటుంది. వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడం, వాతావరణ కాలుష్యం, మితిమీరి చెమట పట్టడం లాంటి కారణాల వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. చిన్నపాటి జాగ్రత్తలతో ఈ సమస్యనుంచి బయటపడవచ్చు.
రోజుకు రెండుసార్లు తప్పనిసరిగా గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. సబ్బుతో కాకుండా సున్నిపిండి లేదా కుంకుడు రసంతో శరీరాన్ని రుద్దుకుంటే చర్మ రంధ్రాలు పూర్తిగా శుభ్రమవుతాయి. హానికారక బ్యాక్టీరియాలు కూడా తొలగి సమస్య చాలావరకు తీరుతుంది.
తల, చెవుల వెనక భాగం, మెడ, పాదాల మీద ఎక్కువగా చెమట పడుతూ ఉంటుంది. దీనివల్ల కూడా శరీరం నుంచి దుర్వాసన రావచ్చు. స్నానం చేసేటప్పుడు ఈ భాగాలను ప్రత్యేకంగా శుభ్రం చేసుకోవాలి.
స్నానం చేసిన తరవాత పొడిగా పరిశుభ్రంగా ఉన్న దుస్తులను మాత్రమే ధరించాలి. ఒకసారి వేసుకున్న బట్టల మీద చెమట, దుమ్ము, ధూళి చేరి ఉంటాయి. ఇవి దుర్వాసనకు కారణం కావచ్చు. ఇలాంటి దుస్తులను ఉతకకుండా మరోసారి వేసుకోకూడదు.
ఈ సమస్య ఉన్నవారు లేత రంగుల్లో పలుచగా ఉండే కాటన్ బట్టలు వేసుకోవడం మంచిది. నైలాన్, సిల్క్ బట్టలు అలాగే మందంగా ఉండే వాటిని వేసుకుంటే గాలి ఆడక చెమట పెరిగి శరీరం నుంచి వాసన వస్తుంది. వీలైతే ఆరు గంటలకు ఓసారి బట్టలను మార్చుకోవడం మంచి ఫలితాన్ని ఇస్తుంది.
దుస్తులను ఉతికిన తరవాత వాటిని గాలి తగిలేలా ఆరేయాలి. పొడిగా ఆరిన తరవాతనే వాటిని మడతపెట్టాలి. బట్టలు సరిగా ఆరకపోతే ఒక్కోసారి వాటి నుంచి దుర్వాసన వస్తూ ఉంటుంది. వీటిని అలాగే ధరిస్తే శరీరానికి చెడు వాసన పడుతుంది.
పాదాలకు ధరించే సాక్స్, కాన్వాస్ షూస్ లాంటివాటిని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
సెంట్లు, పెర్ఫ్యూమ్‌లను ఎక్కువగా ఉపయోగించకూడదు. ఇవి సమస్యను మరింత పెంచుతాయి.
ఒక్కోసారి ఆహారపు అలవాట్లు కూడా సమస్యకు కారణం కావచ్చు. ఉల్లి, వెల్లుల్లి, మాంసాహారం ఎక్కువగా తీసుకోకూడదు. జింక్, మెగ్నీషియం, పీచు పదార్థాలు ఉండే ఆహారాన్ని తరచూ తీసుకోవడం మంచిది.
ఇవి కూడా చదవండి..
కొనసాగుతున్న ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ..ట్రంప్ నేతన్యాహూ మధ్య వీటో వివాదం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి