Share News

Gym Heart Attacks: జిమ్‌లో గుండెపోట్లు

ABN , Publish Date - Aug 12 , 2025 | 04:18 AM

జిమ్‌లో వ్యాయామం చేస్తూ గుండెపోటుతో కుప్పకూలిపోతున్న వారి సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. ఇలాంటప్పుడు ఆరోగ్యాన్ని అందించవలసిన వ్యాయామాలు ప్రాణాలనే హరించేస్తున్నాయనే అనుమానాలు, అయోమయాలు...

Gym Heart Attacks: జిమ్‌లో గుండెపోట్లు

పోకడ

జిమ్‌లో వ్యాయామం చేస్తూ గుండెపోటుతో కుప్పకూలిపోతున్న వారి సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. ఇలాంటప్పుడు ఆరోగ్యాన్ని అందించవలసిన వ్యాయామాలు ప్రాణాలనే హరించేస్తున్నాయనే అనుమానాలు, అయోమయాలు తలెత్తడం సహజం. కానీ గుండెపోటుకు గురవడానికి అసలు కారణాలు మన అంతర్గత ఆరోగ్య పరిస్థితులే!

అందరి శరీరాలూ ఒకేలా ఉండవు. శరీరం శక్తిని ఖర్చు చేసుకోగలిగే సామర్థ్యం ప్రతి వ్యక్తికీ వేర్వేరుగా ఉంటుంది. ఆ సామర్థ్యం జిమ్‌ వ్యాయామాలను భరించే స్థాయిలో ఉండవచ్చు, ఉండకపోవచ్చు. అలాగే ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌, రక్తంలో చక్కెరలు, హార్మోన్ల హెచ్చుతగ్గులు, తీవ్రమైన ఇన్‌ఫ్లమేషన్‌... ఈ కారణాలన్నీ భౌతిక శ్రమకు లోనైనప్పుడు మరింత తీవ్రమైన సమస్యలకు దారి తీస్తూ ఉంటాయి. 20 ఏళ్ల వయసులో ఎంచుకున్న జీవనశైలి మార్పుల ముప్పు 30, 40 ఏళ్లకు ముంచుకొస్తుంది. కదలకుండా గంటల తరబడి కూర్చోవడం, అనారోగ్యకరమైన ఆహారపుటలవాట్లు, తీవ్ర ఒత్తిడి, అస్తవ్యస్థ నిద్రవేళలు శరీరాన్ని కుంగదీస్తాయి. పైకి చూడడానికి ఆరోగ్యంగా, చలాకీగా కనిపిస్తున్నప్పటికీ, అంతర్గత వ్యవస్థలైన గుండె, అంతఃస్రావ వ్యవస్థలు ఒత్తిడికి లోనై ఉంటాయంటున్నారు బెంగుళూరు, మణిపాల్‌ హాస్పిటల్‌ ఇంటర్వెన్షనల్‌ కార్డియాలజిస్ట్‌, డాక్టర్‌ కతేరియా.

వీళ్లు మరింత అప్రమత్తం

రక్తంలో ఏ కాస్త చక్కెర మోతాదు పెరిగినా, రక్తనాళాలు, నాడులు దెబ్బతిని, గుండె జబ్బుకు దారి తీస్తాయి. ఈ కోవకు చెందినవాళ్లు వ్యాయామ సమయంలో శ్రమకు లోనైనప్పుడు, గుండె మీద ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్యకరమైన వ్యక్తులతో పోలిస్తే, తేలికపాటి వ్యాయామాలు చేసే సమయంలో ఊబకాయుల్లో రక్తపోటు త్వరితంగా పెరిగిపోతూ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో గుండెకు రక్తప్రవాహం పెరిగి, గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెడుతుంది. నిజానికి వ్యాయామ సమయంలో గుండె కొట్టుకునే వేగాన్ని పర్యవేక్షించడం ఎంతో ముఖ్యం. మరీ ముఖ్యంగా ఊబకాయులు, మధుమేహం, అధిక రక్తపోటు లాంటి ఆరోగ్య సమస్యలున్నవాళ్లు ఆరోగ్యానికి చేటు చేయని, సురక్షితమైన వ్యాయామ పద్ధతులను అనుసరించడం కోసం వ్యాయామ సమయంలో గుండె కొట్టుకునే వేగాన్ని పర్యవేక్షించుకోవాలి.


మధుమేహం ముప్పు

మధుమేహం వంశపారంపర్యం. అయినప్పటికీ ఆరోగ్యకరమైన జీవనశైలి, వ్యాయామాలతో మధుమేహాన్ని కొంత మేరకు వాయిదా వేయవచ్చు. కానీ తల్లితండ్రుల నుంచి సంక్రమించకుండా అడ్డుకోలేం! సాధారణంగా కొందరు ఆరోగ్యకరమైన ఆహార, జీవనశైలులను అనుసరించినంత కాలం మధుమేహం దరి చేరదు అనే అపోహలో ఉంటూ ఉంటారు. మధుమేహం చాప కింద నీరులా నిశ్శబ్దంగా శరీరాన్ని ఆక్రమిస్తుంది. లక్షణాలు స్పష్టంగా కనిపించవు కాబట్టి స్వల్ప స్థాయి మధుమేహం నిర్లక్ష్యానికి గురవుతూ, దీర్ఘకాలంలో గుండెకు చేటు చేసి, గుండెపోటు రూపంలో కుప్పకూల్చేస్తూ ఉంటుంది. ఈ పరిస్థితి తలెత్తకుండా ఉండాలంటే వంశపారంగా మధుమేహం సంక్రమించే వీలున్న వారు, క్రమం తప్పక రక్తంలోని చక్కెర మోతాదులను పరీక్షించుకుంటూ అప్రమత్తంగా వ్యవహరించాలి. మధుమేహం ఎంత స్వల్పంగా ఉన్నప్పటికీ, వైద్యులు సూచించే మందులు వాడుకోవాలి. అంతే తప్ప వ్యాయామంతో మధుమేహాన్ని తగ్గించుకోగలమని అనుకోకూడదు. అలాగే కొందరు ఆరోగ్యాన్ని అంచనా వేయడం కోసం ఎండ్యురెన్స్‌ పరీక్ష లేదా స్ట్రెస్‌ పరీక్షల మీద ఆధారపడుతూ ఉంటారు. ఇలాంటి సందర్భాల్లో గుండె రక్తనాళాల్లోని స్వల్ప అవరోధాలు పరీక్షల్లో బయల్పడకపోవచ్చు. ఈ పరీక్షలు పెద్ద పెద్ద అవరోధాలను మాత్రమే కనిపెట్టగలుగుతాయనే విషయం అందరూ గుర్తు పెట్టుకోవాలంటున్నారు డాక్టర్‌ కతేరియా. మధుమేహులు వ్యాయామంలో భాగంగా శరీరాన్ని శ్రమకు లోను చేసినప్పుడు రక్తనాళాల్లోని ఈ మెత్తని అవరోధాలు ఒక్కసా రిగా ఊడి, కుప్పగా మారి, రక్త ప్రవాహానికి అడ్డుపడతాయని హెచ్చరిస్తున్నారాయన.

ఇవీ చదవండి:

ట్రంప్ సుంకాల ఎఫెక్ట్.. భారత టెక్స్‌టైల్ ఉత్పత్తుల దిగుమతులకు అమెరికా సంస్థల బ్రేక్

పాన్ కార్డు ఇనాక్టివ్ అయ్యిందా.. ఇలా చేస్తే సమస్యకు పరిష్కారం

Read Latest and Business News

Updated Date - Aug 12 , 2025 | 04:18 AM