Stray Dog Adoption India: వీరికి ప్రేమ ఎక్కువే
ABN , Publish Date - Aug 17 , 2025 | 03:41 AM
ఢిల్లీ ఎన్‌సిఆర్ వీధుల నుంచి వీధి కుక్కలను తొలగించి షెల్టర్‌కు పంపించాలంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన సంచలన తీర్పు పలు విమర్శలు, వాదనలకు తెర లేపిన విషయం అందరికీ...
ఢిల్లీ ఎన్‌సిఆర్ వీధుల నుంచి వీధి కుక్కలను తొలగించి షెల్టర్‌కు పంపించాలంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన సంచలన తీర్పు పలు విమర్శలు, వాదనలకు తెర లేపిన విషయం అందరికీ తెలిసిందే! నిజానికి వీధి కుక్కలను పెంపుడు కుక్కలుగా ఆదరించినప్పుడు ఇలాంటి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు తక్కువ. ఈ దిశగా ఆలోచించి వాటిని అక్కున చేర్చుకున్న కొందరు ప్రముఖుల గురించి తెలుసుకుందాం!
రతన్ టాటా
దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటా, వీధి కుక్కలను ఆదరించడమే కాకుండా, వాటి సంరక్షణ, పునరావాస కార్యక్రమాలు కూడా చేపట్టారు. తన పెంపుడు కుక్కను జీవితాంతం జాగ్రత్తగా చూసుకోవాలని తన వీలునామాలో కూడా రాసుకున్నారాయన. జంతువుల ఆస్పత్రి, ఆశ్రయాలను స్థాపించి, విలాసవంతమైన తన తాజ్ హోటల్‌లో ప్రత్యేకమైన ప్రవేశాన్ని కూడా కల్పించారు. గతంలో రతన్ టాటా గోవాలో పర్యటిస్తున్నప్పుడు, ఒక వీధి కుక్క తననే వెంబడిస్తూ ఉండడాన్ని గమనించి, దాన్ని వెంట తెచ్చుకుని ‘గోవా’ అనే పేరుతో ప్రేమగా పెంచుకున్నారు.
హృతిక్ రోషన్
ఈ బాలీవుడ్ నటుడు 2022లో ‘మోగ్లి’ అనే వీధి కుక్కను దత్తత తీసుకున్నారు. ముంబయి వీధుల్లో కారు కింద కనిపించిన ఈ వీధి కుక్కను ఒక వ్యక్తి కాపాడినప్పుడు, అతన్నుంచి దాన్ని హృతిక్ దత్తత తీసుకున్నారు.
జాన్ అబ్రహామ్
బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహామ్‌కు ‘బెయిలీ అబ్రహామ్’ (తల్లి కుక్క), ‘సియా అబ్రహామ్’ (కుక్క పిల్ల) అనే రెండు వీధి కుక్కలున్నాయి. జంతు ప్రేమికుడైన జాన్ అబ్రహామ్, లాభాపేక్షలేని జంతు హక్కుల సంస్థ పెటాతో కలిసి పని చేస్తున్నాడు.
సిద్ధార్థ్ మల్హోత్ర
సిద్ధార్థ్ మల్హోత్రకు ‘జెర్రీ’ అనే ఇండీ డాగ్ ఉంది. కుక్కల పట్ల తనకున్న ప్రేమను సామాజిక మాధ్యమాల్లో చాటుకునే ఈ హీరో, శాంతి అనే రెస్క్యూ డాగ్ ఫొటో షూట్‌లో మోడల్‌గా కూడా నటించాడు.
సోహా అలీ ఖాన్
సోహా, ఆమె భర్త కునాల్‌కు... ‘నిమ్కి, మిష్టి, మస్తి, ఆరియో’ అనే వీధి కుక్కలున్నాయి. వీళ్లు వీధి కుక్కల దత్తత క్యాంపులు, ఆశ్రయాలకు కార్యకర్తలుగా వ్యవహరిస్తూ, సామాజిక మాఽధ్యమాల ద్వారా భారతీయ వీధి కుక్కల దత్తతను ప్రోత్సహిస్తూ ఉంటారు.
ఆదిత్య రాయ్ కపూర్
తన ఫామ్ హౌస్ దగ్గర కనిపించిన వీధి కుక్కను మరో ఆలోచన లేకుండా ఇంటికి తెచ్చి పెంచుకున్నారు హిందీ నటుడు, ఆదిత్య రాయ్ కపూర్. దాని పేరు ‘లూనా’.
సన్నీ లియోన్
నటి సన్నీ లియోన్ ‘లిలు’ అనే వీధి కుక్కతో పాటు ఏడు కుక్కలను దత్తత తీసుకుంది. గతంలో సన్నీ లియోన్ పెటాకు ప్రచారకర్తగా వ్యవహరించి, జంతు హక్కుల పట్ల అవగాహనా కార్యక్రమాలు చేపట్టింది.
మాధురి దీక్షిత్
2019లో మాధురి, ఒక ఇండీ డాగ్‌ను దత్తత తీసుకుంది. ‘ఈ కుక్కపిల్ల మా మనసునెంతగా దోచుకుందో మా ముఖాల మీద విరబూసే ఈ చిరునవ్వులే చెబుతున్నాయి’ అంటూ తన పెంపుడు కుక్క గురించి సామాజిక మాధ్యమంలో పోస్ట్ కూడా పెట్టారామె. అలాగే జంతు ప్రేమికులందరూ వీధి కుక్కలను దత్తత తీసుకుని, జీవితాల్లో ఆనందం నింపుకోవాలని కూడా కోరారు.
రణదీప్ హూడా
ఈ నటుడికి ‘బాంబి’ అనే ఇండీ డాగ్ ఉంది. 2018లో ఈ కుక్కను దత్తత తీసుకున్న రణదీప్, పలు సందర్భాల్లో కుక్కలను కొనుక్కోవద్దు, దత్తత తీసుకోమని అభిమానులను కోరాడు.
ఇవి కూడా చదవండి
భారత్ ఇలాంటి దాదాగిరి ఎన్నటికీ చేయదు.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
ఈ-ఆధార్ యాప్ అభివృద్ధిపై దృష్టి పెట్టిన కేంద్ర ప్రభుత్వం
For More National News and Telugu News