Share News

Crib Blood Group: కొత్త రక్తం క్రిబ్‌

ABN , Publish Date - Aug 12 , 2025 | 04:21 AM

ఇటీవల కర్నాటకలో ఒక మహిళకు సర్జరీ చేస్తున్న క్రమంలో ‘క్రిబ్‌’ అనే ఒక కొత్త రక్త గ్రూపు వెలుగులోకొచ్చింది. ఇలాంటి కొత్త రక్త గ్రూపులు, వాటి పూర్వాపరాల గురించి వైద్యులేమంటున్నారో తెలుసుకుందాం...

Crib Blood Group: కొత్త రక్తం క్రిబ్‌

మెడికల్‌ న్యూస్‌

ఇటీవల కర్నాటకలో ఒక మహిళకు సర్జరీ చేస్తున్న క్రమంలో ‘క్రిబ్‌’ అనే ఒక కొత్త రక్త గ్రూపు వెలుగులోకొచ్చింది. ఇలాంటి కొత్త రక్త గ్రూపులు, వాటి పూర్వాపరాల గురించి వైద్యులేమంటున్నారో తెలుసుకుందాం!

సాదారణంగా ఎవరికైనా ప్రధానంగా ఎ, బి, ఎబి, ఒ (పాజిటివ్‌ లేదా నెగటివ్‌) రక్త గ్రూపులుంటాయనే మనందరం అనుకుంటూ ఉంటాం. కానీ రక్త గ్రూపుల్లో 25 భిన్నమైన మైనర్‌ రకాలు కూడా ఉంటాయి. ప్రధాన గ్రూపు ‘ఎ’, ‘బి’, ‘ఎబి’, ‘ఒ’లే అయినా, వాటిలోని యాంటీజెన్లను బట్టి వాటిని భిన్నమైన రక్త గ్రూపులుగా పరిగణిస్తారు. ‘ఎ’ బ్లడ్‌ గ్రూపు రక్తకణాలకు ‘ఎ’ అనే యాంటీజెన్‌ ఉంటుంది. ‘బి’ బ్లడ్‌ గ్రూపు రక్తకణాలకు ‘బి’ యాంటిజెన్‌ ఉంటుంది. కాబట్టి ఆయా రక్తగ్రూపులను ఆయా యాంటీజెన్ల పేర్లతో పిలుస్తారు. ‘ఒ’ బ్లడ్‌ గ్రూపుకు ‘ఎ’, ‘బి’ యాంటిజెన్లు రెండూ ఉండవు. అలాంటి భిన్నమైన మరొక రక్తగ్రూపు బోంబే బ్లడ్‌ గ్రూపు. దీన్ని ముంబైలో 1950ల్లోనే గుర్తించారు. ఇది చూడడానికి ‘ఒ’ బ్లడ్‌ గ్రూపులాగే కనిపించినా, అదే బ్లడ్‌ గ్రూపుతో సరిపోలదు. బాంబే బ్లడ్‌ గ్రూపుకు ‘ఎ’, ‘బి’లతో పాటు ‘హెచ్‌’ యాంటిజెన్‌ కూడా ఉండదు. దాంతో ఇది ‘ఒ’ రక్తగ్రూపును అనుకరిస్తుంది. అలాగని అదే గ్రూపు రక్తంతో సరిపోలదు. కాబట్టి ఈ కోవకు చెందిన వారికి అదే తరహా రక్తం మినహా మరే రక్తమూ మ్యాచ్‌ కాదు.


అరుదైన రక్త గ్రూపులున్నాయి

సాధారణంగా రక్త మార్పిడి సమయంలో ఒకే గ్రూపుకు చెందిన రక్తాలు మ్యాచ్‌ కాని సందర్భాల్లో వైద్యులు లోతైన పరీక్షలు చేపడుతూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో కొత్త రక్త గ్రూపులు బయల్పడుతూ ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా లక్ష మందిలో ఒకరికి, ప్రతి పది వేల భారతీయుల్లో ఒకరికి బాంబే బ్లడ్‌ గ్రూపు ఉంటుంది. మెడికల్‌ టూరిజం ద్వారా ఆఫ్రికా, ఇరాక్‌.. ఇలా మధ్య ప్రాచ్య దేశాల నుంచి ఎంతో మంది మన దేశానికి వస్తూ ఉంటారు. వీరిలో కొందరు ఆఫ్రికన్లకు ఇతరత్రా జన్యుపరమైన రక్తగ్రూపులున్నాయి కాబట్టి ప్రధాన రక్తగ్రూపు సరిపోలినా, మైనర్‌ రక్తగ్రూపు సరిపోలదు. మనకు లేని యాంటీజెన్లు వాళ్లకు ఉంటాయి. కాబట్టి ఆ జాతీయుల నుంచే రక్తాన్ని సేకరించి, మ్యాచ్‌ చేయవలసి వస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అరుదైన రక్త గ్రూపులు కలిగి ఉన్న వారికి అత్యవసర సమయాల్లో రక్తం దొరక్కపోవచ్చు. భవిష్యత్తులో అలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండడం కోసం, సదరు వ్యక్తుల నుంచి ముందుగానే రక్తాన్ని సేకరించి, నిల్వ చేసుకునే విధానాన్ని కూడా వైద్యులు అనుసరిస్తూ ఉంటారు. అందుకోసం ఈ కోవకు చెందిన వారికి ఇంజెక్షన్లతో ఎముక మజ్జను ప్రేరేపించి ఎక్కువ రక్తాన్ని వృద్ధి చేయడం ద్వారా అదనపు రక్తాన్ని సేకరిస్తారు.

కారణాలున్నాయి

తాజాగా బయల్పడిన ‘క్రిబ్‌’ రక్త గ్రూపు పూర్తిగా కొత్తది. దీనికి క్రోమర్‌ ఇండియా బెంగళూరు అని పేరు పెట్టారు. ఇలా కొత్త రక్త గ్రూపులు పుట్టుకురావడానికి కారణాలు లేకపోలేదు. బ్యాక్టీరియా, వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు, జన్యుపరమైన వ్యత్యాసాల వల్ల కొత్త రక్త గ్రూపులు పుట్టుకురావచ్చు. ఇలా కొత్త రక్త గ్రూపులు బయల్పడడం వల్ల కొన్ని ప్రయోజనాలుంటాయి. వీటిని శాస్త్రీయ సాహిత్యంలో చేర్చడం ద్వారా ఎంత మందికి ఈ రక్త గ్రూపు ఉందనే విషయం వెల్లడవుతుంది. అలాగే అత్యవసర పరిస్థితుల్లో రక్త మార్పిడికి వీలుగా ముందస్తుగా రక్తాన్ని సేకరించి నిల్వ చేసుకునే వెసులుబాటు చిక్కుతుంది.


బ్లడ్‌ జాండి స్‌

రక్తానికి సంబంధించి ఎంతో మందికి తెలియని అత్యంత ముఖ్యమైన విషయం.. బ్లడ్‌ జాండిస్‌. కామెర్ల వ్యాధి కాలేయానికే పరిమితం కాదు. కామెర్లకు రక్తంతో కూడా సంబంధం ఉంటుంది. ఎర్రరక్త కణాలు విచ్ఛిన్నమవుతున్నా కామెర్లు సోకుతాయి. కాలేయం దెబ్బతినే పరిస్థితి, కాంజుగేటెడ్‌ జాండిస్‌ అయితే, రక్తకణాలు విచ్ఛిన్నమయ్యే పరిస్థితి... అన్‌కాంజుగేటెడ్‌ జాండిస్‌. రక్తపు జాండి్‌సలో కూడా, కాలేయ జాండిస్‌ లక్షణాలే కనిపిస్తాయి. అదనంగా నీరసం ఆవరించినా, అదంతా పత్యం వల్లే అనుకుంటారు. కానీ అది రక్తపు జాండిస్‌ కాదని నిర్థారించుకోవడం కోసం ‘డైరెక్ట్‌ కూంబ్స్‌ టెస్ట్‌’ అనే పరీక్ష చేయించుకోవాలి. ఫలితంలో రక్తపు జాండిస్‌ ఉందని తేలితే సత్వర చికిత్స మొదలుపెట్టాలి. ఇలాంటి రక్త కామెర్లు సోకిన వాళ్లకు ఎర్ర రక్త కణాల మీద పైపొర ఏర్పడుతుంది. దాంతో రక్తకణాలు పగిలిపోతూ ఉంటాయి. కాబట్టి వైద్యులు స్టిరాయిడ్స్‌ ఇచ్చి, ఆ పరిస్థితిని సరిదిద్దుతారు.

డాక్టర్‌ పద్మజ లోకిరెడ్డి

హెమటో ఆంకాలజిస్ట్‌,

అపోలో హాస్పిటల్స్‌,

హైదరాబాద్‌.

ఇవీ చదవండి:

ట్రంప్ సుంకాల ఎఫెక్ట్.. భారత టెక్స్‌టైల్ ఉత్పత్తుల దిగుమతులకు అమెరికా సంస్థల బ్రేక్

పాన్ కార్డు ఇనాక్టివ్ అయ్యిందా.. ఇలా చేస్తే సమస్యకు పరిష్కారం

Read Latest and Business News

Updated Date - Aug 12 , 2025 | 04:21 AM