Share News

Sri Raghavendra Swamy: సత్య ధర్మ స్వరూపుడు శ్రీరాఘవేంద్రుడు

ABN , Publish Date - Aug 08 , 2025 | 02:16 AM

మన దేశంలో సజ్జనులను ఉద్ధరించడానికి అనేకమంది మహనీయులు అవతరించారు. వారిని గురువులుగా... పూజ్యభావంతో మనం ఆరాధిస్తాం. అటువంటి గురువులలో శ్రేష్టుడు మంత్రాలయ ప్రభువైన...

Sri Raghavendra Swamy: సత్య ధర్మ స్వరూపుడు శ్రీరాఘవేంద్రుడు

విశేషం

మన దేశంలో సజ్జనులను ఉద్ధరించడానికి అనేకమంది మహనీయులు అవతరించారు. వారిని గురువులుగా... పూజ్యభావంతో మనం ఆరాధిస్తాం. అటువంటి గురువులలో శ్రేష్టుడు మంత్రాలయ ప్రభువైన శ్రీ రాఘవేంద్రస్వామి. స్వార్థ చింతన లేకుండా, సజ్జనులను సరైన మార్గంలో నడిపించడానికి, భగవంతుడిపై భక్తి భావాన్ని పెంపొందించడానికి భగవంతుడు పంపించిన దూత ఆయన. నేటి నుంచి ఈ నెల 12వతేదీ వరకూ ‘శ్రీరాఘవేంద్రస్వాముల సప్తరాత్రోత్సవాలు’ (ఆరాధనోత్సవాలు) మంత్రాలయంలో జరుగుతాయి.

శ్రీరాఘవేంద్రస్వామివారి ఇంటి దైవం లక్ష్మీ వేంకటేశ్వరుడు. సంస్థాన పూజ చేసేది శ్రీరాముడికి. అయినప్పటికీ ఆయనకు శ్రీకృష్ణుడు అంటే అమితమైన ప్రీతి, భక్తి. ఒకసారి సంచారంలో భాగంగా ఆయన ఉడుపికి వెళ్ళారు. అక్కడ శ్రీమధ్వాచార్యులు స్థాపించిన శ్రీకృష్ణ విగ్రహం ముగ్ధ మోహన రూపాన్ని చూసి సంతోష పరవశులయ్యారు. ఉడుపిలోనే కొన్ని రోజులు ఉన్నారు. శ్రీకృష్ణుడి సన్నిధిలో (బ్రహ్మ సూత్రాలకు వ్యాఖ్యానంగా) ‘తంత్రదీపిక’, ‘న్యాయముక్తావళి’ అనే గ్రంథాలను రాశారు. ‘చంద్రికా ప్రకాశ’ అనే అద్భుతమైన టిప్పణి వ్రాశారు. అంతేకాదు.. ద్వైత సిద్ధాంత వాఙ్మయంలో మేరు కృతి అనిపించుకున్న, శ్రీ మధ్వాచార్యుల వ్యాఖ్యానానికి టీకగా శ్రీజయతీర్థులు రచించిన ‘శ్రీమన్యాయసుధ’కు ‘పరిమళ’ అనే టిప్పణిని రచించి, శ్రీకృష్ణునికి సమర్పించారు.


స్వామి కీర్తనకు శ్రీకృష్ణ నర్తనం

ఒకరోజు మధ్యాహ్నం ఉడుపిలోని శ్రీకృష్ణుని గుడిలో శ్రీరాఘవేంద్రులు ధ్యానంలో మునిగి ఉన్నారు. ఉన్నట్టుండి గర్భగుడిలో అపూర్వమైన కాంతి కనిపించింది. మంజులమైన గజ్జెల శబ్దం వినిపించింది. శ్రీకృష్ణపరమాత్మ తనకు దర్శనం ఇవ్వబోతున్నారని శ్రీరాఘవేంద్రులకు అనిపించింది. ఆయన తన పక్కనే ఉన్న వీణను తీసుకొని శ్రావ్యంగా మీటసాగారు. అప్పుడు ఆయన నోటి నుంచి ‘‘ఇందు ఎనగె గోవిందా, నిన్నయ పాదారవిందవ తోరో ముకుంద ఇందిరా రమణ’’(ఈ రోజు నాకు నీ పాదారవిందములను చూపించు ఇందిరా రమణా, ముకుందా) అనే అద్భుతమైన కృతి వెలువడింది. శ్రీ రాఘవేంద్రులు ఆనందంతో పాడుతూ, మధురంగా వీణ వాయిస్తూ ఉంటే... జగన్మోహనాకారుడైన బాలకృష్ణుడు ఆయనకు తన దివ్య మంగళరూపాన్ని అనుగ్రహించాడు. తను వేణుగానం చేస్తూ, బుడిబుడి అడుగులతో చుట్టూ నర్తించాడు. అనంతరం శ్రీరాఘవేంద్రులకు అభయప్రదానం చేసి అదృశ్యుడయ్యాడు. భగవంతుని దర్శనంతో పులకించిపోయిన ఆయన ఆనందబాష్పాలు రాలుస్తూ... దేవుణ్ణి పలు విధాలుగా స్తుతించారు.

భజతాం కల్పవృక్షాయ...

నమతాం కామధేనువే

‘‘నిస్వార్థమైన జీవనం మానవులను గొప్పవారిగా నిలబెడుతుంది. శ్రీరాఘవేంద్రస్వామిలో ఎటువంటి స్వార్థమూ లేదు. అందుకే వారిని ‘భజతాం కల్పవృక్షాయ’ అని స్తుతిస్తాం’’ అని చెప్పారు శ్రీసువిద్యేంద్రతీర్థులు. ఒక వృక్షం రుచికరమైన ఫలాలను ఇతరులకు అందిస్తుంది కానీ తాను వాటిని తినదు. నదిలోని నీరు ఏ విధమైన భేదభావం లేకుండా అన్ని ప్రాణులకూ దాహార్తిని తీరుస్తుంది. అదే విధంగా శ్రీరాఘవేంద్రులు ఎలాంటి ఫలాపేక్ష, ఎటువంటి భేదభావం లేకుండా సకల సజ్జనులను కరుణిస్తారు. ఆవు నీరు, గడ్డి మాత్రమే స్వీకరించి, మనకు అమృతంలాంటి పాలను అందిస్తుంది. మనిషి ఒక వయసు వచ్చాక తల్లి పాలు తీసుకోవడం మానేస్తాడు. కానీ పశువులు ఇచ్చే పాలను జీవితాంతం స్వీకరిస్తూనే ఉంటాడు. శ్రీరాఘవేంద్రులు కూడా ఆయన పట్ల మనం చూపించే భక్తి విశ్వాసాలకు బదులుగా మనల్ని కరుణిస్తారు’’ అంటారు ‘హరికథామృతసారం’లో జగన్నాథదాసులు. అందుకే భక్తుల కష్టాలను కడతేర్చి, సన్మార్గం వైపు నడిపించే కల్పవృక్షంగా, కామధేనువుగా శ్రీరాఘవేంద్రులు పేరు పొందారు.


మహిమల పరమార్థం

చదువురాని వెంకన్న ఆదోని సంస్థానం దివాన్‌ అయ్యాడన్నా, పెద్ద గంగాళంలోని మామిడి పండ్ల రసంలో పడి మరణించిన శిశువు బ్రతికిందన్నా, స్వగ్రామానికి బయలుదేరిన ఒక శిష్యుడు కేవలం శ్రీరాఘవేంద్రులు ఇచ్చిన మృత్తికతో ఒక పిశాచాన్ని సంహరించి సంపన్నుడయ్యాడన్నా... ఇలాంటి అనేక మహిమల వెనుక స్వామివారి ముఖ్యోద్దేశం.... భగవంతుడి ఉనికిని, గొప్పతనాన్ని జనులకు తెలియపరచడం. ‘‘అంతా సర్వోత్తముడైన శ్రీహరి సంకల్పానుసారమే జరుగుతుంది తప్ప నాకు ఎలాంటి మహిమ లేదు’’ అని చెప్పిన నిరాడంబరులైన భాగవతోత్తములు శ్రీ రాఘవేంద్రులు. తత్త్వజ్ఞానం, హరిభక్తి, పరిశ్రమ, పరోపకారబుద్ధి... ఇలాంటివన్నీ మనం కూడా అలవరచుకోవాలనేది ఆయన ఆశయం.

శ్రీ మధ్య ప్రచార పరిషత్‌

ఒక వృక్షం రుచికరమైన ఫలాలను ఇతరులకు అందిస్తుంది కానీ తాను వాటిని తినదు. నదిలోని నీరు ఏ విధమైన భేదభావం లేకుండా అన్ని ప్రాణులకూ దాహార్తిని తీరుస్తుంది. అదే విధంగా శ్రీరాఘవేంద్రులు ఎలాంటి ఫలాపేక్ష, ఎటువంటి భేదభావం లేకుండా సకల సజ్జనులను కరుణిస్తారు.

ఈ వార్తలు కూడా చదవండి..

కుట్టిన సాలీడు.. బాలిక మృతి

తురకా కిషోర్‌ను తక్షణమే విడుదల చేయండి: హైకోర్టు

For More Telangana News And Telugu News

Updated Date - Aug 08 , 2025 | 02:16 AM