Rabies Awareness: కుక్క కాటుకు యాంటీ రేబీస్ దెబ్బ
ABN , Publish Date - Aug 26 , 2025 | 12:58 AM
కుక్క కరిచిన ప్రదేశాన్ని సబ్బు నీళ్లతో శుభ్రం చేసుకుని సరిపెట్టుకునే వాళ్లుంటారు. కానీ పెంపుడు కుక్క, వీధి కుక్క... ఏది కరిచినా రేబీస్ రాకుండా ఇంజెక్షన్లు తీసుకోవడం తప్పనిసరి....
రేబీస్ వైరస్
కుక్క కరిచిన ప్రదేశాన్ని సబ్బు నీళ్లతో శుభ్రం చేసుకుని సరిపెట్టుకునే వాళ్లుంటారు. కానీ పెంపుడు కుక్క, వీధి కుక్క... ఏది కరిచినా రేబీస్ రాకుండా ఇంజెక్షన్లు తీసుకోవడం తప్పనిసరి.
కుక్కలకు సోకే రేబీస్ వైరస్ వాటి శరీరంలో దీర్ఘకాలం పాటు ఉండిపోతుంది. వ్యాధి తీవ్రమె,ౖ కుక్క ప్రాణాలు కోల్పోయే లోపు అది ఎంత మందిని కరిస్తే, అంతమందికీ రేబీస్ వైరస్ సోకుతుంది. అయితే కుక్కకు రేబీస్ సోకిందో లేదో తెలుసుకోవడం కోసం కుక్కలో కొన్ని లక్షణాలను మనం గమనించవచ్చు. అవేంటంటే...
చలాకీగా కదిలే కుక్క అకస్మాత్తుగా నీరసించడం
ఒంటరిగా ఉండిపోవడం
నోటి నుంచి సొంగ కారడం
నీటికి దూరంగా ఉండడం
గుండ్రంగా తిరుగుతూ ఉండడం
ఇలాంటి లక్షణాలు కనిపించిన కుక్కకు దూరంగా ఉండాలి. వాటికి ఆహారం తినిపించడం, వాటితో ఆడడం లాంటివి చేయకూడదు.
ఏ కుక్క కరిచినా..
కుక్క కరిచినప్పుడు, ఎంత లోతుగా కరిచింది అనే దాని మీదే చికిత్స ఆధారపడి ఉంటుంది. కుక్క గోళ్లతో గోకడాన్ని గ్రేడ్ ఎగా, కొరికినప్పుడు పంటి గాటు ఏర్పడితే ఆ గాయాన్ని గ్రేడ్ బిగా, పంటిగాటుతో పాటు రక్తస్రావమైతే గ్రేడ్ సిగా పరిగణించాలి. ఈ గాయాలకు రేబిక్యూర్ వ్యాక్సిన్‌తో పాటు, రేబీస్ ఇమ్యునోగ్లోబ్యులిన్ కూడా ఇవ్వవలసి ఉంటుంది. కుక్కకు ఎలాంటి టీకాలు ఇప్పించకపోయినా, అది వీధి కుక్క అయినా, పెంపుడు కుక్క అయినా రేబీస్ వ్యాక్సిన్ తీసుకోవాలి. సాధారణంగా చాలా మంది వీధిలో రోజూ కనిపించే కుక్క, దానికేం కాలేదు కాబట్టి మాక్కూడా ఏం జరగదు అని చికిత్సను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కానీ అది ఎలాంటి కుక్క అయినా, ఎలాంటి లక్షణాలు లేకున్నా తప్పనిసరిగి వైద్యులను కలిసి ఇంజెక్షన్లు తీసుకోవాలి.
గాయాన్ని నాకడం, గీకడం, కొరకడం
గీకడం: కుక్క గోళ్లు గీసుకున్నప్పుడు వెంటనే సబ్బునీళ్లతో శుభ్రం చేసుకోవాలి
కొరికినప్పుడు: పన్ను లోపలకు దిగి రక్తం కారినప్పుడు, ఆ ప్రదేశంలో ఇమ్యునోగ్లోబ్యులిన్ ఇంజెక్షన్ తీసుకోవాలి, రేబీస్ వ్యాక్సిన్ కూడా తీసుకోవాలి
గాయాన్ని నాకితే: సబ్బుతో గాయాన్ని కడిగి, ఆ ప్రదేశంలో ఇమ్యునోగ్లోబ్యులిన్ ఇంజెక్షన్ తీసుకోవాలి, రేబీస్ వ్యాక్సిన్ కూడా తీసుకోవాలి
పెంపుడు కుక్కల నుంచి కుటుంబసభ్యులకు వ్యాధులు సోకుతాయి. కాబట్టి పెంపుడు కుక్కలకు తప్పనిసరిగా యాంటీ రేబీ్‌సతో పాటు లెప్టోస్పైరోసిస్ లాంటి ఇతరత్రా వ్యాధులు రాకుండా సదరు టీకాలు కూడా ఇప్పించాలి.
డోసులు ఇలా...
పెంపుడు కుక్క: యాంటీ రేబీస్ టీకాలు ఇప్పించిన పెంపుడు కుక్క కరిచినప్పుడు మూడు డోసుల యాంటీ రేబీస్ ఇంజెక్షన్లు తీసుకోవాలి. కుక్క కరిచిన రోజు, ఏడవ రోజు 21 రోజు ఈ ఇంజెక్షన్లు తీసుకోవాలి.
వీధి కుక్క: ఈ కుక్క కరిచినప్పుడు ఐదు డోసుల యాంటీ రేబీస్ ఇంజెక్షన్లు తీసుకోవాలి. కుక్క కరిచిన రోజు, మూడో రోజు, ఏడవ రోజు, 14వ రోజు, 27వ రోజు ఈ ఇంజెక్షన్లు తీసుకోవాలి.
డాక్టర్ శ్రీకృష్ణ ఆర్ బొడ్డు,
కన్సల్టెంట్ జనరల్ ఫిజీషియన్,
కామినేని హాస్పిటల్స్,
ఎల్‌బి నగర్, హైదరాబాద్.

రేబీస్ మెదడుకు సోకితే...
సాదారణంగా కుక్క కరిచిన కొన్ని రోజుల తర్వాత బాధితులు వైద్యులను కలుస్తూ ఉంటారు. కానీ ఆ కుక్కకు రేబీస్ ఉందో లేదో మనకు తెలియదు కాబట్టి వెంటనే వైద్యులను కలవాలి. కుక్క కరిచిన గాయం ద్వారా మన శరీరంలోకి చేరుకునే రేబీస్ వైరస్ అన్ని అవయవాలతో పాటు అంతిమంగా మెదడుకు కూడా చేరుకుంటుంది. వైరస్ మెదడుకు చేరుకోవడం ప్రాణాంతకం. ఈ దశకు చేరుకున్న తర్వాత చికిత్సతో సాధారణ స్థితికి తీసుకురావడం అసాధ్యం. కాబట్టి ఆలోగానే వైద్యులను కలిసి ఇంజెక్షన్లు మొదలుపెట్టాలి. రేబీస్ వైరస్ మన వ్యాధినిరోధక వ్యవస్థ మీద పూర్తిగా ఆధిపత్యం సాధించి, తన సంఖ్యను విస్తృతం చేసుకుంటుంది. ఈ వైరస్ ఉధృతమై మెదడుకు సోకినప్పుడు ఆయాసం, జ్వరం, దాహం వేస్తున్నా నీళ్లు తాగలేని పరిస్థితి, వెలుతురును తట్టుకోలేకపోవడం, గాలి కోసం తపన పడడం, చికాకు, విపరీత ప్రవర్తన, భౌతిక దాడికి పాల్పడడం మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. ఇలా రేబీస్ మెదడుకు సోకిన రోగులకు చికిత్స లేదు కాబట్టి లక్షణాలను అదుపు చేసే చికిత్సలను అందించే రేబీస్ సెంటర్‌కు తరలించవలసి ఉంటుంది. రేబీస్ మెదడుకు సోకి చివరి దశకు చేరుకున్న రోగులు చికిత్సతో తిరిగి పూర్తి ఆరోగ్యం పొందిన దాఖలాలు ఇప్పటివరకూ లేవు. కాబట్టి కుక్క కరిచిన 24 గంటల్లోపే వైద్యులను కలిసి యాంటీ రేబీస్ చికిత్స మొదలుపెట్టుకోవాలి.
Also Read:
గుండె జబ్బులకు దారితీసే మూడు కారణాలు ఇవే..
కోహ్లీ బ్యాట్ వల్ల నాకు బ్యాడ్ నేమ్..
For More Telangana News and Telugu News..