Protect Your Eyes: ఈ జోడుతో కళ్లకు రక్ష
ABN , Publish Date - Oct 07 , 2025 | 01:37 AM
కంప్యూటర్లు, మొబైల్ ఫోన్ల తెరలతో కళ్లకు హాని జరుగుతుందనే విషయం అందరికీ తెలిసిందే! అయితే ఈ హాని నుంచి కళ్లను కాపాడుకోవడం కోసం ఎలాంటి కళ్లజోళ్లను వాడుకోవాలో...
ఐ కేర్
కంప్యూటర్లు, మొబైల్ ఫోన్ల తెరలతో కళ్లకు హాని జరుగుతుందనే విషయం అందరికీ తెలిసిందే! అయితే ఈ హాని నుంచి కళ్లను కాపాడుకోవడం కోసం ఎలాంటి కళ్లజోళ్లను వాడుకోవాలో తెలుసుకుందాం!
తెరలు వెలువరించే నీలి రంగు నేరుగా కళ్లకు సోకడం హానికరం. కాబట్టి దాన్ని వడగట్టే పైపూత కలిగిన కళ్లజోళ్లను ఎంచుకోవాలి. సాధారణంగా ప్రతి కళ్లజోడులో ప్రకాశవంతమైన కాంతిని అడ్డుకునే ‘యాంటీ రిఫ్లెక్షన్ కోటింగ్’ ఉంటుంది. దీంతో కాంతి అద్దానికి తగిలి ప్రతిఫలించడం మూలంగా కళ్ల మీద ప్రభావం తగ్గుతుంది. దీనికి అదనంగా లెన్స్‌ను శుభ్రంగా ఉంచే ‘యాంటీ స్మడ్జ్’ పైపూతతో పాటు, ‘బ్లూ లైట్ బ్లాకింగ్’ పైపూత కూడా వేయించుకోవాలి.
డిజిటల్ లెన్స్‌తో...
కంప్యూటర్, ఫోన్ల వాడకంతో కళ్ల మీద ఒత్తిడి పడకుండా చేసే డిజిటల్ లెన్స్ కూడా ఇప్పుడు అందుబాటులోకొచ్చాయి.
వీటిలో అంతర్గతంగా నిర్మితమయ్యే అకామడేషన్ ఏర్పాటు వల్ల, సాధారణ లెన్స్‌తో పోలిస్తే, ఈ డిజిటల్ లెన్స్ చూపులో మరింత స్పష్టతను అందించగలుగుతాయి. మరీ ముఖ్యంగా డిజిటల్ యాంటీ ఫెటీగ్ లెన్స్‌లు దగ్గరి పరిధికి పరిమితమై ఎక్కువ సయమాల పాటు పని చేసే వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి.
లెన్స్ శుభ్రంగా...
లెన్స్ శుభ్రం చేసేటప్పుడు, ఆ మరకలు అద్దం మొత్తానికీ వ్యాపిస్తూ లెన్స్‌ను మరింత మసకబారుస్తూ ఉంటాయి. ఇలా జరగకుండా ఉండడం కోసం ఒక ప్రయత్నంలోనే లెన్స్‌ను శుభ్రపరచుకోడానికి సహాయపడే ‘యాంటీ స్టాటిక్’ లేదా ‘హైడ్రోఫోబిక్ కోటింగ్’ అనే పైపూతలు కూడా అందుబాటులో ఉన్నాయి.
పెరుగుతున్న మయోపియా
పిల్లల్లో మయోపియా పెరుగుతోంది. అందుకు వాళ్లు అనుసరిస్తున్న జీవనశైలే ప్రధాన కారణం. మొబైల్ ఫోన్ల వాడకం పిల్లల్లో పెరుగుతూ ఉండడంతో వాళ్ల కంటి మైనస్ పవర్ కూడా పెరుగుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే 2050 నాటికి 50 శాతం మంది పిల్లలు మయోపియాకు గురవుతారని ఒక అంచనా!
అయితే ఈ సమస్య ఉన్న పిల్లలు కంటికి దగ్గరగా ఉన్నవి స్పష్టంగా కనిపించే మయోపియా కళ్లజోడునే ఇప్పటివరకూ ఉపయోగించుకుంటూ ఉన్నారు. అయితే ఆ సౌలభ్యంతో పాటు, ఉన్న మయోపియా మరింత పెరగకుండా నియంత్రించే కళ్లజోళ్లు కూడా ఇప్పుడు అందబాటులో కొచ్చాయి.
కళ్లు అలసిపోకుండా...
కంప్యూటర్ల ముందు ఏకాగ్రతతో పని చేసే సమయంలో తరచూ కనురెప్ప వేయడం మర్చిపోతూ ఉంటాం. దాంతో కళ్లు పొడిబారిపోవడం, కళ్ల మంటలు, కళ్లు ఎర్రబడడం, నీరు కారడం లాంటి సమస్యలు వేధిస్తాయి. ఇలా జరగకుండా ఉండాలంటే తప్పనిసరిగా 20:20:20 నియమం పాటించాలి. ప్రతి 20 నిమిషాలకూ 20 సెకన్ల పాటు 20 అడుగుల దూరంలోని వస్తువును చూడాలి.
సందీప్ రెడ్డి పడమటి,
ఆప్టోమెట్రిస్ట్,
కన్సల్టెంట్, ఎల్ వి ప్రసాద్
ఐ ఇన్‌స్టిట్యూట్, హైదరాబాద్.
ఇవి కూడా చదవండి..
ఈసారి ఎన్నికలు ఈ ముగ్గురికీ యాసిడ్ టెస్ట్
బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల, జూబ్లీహిల్స్ బైపోల్ కూడా..
Read Latest Telangana News and National News