Share News

Elijah Ascension: ఏలియా ప్రవక్త

ABN , Publish Date - Aug 22 , 2025 | 01:44 AM

దేవునికి, మానవులకు మధ్యవర్తిత్వం జరిపిన ప్రవక్తలు బైబిల్‌లో దర్శనమిస్తారు. వారు ఎప్పటికప్పుడు కొన్ని హెచ్చరికలు చేస్తూ, దైవభీతిని కలిగిస్తూ, సమాజాన్ని వెలుతురు వైపు నడిపించే వ్యక్తులుగా కనిపిస్తారు. వారిలో ఏలియా ఒకరు. అది ఇజ్రాయేలీయ దైవభూమి....

Elijah Ascension: ఏలియా ప్రవక్త

దైవమార్గం

దేవునికి, మానవులకు మధ్యవర్తిత్వం జరిపిన ప్రవక్తలు బైబిల్‌లో దర్శనమిస్తారు. వారు ఎప్పటికప్పుడు కొన్ని హెచ్చరికలు చేస్తూ, దైవభీతిని కలిగిస్తూ, సమాజాన్ని వెలుతురు వైపు నడిపించే వ్యక్తులుగా కనిపిస్తారు. వారిలో ఏలియా ఒకరు. అది ఇజ్రాయేలీయ దైవభూమి. క్రీస్తుపూర్వం 900 ముందటికాలం అది. అక్కడ మూఢనమ్మకం బాగా పెరిగిపోయింది. ప్రజలలో దురాచారాలు పెరిగిపోయాయి. అంతటా అంధకారం అలముకుంది. రాజును, ప్రజలను అప్రమత్తం చేయడం కోసం ఏలియా ప్రవక్తను దేవుడు ఈ భూమిపైకి పంపించాడు. ఏలియా ప్రవక్త తిష్పీయుడు... అంటే తిష్పీ ప్రాంతంవాడు. గిలాదు కుటుంబానికి చెందినవాడు. దైవభక్తుడు. ఆ ఆహబు రాజ్యంలో పాపం పెరిగింది కాబట్టి మంచు కానీ, వర్షం కానీ పడదని ఏలియా స్వయంగా రాజు కోటకు వెళ్ళి ప్రకటించాడు. ఆ విధంగానే మంచు కురవలేదు. తరువాత... కార్మేల్‌ పర్వతం దగ్గర ప్రజలను, ఉభయ మతాల ప్రవక్తలను ఏలియా సమావేశపరచాడు. ఏ దేవుని ద్వారా అగ్ని దిగివచ్చి, కొండ పీఠం మీద నిలబెట్టిన ఎద్దును దహనం చేసే అద్భుతాన్ని నిర్వహిస్తుందో... ఆ దేవుడే నిజమైన దేవుడనీ, ఆ దేవుణ్ణే అందరూ ఆరాధించాలని వారందరూఏకగ్రీవంగా ఒక అంగీకారానికి వస్తారు. వారి బైలు దేవత నుంచి ఎలాంటి స్పందనా రాదు. యెహోవాను ఏలియా ప్రవక్త ప్రార్థిస్తాడు. అగ్ని దిగివస్తుంది. ఎద్దును దహించేస్తుంది. బైలు దేవతను నమ్మినవారు అవమానితులయ్యారు. వధకు గురయ్యారు. ఆహబు రాజు భార్య ఎజిబేలు పంతం ఓటమి పాలైంది. ఆమెకు ఏలియాపై కక్ష పెరిగింది. దుష్టపాలకుడైన ఆహబు కుక్క చావు చస్తాడని, ఆయనను దుర్మార్గాల వైపు నడిపించిన అతని భార్యకు కూడా అదే దుస్థితి దాపురిస్తుందనీ ఏలియా సూచన చేసినట్టే... వారు కుక్కల చేతిలో మరణిస్తారు. ఏలియా ఎన్నో కష్టాలను ఎదుర్కొని... దేవుని పట్ల, దేవుని మాట పట్ల గొప్ప విధేయతను ప్రకటించడం వల్ల... అతని వృద్ధాప్యంలో ఒక రథాన్ని దేవుడు పంపించాడని, ఆ మహా ప్రవక్తను సశరీరుడిగా మోక్ష పథానికి తీసుకువెళ్ల్ళాడని బైబిల్‌ చెబుతోంది.

డాక్టర్‌ యం. సోహినీ బెర్నార్డ్‌,

9866755024

ఈ వార్తలు కూడా చదవండి..

ఎమ్మెల్యేలు ఇలా చేస్తే ఎలా.. సీఎం చంద్రబాబు ఫైర్

టీటీడీపై వైసీపీ బురద జల్లుతోంది.. జ్యోతుల నెహ్రూ ధ్వజం

Read Latest AP News and National News

Updated Date - Aug 22 , 2025 | 01:44 AM