Madison Keys : పడిలేచిన కెరటం
ABN , Publish Date - Jan 30 , 2025 | 04:43 AM
గెలుపు ముంగిట తడబడిన ప్రతిసారీ... మరింత పట్టుదలగా ప్రయత్నించింది. బలహీనతలను అధిగమించి... నైపుణ్యాన్ని మెరుగులు అద్దుకొని... బలమైన ప్రత్యర్థిగా మారింది. గ్రాండ్‌స్లామ్ గెలవాలన్న చిన్ననాటి కలను... మూడు పదుల వయసులో నెరవేర్చుకుంది. మహామహులను మట్టికరిపించి... ‘ఆస్ర్టేలియన్ ఓపెన్’లో సరికొత్త చాంపియన్‌గా అవతరించిన అమెరికా సంచలనం... మాడిసన్ కీస్ కథ ఇది.

గెలుపు ముంగిట తడబడిన ప్రతిసారీ... మరింత పట్టుదలగా ప్రయత్నించింది. బలహీనతలను అధిగమించి... నైపుణ్యాన్ని మెరుగులు అద్దుకొని... బలమైన ప్రత్యర్థిగా మారింది. గ్రాండ్‌స్లామ్ గెలవాలన్న చిన్ననాటి కలను... మూడు పదుల వయసులో నెరవేర్చుకుంది. మహామహులను మట్టికరిపించి... ‘ఆస్ర్టేలియన్ ఓపెన్’లో సరికొత్త చాంపియన్‌గా అవతరించిన అమెరికా సంచలనం... మాడిసన్ కీస్ కథ ఇది.
దాదాపు ఏడాదిన్నర కిందట... యూఎస్ ఓపెన్ సెమీఫైనల్. అవతలివైపు రెండో సీడ్ అరినా సబలెంక. పదిహేడో సీడ్‌గా బరిలోకి దిగిన మాడిసన్ కీస్... అంచనాలను తలకిందులు చేస్తూ తొలి సెట్‌ను ఏకపక్షంగా గెలుచుకుంది. రెండో సెట్... ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురైనా తట్టుకొని... 5-4తో ముందుకు సాగింది. ఇంకొక్క గేమ్! గెలిస్తే ఫైనల్స్ బెర్త్. కీస్... సర్వీస్. స్టేడియం అంతా ఊపిరి బిగబట్టి వీక్షిస్తోంది. ఇంతలో ఊహించని మలుపు. సబలెంక మెరుపు దాడికి కీస్ కుదేలైంది. టైబ్రేకర్‌తో ఆ సెట్‌నే కాదు... తరువాతి సెట్‌ను కూడా ప్రత్యర్థికి కోల్పోయి... చేతులోకి వచ్చిన మ్యాచ్‌ను చేజార్చుకుంది కీస్. ఆటలో సరిజోడీగా పోటీపడినా... కీలక సమయంలో ఒత్తిడికి తల వంచింది. కానీ ఆ పరాజయం ఆమెలో మరింత కసి పెంచింది. విజయానికి దాన్ని ఒక సోపానంగా భావించింది. ‘ఈ మ్యాచ్‌ను సానుకూలంగా తీసుకొంటే ఓటమిని గెలుపుగా మలచడం అసాధ్యమేమీ కాదు’ అంటూ నాడు మ్యాచ్ అనంతరం భావోద్వేగానికి లోనైంది కీస్. చెప్పినట్టే సరిగ్గా 16 నెలలు తిరక్కుండానే ఆస్ర్టేలియన్ ఓపెన్ గెలుచుకుంది. ఫైనల్లో డబుల్ డిఫెండింగ్ చాంపియన్, నెంబర్ వన్ సీడ్... సబలెంకాను ఓడించి కొత్త ఏడాది అద్భుత ఆరంభాన్ని అందుకుంది.
ఓటమి కొత్తకాదు...
వాస్తవానికి అంతిమ సమరంలో తడబడడం కీస్‌కు కొత్తేమీ కాదు. ఏడేళ్ల కిందట 2017లో కూడా యూఎస్ ఓపెన్ ఫైనల్ దాకా వచ్చి, టైటిల్ చేజార్చుకుంది. కెరీర్‌లో పది టైటిల్స్ సాధించిన ఆమె... గ్రాండ్‌స్లామ్ పోటీలకు వచ్చేసరికి తీవ్ర ఒత్తిడికి లోనవుతుంది. ఇదే ఆఖరి నిమిషంలో గెలుపును దూరం చేస్తోంది. దీని నుంచి బయటపడడానికి ఎంతోమంది మానసిక నిపుణులను సంప్రతించింది. వారి సూచనలతో ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ అదే పరిస్థితి. భర్త, కోచ్ బిజోర్న్ ఫ్రాటాంజెలో నేతృత్వంలో పరాజయాల నుంచి పాఠాలు నేర్చుకొని, శారీరకంగా, మానసికంగా తనను తాను మార్చుకోవాలని నిశ్చయించుకుంది. అప్పటివరకు పొట్టి హ్యాండిల్ ఉన్న విల్సన్ రాకెట్‌తో ఆడిన ఆమె... కాస్త పొడుగు హ్యాండిల్ గల యోనెక్స్ రాకెట్‌ను పట్టుకుంది. గత సీజన్‌లో సగానికిపైగా మ్యాచ్‌లను దానికి అవాటుపడటానికి కేటాయించింది. స్పోర్ట్స్ సైకాలజిస్టును కలిసి మానసికంగా తాను ఎదుర్కొంటున్న సమస్యలను అతడి ముందు పెట్టింది.
ఆత్మసమీక్ష చేసుకొని...
‘గతంలో ఎన్నో స్పోర్ట్స్ థెరపీలు తీసుకున్నా. అవన్నీ ఆట నుంచి దృష్టి మరలకుండా మనల్ని మనం నియంత్రించుకోగలగడం గురించి. అయితే దానికన్నా ప్రస్తుతం అనుసరిస్తున్న థెరపీ మరింత మెరుగైన ఫలితాలను ఇస్తోంది. ఇందులో నా గురించి నేను ఏమనుకొంటున్నాను? నా పట్ల నేను ఎంత నిజాయతీగా ఉన్నాను? అనేది తెలుసుకోగలగడం ప్రధానం. నిజంగా ఇది చాలా కష్టం. ఎందుకంటే మానసిక ఆందోళనకు గురవుతున్నాననే విషయం నేను చాలా రోజులు అంగీకరించలేకపోయాను. నిజాయతీగా ఆత్మసమీక్ష చేసుకున్నాక నా దృక్పథంలో మార్పు వచ్చింది. సన్నిహితులతో కూడా ఈ విషయాలపై దాపరికం లేకుండా చర్చించడం మొదలుపెట్టాను’ అంటున్న కీస్‌లో ఇప్పుడు మైదానంలో మునుపెన్నడూ లేనంతగా ఆత్మవిశ్వాసంతో దూసుకుపోతోంది.
ఫెదరర్ స్ఫూర్తితో...
ఇలినాయి్‌సలోని రాక్ ఐలాండ్‌లో పుట్టిన కీస్... టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్‌కు వీరాభిమాని. అతడి స్ఫూర్తితోనే ప్రొఫెషనల్ క్రీడాకారిణిగా ఎదిగింది. టీవీలో వింబుల్డన్ చూస్తూ ఆటపై మక్కువ పెంచుకున్న ఆమె... నాలుగేళ్ల వయసులోనే టెన్నిస్ కోర్టులోకి అడుగుపెట్టింది. ఆమె తండ్రి రిక్ బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు. నలుగురు కూతుళ్లలో రెండో సంతానం కీస్. ‘క్రిస్ ఎవర్ట్ టెన్నిస్ అకాడమీ’లో శిక్షణ పొందింది. ప్రొఫెషనల్ క్రీడాకారిణిగా 2009లో కెరీర్‌ను ప్రారంభించి, ఏడాది తిరక్కుండానే తొలి ఐటీఎఫ్ టైటిల్ సాధించింది. 2016 రియో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచింది. 2017 యూఎస్ గ్రాండ్‌స్లామ్‌లో ఫైనల్స్‌కు చేరి అందర్నీ ఆశ్చర్చపరిచింది. రెండేళ్ల తరువాత సిన్సినాటీ టైటిల్ నెగ్గిన ఆమె... ఆ తరువాత మరింత దూకుడు పెంచింది. 2023లో ప్రపంచ సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో తొలిసారి టాప్10లో స్థానం సంపాదించింది. అప్పటి నుంచీ అద్భుతమైన ఫామ్‌తో అదరగొడుతూ... ఆస్ర్టేలియన్ ఓపెన్‌లో అడుగుపెట్టింది. గతవారం ముగిసిన ఆస్ర్టేలియన్ ఓపెన్‌లో కీస్ ఆట మరో స్థాయిలో ఉందనేది మాజీల మాట. మూడో రౌండ్‌లో పదో సీడ్ కొలిన్స్‌ను ఇంటి దారి పట్టించిన ఆమె... నాలుగో రౌండ్‌లో ఆరో సీడ్ ఎలెనా రిబికినాను ఓడించింది. సెమీ్‌సలో రెండో సీడ్, పోలండ్ స్టార్ ఇగా స్వియటెక్‌పై గెలిచి, తుది పోరులో టాప్‌సీడ్ సబలెంకాను ఓడించి, కెరీర్‌లో మొట్టమొదటి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను ముద్దాడింది. తొలి,, రెండో గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్ మధ్య దాదాపు ఎనిమిదేళ్ల విరామం ఉంది. గ్రాండ్‌స్లామ్ చరిత్రలో ఇదే సుదీర్ఘ విరామం. అంతేకాదు... పెనెట్టా (49), బర్తోలి (47) తరువాత అత్యంత పెద్ద వయసులో గ్రాండ్‌స్లామ్ సాధించిన క్రీడాకారిణిగా నిలిచింది.
గాయాలు వేధించినా...
గత ఏడాది ఆస్ర్టేలియన్ ఓపెన్‌లో భుజం గాయంతో ఇబ్బంది పడిన కీస్, ఆ తరువాత తొడ కండరాల సమస్యతో వింబుల్డన్ నాలుగో రౌండ్ నుంచే నిష్క్రమించింది. ముఖ్యమైన టోర్నీల్లో గాయాలు వేధించినా, మధ్యలోనే తప్పుకోవాల్సిన పరిస్థితులు ఎదురైనా ఆమె దిగులు పడలేదు. అలాంటి క్లిష్ట సమయంలో భర్త అండతో... అతడి మార్గదర్శకత్వంలో గాయాల నుంచి కోలుకుంది. రెట్టించిన ఉత్సాహంతో తిరిగి బరిలోకి దిగింది. ఇప్పుడు టెన్నిస్ కోర్టులో పాదరసంలా కదులుతూ ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అత్యంత కీలక దశల్లో ఒత్తిడిని జయించి విజృంభిస్తోంది.
ఇవి కూడా చదవండి..
Delhi Elections: యమునలో విషం కలిపి... కేజ్రీ వ్యాఖ్యలపై ఈసీ లేఖ
Amit Shah: యమునలో విషం వ్యాఖ్యలపై కేజ్రీకి అమిత్‌షా 3 సవాళ్లు
Read More National News and Latest Telugu News