Share News

ప్రేమ శాశ్వతమే కానీ...

ABN , Publish Date - Feb 14 , 2025 | 03:06 AM

‘ప్రేమంటే ఏమిటి?’ అనే ప్రశ్నకు సమాధానం సంక్లిష్టంగా ఉంటుంది. అది వ్యక్తుల మీద, పరిస్థితుల మీద, సామాజిక సంబంధాల మీద ఆధారపడి ఉంటుంది. మనుషులు ఉన్నంతవరకూ ప్రేమలు కూడా ఉంటాయి....

ప్రేమ శాశ్వతమే  కానీ...

చింతన

ప్రేమ శాశ్వతమే కానీ...

‘ప్రేమంటే ఏమిటి?’ అనే ప్రశ్నకు సమాధానం సంక్లిష్టంగా ఉంటుంది. అది వ్యక్తుల మీద, పరిస్థితుల మీద, సామాజిక సంబంధాల మీద ఆధారపడి ఉంటుంది. మనుషులు ఉన్నంతవరకూ ప్రేమలు కూడా ఉంటాయి. అంటే ప్రేమ శాశ్వతం. కానీ... పరస్పర అనురాగాల నుంచి అతీంద్రియమైన స్పృహ వరకూ... ప్రేమ అనేది ఒక సోపాన క్రమం. దీనిలో అనేక పొరలు, అనేక స్థాయిలు ఉంటాయి. మీ స్థాయికి అనుగుణంగానే ప్రేమ గురించి మీ ఆలోచనలు ఉంటాయి. ప్రేమ గురించి హిట్లర్‌ ఆలోచన ఒక విధంగా ఉంటుంది. గౌతమ బుద్ధుడి ఆలోచన మరో విధంగా ఉంటుంది. అవి వేర్వేరు ధ్రువాలు కాబట్టి పరస్పర విరుద్ధంగా ఉంటాయి.


ఆ పేరుతో నడిచేది రాజకీయమే...

కోట్లాది మందికి ప్రేమ గురించి ఏమీ తెలియదు. అత్యల్ప స్థాయిలో... ప్రేమ అంటే రాజకీయం, అధికారం. ఆధిపత్యం అనే ఆలోచనతో ప్రేమ ఎక్కడైతే కలుషితమయిందో... అదే రాజకీయం. దాన్ని మీరు ఎలాగైనా పిలవొచ్చు. కానీ అది రాజకీయమే. భార్యాభర్తలు, ప్రేయసీ ప్రియులు, స్నేహితుల మధ్య నడిచేదంతా మొత్తం రాజకీయమే. ఒకరిమీద మరొకరు ఆధిపత్యాన్ని చెలాయించా లనుకుంటారు. చిత్రమేమిటంటే... ఆ ఆధిపత్యాన్ని మీరు ఆస్వాదిస్తారు. ఇటువంటి ప్రేమ రాజకీయం తప్పితే మరొకటికాదు. అది చక్కెర పూసిన చేదు మాత్ర. మీరు ప్రేమ గురించి మాట్లాడతారు, కానీ అందులో నిగూఢంగా, లోతుగా ఉన్న కోరిక... మరొకరిని దోచుకోవడమే. ఇదంతా మీరు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారని నేను అనడం లేదు. మీకు ఆ స్పృహ ఉండదు. ఇదంతా మనం ఆలోచించకుండానే జరిగిపోతూ ఉంటుంది. అందుకే ఇతరులపై ఆధిపత్యం చెలాయించడం, అసూయ పడడం ప్రేమలో భాగం అయిపోయింది. ఇలాంటి ప్రేమ ఆనందం కన్నా దుఃఖాన్నే ఎక్కువగా సృష్టిస్తుంది. దీనిలో 99 శాతం చేదుగా ఉంటుంది. దాని మీద మీరు పూసిన చక్కర ఒక్క శాతమే ఉంటుంది.


మీ ప్రేమ వ్యవహారం ఆరంభంలో ఉన్నప్పుడు... మీరు తీపిని రుచి చూస్తారు. త్వరలోనే ఆ చక్కెర మాయమవుతుంది. చేదైన వాస్తవాలు కనిపించడం ప్రారంభిస్తాయి. మొత్తం విషయమంతా వికారంగా మారిపోతుంది.

ప్రేమ తాలూకు అత్యల్పమైన రూపం

అందుకనే ఎంతోమంది వ్యక్తులు ఇకపై మనుషుల మీద ప్రేమ పెంచుకోకూడదని నిర్ణయించుకుంటారు. కుక్కనో, పిల్లినో, చిలుకనో తెచ్చుకొని, వాటిని పెంచుకుంటారు. వాటిమీద ప్రేమను పెంచుకుంటారు. అలాగే మరి కొందరు కార్లను, విల్లాలను, విలాస వస్తువులను పోగు చేసుకోవడానికి ఇష్టపడతారు. దీనివల్ల మీ ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి ఆస్కారం ఉంటుంది. ఇది సులువైన పని. ఎందుకంటే మానవ సంబంధాలలో ఉండే సంక్లిష్టత వీటిలో లేదు. మనుషులతో ప్రేమగా ఉండడం అనేది పూర్తి నరకంగా, నిరంతర సంఘర్షణగా మారింది. అందుకే జనం పశువులతో, పక్షులతో, యంత్రాలతో, వస్తువులతో ప్రేమలో పడుతున్నారు. ఇది ప్రేమ తాలూకు అత్యల్పమైన రూపం. దాన్ని మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు... అవగాహనలో మరో మెట్టుకు చేరుకుంటారు. ఒక్కొక్క సోపానాన్ని అధిరోహిస్తూ... అత్యున్నత శిఖరం చేరుకుంటారు. అప్పుడు ప్రేమ అనేది రాజకీయ సంబంధం కాదు. ఈ లోకాన్ని, లోకులను బుద్ధుడు ప్రేమించాడు, ఏసుక్రీస్తు ప్రేమించాడు. ప్రతిఫలంగా వారేమీ కోరుకోలేదు. మీరు కూడా అలాగే ప్రేమిస్తారు. ఇవ్వడంలో ఉన్న ఆనందాన్ని ఆస్వాదించడం కోసం ప్రేమను పంచుతారు. ఆ స్థితికి చేరుకున్నాక ప్రేమ అనేది ఒక బేరం కాదు. దాని సౌందర్యం అతీంద్రియంగా ఉంటుంది. అప్పటివరకూ మీరు ఆనందించిన ఆనందాలన్నిటినీ మించిన ఆనందాన్ని మీరు పొందుతారు.

ఓషో


Also Read:

ఇద్దరు మహిళలు కలిస్తే ఇలాగే ఉంటుందేమో..

బర్డ్ ఫ్లూ.. సీఎస్ విజయానంద్ ఏం చెప్పారంటే..

అప్పుల తెలంగాణ.. కేంద్ర మంత్రి షాకింగ్ కామెంట్స్..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Feb 14 , 2025 | 03:06 AM