Share News

Niharika M: కాలంతో మనం కూడా మారాలి

ABN , Publish Date - Oct 12 , 2025 | 06:47 AM

సోషల్‌ మీడియాలో రీల్స్‌ చూసేవారందరికి ‘నిహారిక ఎం’ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె అనేక మంది సెలబ్రిటీలతో చేసిన రీల్స్‌ను లక్షల మంది చూస్తూ ఉంటారు. ఇటీవల ఆమె సోషల్‌ మీడియా నుంచి....

Niharika M: కాలంతో మనం కూడా మారాలి

సండే సెలబ్రిటీ

సోషల్‌ మీడియాలో రీల్స్‌ చూసేవారందరికి ‘నిహారిక ఎం’ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె అనేక మంది సెలబ్రిటీలతో చేసిన రీల్స్‌ను లక్షల మంది చూస్తూ ఉంటారు. ఇటీవల ఆమె సోషల్‌ మీడియా నుంచి సినిమాలలోకి కూడా ప్రవేశించింది. తాజాగా ఆమె నటించిన ‘మిత్రమండలి’ అనే సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఆమెను ‘నవ్య’ పలకరించింది.

‘మిత్రమండలి’ సినిమా షూటింగ్‌ అనుభవమేమిటి?

చాలా ఎక్సైటింగ్‌గా అనిపించింది. డబ్బింగ్‌ కూడా పూర్తి చేసేశాను. ఈ సినిమా పెద్ద హిట్‌ అవుతుందనే నమ్మకం నాకుంది. ప్రేక్షకులు నా నమ్మకాన్ని వమ్ము చేయరని ఆశిస్తున్నాను.

సోషల్‌ మీడియా ఇన్‌ప్లూయెన్సర్‌.. సినిమాలో హీరోయిన్‌- ఈ రెండు పాత్రల మధ్య తేడా ఏమిటి?

సోషల్‌ మీడియాలో ఒక పోస్ట్‌ వైరల్‌ కాకపోతే వేరే పోస్ట్‌ పెట్టుకుంటాం. కానీ సినిమా అలా కాదు. మనని నమ్మి సమయం, డబ్బు, శ్రమ అన్నీ పెడతారు. అనేక అంచనాలు ఉంటాయి. వీటన్నింటి వల్ల విపరీతైన ఒత్తిడి ఉంటుంది. ఇన్‌ఫ్లూయెన్సర్‌గా ఉన్నప్పుడు అంతా ఒంటరి పోరాటమని చెప్పవచ్చు. కానీ సినిమా అనేది సామూహిక శ్రమ. అందువల్ల ఒత్తిడి ఎక్కువ.


ఈ రెండింటిలో ఏది ఎక్కువ శ్రమతో కూడుకున్నది?

రెండింటిలోను కష్టం ఉంది. సోషల్‌ మీడియాలో నా ఫ్లాట్‌ఫాంను నేనే స్వయంగా పైకి తీసుకువచ్చా. అక్కడ సృజనాత్మకంగా నేనే ఆలోచించేదాన్ని. నాకు నచ్చింది ప్రేక్షకులకు కూడా నచ్చేది. అదొక జర్నీ. అయితే సినిమాలో సృజనాత్మకంగా మన పాత్ర తక్కువగా ఉంటుంది. డైరక్టర్‌కు ఉన్న విజన్‌ ఆధారంగా సినిమా తీస్తారు. అంతే కాదు. నేను విధిని నమ్ముతాను. మనకు ఎంతో టాలెంట్‌ ఉండచ్చు. కానీ సరైన సమయానికి.. సరైన ప్రదేశంలో లేకపోతే ఫలితం ఉండదు.

అసలు మీ సోషల్‌ మీడియా ప్రయాణం ఎలా ప్రారంభమయింది?

నాకు 16 ఏళ్ల వయస్సులో యూట్యూబ్‌లో వీడియోలు పెట్టడం ప్రారంభించా. ఆ సమయంలో నేను కాలేజీలో చదివేదాన్ని. కాలేజీలో చదువు పూర్తయిన తర్వాత సరదాగా ఒక హాబీగా వీడియోలు చేసేదాన్ని. మొదటి నాలుగేళ్లు చాలా కష్టపడ్డా. ఆ సమయంలో యూట్యూబ్‌ నుంచి క్రియేటర్స్‌కు ఆదాయం వచ్చేది కాదు. అందువల్ల నాకు డబ్బులు వచ్చేవి కాదు. ఆ తర్వాత కోవిడ్‌ వచ్చింది. ఆ రెండేళ్లు వీడియోలు ఎక్కువగా చేయలేదు. ఆ తర్వాత మాస్టర్స్‌ చేయటానికి లాస్సేంజలిస్‌ వెళ్లాను. ఆ సమయంలో వీడియోలు చేసేదాన్ని. ఆ తర్వాత ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది.

సినిమాల్లోకి ఎందుకు వచ్చారు?

మార్పు అనేది అవసరం. కాలంతో పాటుగా మనం కూడా మారాలి. సోషల్‌ మీడియాలో ట్రెండ్స్‌ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. మ్యాజిక్‌ ఒక సారి జరుగుతుంది. రెండు మూడు సార్లు ప్రయత్నిస్తే జరగవచ్చు. కానీ ప్రతి సారి మ్యాజిక్‌ను క్రియేట్‌ చేయలేం. అంతే కాకుండా నేను ఎంత కాలం ఇన్‌ఫ్లూయెన్సర్‌గా ఉంటాను? నాకు నటన అంటే ఇష్టం. అందుకే సినిమాల్లోకి వచ్చాను.


ఎన్ని ఆడిషన్స్‌కు వెళ్లారు? మీ అనుభవమేమిటి?

నేను చాలా ఆడిషన్స్‌కు వెళ్లాను. లుక్‌టె్‌స్టలు చేయించుకున్నాను. నా ఉద్దేశంలో ఒక సినిమాకి ఇవి చాలా ముఖ్యం. ఎందుకంటే రకరకాల పాత్రల మధ్య కెమిస్ట్రి కుదురుతోందా? టైమింగ్‌ ఎలా ఉంటోంది? ఒక ఫ్రేమ్‌లో అందరూ ఎలా ఉన్నారు? అనే విషయాలు ఆడిషన్లు, లుక్‌ టెస్ట్‌ల ద్వారానే తెలుస్తాయి. నేను నటిస్తున్న సినిమాలన్నింటి కోసం ఆడిషన్స్‌ ఇచ్చాను. చాలా మందికి తెలియదు. ఇదంతా చాలా శ్రమతో, ఓర్పుతో కూడిన వ్యవహారం. నెలల తరబడి వేచి ఉండాల్సి వస్తుంది.

ఇప్పుడు రీల్స్‌ చేయటం మానేసారా?

లేదు. నా మనసుకు నచ్చిన టాపిక్‌ దొరికినప్పుడు చేస్తున్నాను. అయితే అది నా ప్రధాన వృత్తి కాదు కాబట్టి స్లో అయింది. అయినా ఇప్పటికీ నా రీల్సే నా ఐడెంటిటీ.

సీవీఎల్‌ఎన్‌ ప్రసాద్‌

ఒక రోజు ఎయిర్‌పోర్టులో ఒక ఆవిడ నన్ను కలిసారు. వాళ్ల అమ్మాయి చావు చివరి అంచుల్లో ఉందని.. తనతో ఒక సారి మాట్లాడమని రిక్వెస్ట్‌ చేశారు. అక్కడ నుంచి ఆమెకు వీడియో కాల్‌ చేశాం. ఆ అమ్మాయి- ‘‘నేను మీ రీల్స్‌ రోజూ చూస్తాను. వాటిని చూస్తుంటే మొత్తం బాధలన్నీ మర్చిపోతాను’’ అంది. నా జీవితంలో అంత కన్నా పెద్ద కాంప్లిమెంట్‌ ఎప్పుడూ రాలేదు. అందరినీ నవ్వించటం.. ఆనందంగా ఉంచటం కన్నా గొప్ప విషయమేమి ఉంటుంది? ఇప్పటి దాకా నాతో పనిచేసిన సహచర నటీనటులందరూ నా రీల్స్‌ గురించి చెబుతూ ఉంటారు. అప్పుడు నాకు చాలా ఆనందంగా, గర్వంగా అనిపిస్తూ ఉంటుంది.

ఈ వార్తలు కూడా చదవండి..

అలా ఉంటే జగన్ తట్టుకోలేడు... పల్లా షాకింగ్ కామెంట్స్

కల్తీ మద్యానికి మూల విరాట్ జగన్..

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 12 , 2025 | 06:47 AM