Natural Farming: ప్రకృతి వ్యవసాయంతోనే మనిషికి ఆరోగ్యం
ABN , Publish Date - Sep 25 , 2025 | 02:45 AM
ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించే పంటల వల్ల ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతోందని అధ్యయనాలు చెబుతున్నాయంటారు ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అడిదం నీరజ. వినూత్నమైన ఆలోచనలతో మరింత ఎక్కువ మంది రైతులను...
తెలుగు రాష్ట్రాల్లో సుమారు 6 లక్షల మంది ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. వీరిలో చాలా మంది రైతు సాధికార సంస్థ (ఆర్‌వైఎస్‌ఎస్) నుంచి శిక్షణ పొందిన వారే!
ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించే పంటల వల్ల ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతోందని అధ్యయనాలు చెబుతున్నాయంటారు ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అడిదం నీరజ. వినూత్నమైన ఆలోచనలతో మరింత ఎక్కువ మంది రైతులను సహజ వ్యవసాయం వైపు మళ్లించే ప్రయత్నాలు చేస్తున్న నీరజను ‘నవ్య’ పలకరించింది.
‘‘నేను పుట్టింది విజయవాడ దగ్గర. చదివింది ఆంధ్ర యూనివర్సిటీలో. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్(ఐఎఫ్‌ఎస్) వచ్చిన తర్వాత ఉత్తరప్రదేశ్ వెళ్లిపోయాను. కేంద్ర ప్రభుత్వంలో సెక్రటరీగా రిటైరయ్యాను. గత 75 ఏళ్లలో ఐఎఫ్‌ఎస్ నుంచి ఇప్పటి దాకా ఇద్దరికే పూర్తిస్థాయి హోదా వచ్చింది. అందులో రెండో వ్యక్తిని నేనే! నేను కేంద్రంలో వ్యవసాయ శాఖ జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నప్పుడు సేంద్రియ వ్యవసాయం.. ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన అనేక స్కీమ్‌లు ప్రారంభించాం. వీటి ద్వారా మన దేశంలో ఉన్న రకరకాల వ్యవసాయ పద్ధతులు.. రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలిసింది. ఆ తర్వాత ఎరువుల శాఖలో అడిషినల్ సెక్రటరీగా పనిచేస్తున్నప్పుడు మన దేశంలో రసాయన ఎరువుల వినియోగం ఎంత తీవ్రంగా ఉందో.. దాని వల్ల కలిగే సమస్యలేమిటో అర్థమయింది. ప్రతి సీజన్‌లోను ఎరువులకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోయేది. అప్పుడు మన రైతులు రసాయన ఎరువులపై ఎంత ఆధారపడ్డారో తెలిసింది. దీనికి ప్రత్యామ్నాయం కేవలం ప్రకృతి వ్యవసాయమే అనే స్పష్టత కూడా వచ్చింది.
9 మూల సిద్ధాంతాలు..
నాకు ఆర్‌వైఎస్‌ఎస్ గురించి చాలా కాలంగా తెలుసు. సంస్థ ఛైర్మన్ విజయకుమార్ గారు మాజీ ఐఏఎస్. ఆయన రైతుల మనిషి. వారితో మమేకమై పనిచేసే మనిషి. రసాయన ఎరువులపై ఆధారపడిన రైతులను ప్రకృతి వ్యవసాయంవైపు మళ్లించటం అంత సులభం కాదు. ఈ విషయంలో ఆయన అసాధారణమైన కృషి చేస్తున్నారు. అందుకే నేను రిటైరైన తర్వాత ఆర్‌వైఎస్‌ఎస్‌లో ఎగ్జిక్యూటివ్ డైరక్టర్‌గా చేరాను. ప్రస్తుతం మా సంస్థలో ఆరు లక్షల మంది రైతులు భాగస్వాములుగా.. సుమారు ఆరు లక్షల ఎకరాల్లో సాగుచేస్తున్నారు. తొమ్మిది మూల సిద్ధాంతాలపై ఆధారపడి ఆర్‌వైఎస్‌ఎస్ పనిచేస్తుంది. ఆవు మూత్రం, పేడ, ఇతర పదార్థాలను వినియోగించి జీవామృతం, ద్రవామృతం, కషాయాలను ఎలా తయారుచేయాలో ఆర్‌వైఎస్‌ఎస్ సిబ్బంది రైతులకు నేర్పిస్తారు. పంటను అమ్మేందుకు ఉన్న అవకాశాలను వారికి వివరిస్తారు. ఈ క్రమంలో ఆర్‌వైఎస్‌ఎస్ రైతులు తమ కాళ్ల మీద తామే నిలబడేలా చేస్తుంది. మా ఉద్దేశంలో- ప్రొత్సాహకాలు ఇవ్వటం కన్నా.. వారికి విజ్ఞానాన్ని అందించి.. స్వయంసమృద్ధి కలిగేలా చేయటమే ముఖ్యం. అదే మా సిద్ధాంతం. అంతే కాదు. మా సంస్థను రైతులే నడుపుతారు. వారే తమ సహరైతులకు శిక్షణ ఇస్తూ ఉంటారు. దీని కోసం వారు రకరకాల మోడల్స్‌ను తయారుచేశారు. ఉదాహరణకు రాయలసీమలో ఎక్కువ వర్షాలు పడవు. అందువల్ల అక్కడ భూమి, వాతావరణ పరిస్థితులకు తగినట్టుగా మోడల్స్‌ను తయారుచేసి అందిస్తారు. దీని వల్ల వారికి ఎక్కువ దిగుబడి లభిస్తుంది. ఇక ప్రకృతి వ్యవసాయంలో అనుసరించే విధానాల వల్ల భూమిలో సారం, పంట దిగుబడులు పెరుగుతాయి. రైతుకు ఆదాయం కూడా పెరుగుతుంది.

రసాయనాలు, రసాయన ఎరువులు లేని ఆహార ఉత్పత్తులు తీసుకోవటం వల్ల ప్రజల ఆరోగ్యం మెరుగవుతుంది. ఇలా సమాజంలోని అందరికీ ఏదో ఒక మేలు జరుగుతుంది. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలి. ఆర్‌వైఎస్‌ఎస్ అనుసరిస్తున్న విధానాన్ని కేంద్ర ప్రభుత్వం- ‘నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్’- పేరిట దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ అమలు చేయటానికి ప్రయత్నాలు ప్రారంభించింది. కేవలం కేంద్ర ప్రభుత్వమే కాదు.. అనేక స్వచ్ఛంద సంస్థలు కూడా ఆర్‌వైఎస్‌ఎస్‌తో కలిపి పనిచేస్తున్నాయి. ప్రస్తుతం 15 రాష్ట్రాలలో ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
ఆరోగ్యంపై కూడా దృష్టి..
ఒకవైపు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడంతో పాటు ఆ విధంగా పండించిన ఆహారాన్ని తింటే ఎటువంటి ఫలితాలు వస్తున్నాయన్న అంశంపై అధ్యయనాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం 400 గ్రామాల్లోని మహిళలతో కలిసి ఆర్‌వైఎస్‌ఎస్ పనిచేస్తోంది. వారికి కిచెన్ గార్డెన్స్ ఎలా ఏర్పాటు చేసుకోవాలి.. ఫుడ్ బాస్కెట్స్ వల్ల ప్రయోజనాలేమిటనే విషయంపై అవగాహన కల్పిస్తున్నాం. ఒక కుటుంబం ఆరోగ్యంగా ఉండాలంటే- గృహిణికి ఆహారపదార్థాల పట్ల అవగాహన అవసరం. ఇటీవల ఆర్‌వైఎస్‌ఎస్‌తో కలిపి మంగళగిరి ఎయిమ్స్‌కు చెందిన డాక్టర్లు కొన్ని పరిశోధనలు చేశారు. వీరి అధ్యయనంలో ఎటువంటి రసాయనాలు లేని ఆహారపదార్థాలు తిన్న గర్భిణుల లోనూ, చిన్నారులలోనూ హిమోగ్లోబిన్ శాతం పెరిగింది. అంటే సహజమైన ఆహార ఉత్పత్తులను క్రమం తప్పకుండా తింటే ఆరోగ్యసమస్యలు కూడా రావు. ఈ విషయంపై ప్రజల్లో అవగాహన పెరిగితే అనేక ఆరోగ్య సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. కేవలం రక్తహీనత వంటి సమస్యలే కాకుండా రసాయన ఎరువుల ద్వారా పండించే పంటల వల్ల క్యాన్సర్ వంటి సమస్యలు వస్తున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. దీనిపై ప్రజల్లో అవగాహన పెరిగితే వారు ప్రతి రోజు తినటం మొదలుపెడతారు. దీని వల్ల ఈ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే రైతులు ముందుకు వచ్చి పంటలు పండించటం మొదలుపెడతారు. అందుకే మేము రైతుల్లోనే కాకుండా.. ప్రజల్లో కూడా అవగాహన పెంచటానికి ప్రయత్నాలు చేస్తున్నాం.
బూటు శ్రీనివాస్, విశాఖపట్నం
ఫొటోలు: రఫీ
ఈ వార్తలు కూడా చదవండి..
కృష్ణమ్మకు వరద పోటు.. ప్రభుత్వం అలర్ట్
అసెంబ్లీలో ఆమోదం పొందనున్న పలు బిల్లులు
For More AP News And Telugu News