Namaz Importance: నమాజ్ పవిత్ర విధి
ABN , Publish Date - Sep 12 , 2025 | 05:37 AM
అల్లా్‌హపైన, దైవప్రవక్తపైన భక్తి విశ్వాసాలను చూపించడానికి అత్యంత ఆవశ్యకమైన విధి నమాజ్. దైవారాధనలో నమాజ్ పాత్ర ఎంతో కీలకమైనది. ప్రతిరోజూ అయిదుసార్లు (ఫజర్, జొహర్, అసర్, మగ్రీబ్, ఇషా) చేయాల్సిన విధిగా...
సందేశం
అల్లా్‌హపైన, దైవప్రవక్తపైన భక్తి విశ్వాసాలను చూపించడానికి అత్యంత ఆవశ్యకమైన విధి నమాజ్. దైవారాధనలో నమాజ్ పాత్ర ఎంతో కీలకమైనది. ప్రతిరోజూ అయిదుసార్లు (ఫజర్, జొహర్, అసర్, మగ్రీబ్, ఇషా) చేయాల్సిన విధిగా నిర్దేశితమైన నమాజ్... ఇస్లాం ధర్మం మూల స్తంభాలలో ఒకటి. ‘‘నమాజ్ ద్వారా సహాయం పొందండి. నమాజ్ నిస్సందేహంగా కష్టతరమైన కార్యమే. కానీ అల్లా్‌హకు విధేయులైన దాసులకు ఇది ఎంతమాత్రం కష్టం కాదు. మీ కుటుంబ సభ్యులను నమాజ్ చేయాల్సిందిగా ఆజ్ఞాపించండి. మీరు కూడా దాన్ని పాటించండి. మీ ప్రభువును స్తుతించడంతోపాటు ఆయన పవిత్ర నామాన్ని జపిస్తూ ఉండండి. సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయానికి ముందు, రాత్రి సమయంలో కూడా ఆ పవిత్ర నామాన్ని జపించండి’’ అని వివిధ సందర్భాలలో అంతిమ పవిత్ర గ్రంథమైన దివ్య ఖుర్‌ఆన్ పేర్కొంది.
‘‘ఎవరైతే క్రమం తప్పకుండా సక్రమంగా నమాజ్ చేస్తారో... ప్రళయ దినాన ఆ నమాజ్ అతని కోసం జ్యోతిగా, అతని విశ్వాసానికి నిదర్శనంగా, ముక్తి సాధనంగా మారుతుంది. ఎవరు నిబద్ధతతో, ఏకాగ్రతతో నమాజ్ చేయరో వారు అవిశ్వాసులుగా జమ అవుతారు’’ అని దైవప్రవక్త మహమ్మద్ తెలిపారు. ‘‘ఒక వ్యక్తి ఇంటి ముందు నది ప్రవహిస్తోంది. అతను ఆ నదిలో రోజూ అయిదుసార్లు స్నానం చేస్తూ ఉంటాడు. ఇక అతని శరీరం పైన మలినం ఉంటుందా?’’ అని తన అనుచరులను ఆయన ప్రశ్నించారు. ‘‘ఎలాంటి మలినం ఉండదు’’ అని వారు సమాధానం చెప్పారు. ‘‘రోజుకు అయిదుసార్లు నమాజ్ చేసే మనిషి స్థితి కూడా అలాగే ఉంటుంది. అయిదు వేళలా నమాజ్ చేసిన దాసుని పాపాలను అల్లాహ్ క్షమిస్తాడు’’ అని దైవప్రవక్త స్పష్టం చేశారు.
నమాజ్ వల్ల అనేక లాభాలు ఉన్నాయి.. అల్లా్‌హతో బాంధవ్యాన్ని నమాజ్ బలోపేతం చేస్తుంది. మనో ధైర్యాన్ని పెంచుతుంది. ఆత్మవిశ్వాసాన్ని బలోపేతం చేస్తుంది. నమాజ్ నియమం ప్రకారం చేసేవారిలో క్రమశిక్షణ, సహనం, చక్కగా మాట్లాడే పద్ధతి, ఉత్తమమైన నడత, మంచి దృక్పథం, నిజాయితీ లాంటి సద్గుణాలు వృద్ధి చెందుతాయి. సమూహంగా నిర్వహించే నమాజ్ సామాజిక ఐక్యతను, సోదర భావాన్ని, సమానత్వాన్ని ప్రోత్సహిస్తుంది. ఎలాంటి భేదాలు లేకుండా అందరూ ఒకే వరుసలో నిలబడి నమాజ్ చేయడం... ఇస్లాం సార్వత్రికతకు చిహ్నం. నమాజ్... ఇస్లాం ఆరాధనలో ప్రధానాంశం. కాబట్టి నమాజ్‌ను అందరూ సక్రమంగా, పూర్తి ఏకాగ్రతతో ఆచరించాలి. దానిద్వారానే సకల శుభాలు జరుగుతాయి. దైవ సాన్నిధ్యపు ద్వారాలు తెరుచుకుంటాయి. సన్మార్గంలో పయనం సులభతరం అవుతుంది.
మహమ్మద్ వహీదుద్దీన్
ఇవి కూడా చదవండి
నిఖత్‌కు నిరాశ క్వార్టర్స్‌లో ఓటమి
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి