2025 Releases : ఈ ఏడాదే విడుదల..!
ABN , Publish Date - Jan 26 , 2025 | 12:07 AM
సినీ ప్రేమికుల అభిరుచిని ఎప్పటికప్పుడు పసిగట్టడంలో ముందుంటుంది ఐఎండీబీ (ఇంటర్నెట్ మూవీస్ డేటాబేస్). సినిమాల వివరాలు, అప్‌డేట్స్, రేటింగ్స్, తారాగణం, విడుదల తేదీలు.. ఇలా ప్రతీ విషయాన్ని సినీ ప్రియులకు సమాచారం అందిస్తుంటుందీ వెబ్‌సైట్. వాటితో పాటు ఇప్పుడు ఈ ఏడాది ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న
సినీ ప్రేమికుల అభిరుచిని ఎప్పటికప్పుడు పసిగట్టడంలో ముందుంటుంది ఐఎండీబీ (ఇంటర్నెట్ మూవీస్ డేటాబేస్). సినిమాల వివరాలు, అప్‌డేట్స్, రేటింగ్స్, తారాగణం, విడుదల తేదీలు.. ఇలా ప్రతీ విషయాన్ని సినీ ప్రియులకు సమాచారం అందిస్తుంటుందీ వెబ్‌సైట్. వాటితో పాటు ఇప్పుడు ఈ ఏడాది ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న 20 భారతీయ చిత్రాల జాబితాను అందించింది. ఇందులో యాక్షన్ ఎంటర్టైనర్లు, సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్లు, పీరియాడిక్ డ్రామాలు, హారర్ కామెడీ సహా రొమాంటిక్ చిత్రాలు... అన్నీ ఉన్నాయి.
బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్ ‘సికందర్’ సినిమా ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది.. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు ఏ.ఆర్.మురుగదాస్ తెరకెక్కిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌లో రష్మిక మందన్న కథానాయిక. సాజిద్ నడియడ్‌వాలా నిర్మిస్తున్నారు. ఇటీవలే టీజర్‌ను విడుదల చేసి ఈ సినిమాపై అంచనాలు పెంచేశారు. ఇందులో సల్మాన్ లుక్, సంభాషణలు, యాక్షన్‌తో పాటు విజువల్స్ ఆకట్టుకున్నాయి. టీజర్ చూసి ఫిదా అయిన అభిమానులు.. ఈ సారి సల్మాన్‌కు హిట్ పక్కా అని ఆనందపడుతున్నారు. సల్మాన్‌ఖాన్‌కున్న రంజాన్ సెంటిమెంట్ గురించి సంగతి తెలిసిందే. అందుకే రంజాన్ సందర్భంగా చిత్రాన్ని మార్చి 28న విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమా జాబితాలో ముందు వరుసలో ఉన్నందుకు దర్శకుడు మురుగదాస్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సినిమాలోని ప్రతీ సన్నివేశం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుందని ఆయన తెలిపారు.
టాక్సిక్: కన్నడ స్టార్ హీరో, ‘కె.జీ.ఎఫ్’ సిరీస్ చిత్రాల నటుడు యష్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘టాక్సిక్’ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉంది. గీతూ మోహన్‌దా్‌స దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను ఏప్రిల్ 10న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవలే యష్ బర్త్‌డే సందర్భంగా సినిమా గ్లింప్స్‌ను విడుదల చేశారు.
కూలీ: మాస్, క్లాస్ అన్న తేడా లేకుండా అందరూ సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. సూపర్ హిట్ చిత్రాల స్పెషలిస్ట్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న చిత్రం ‘కూలీ’ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉంది. నాగార్జున, ఉపేంద్ర, పూజా హెగ్దే, శ్రుతీ హాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మే 1న విడుదల.
రెట్రో: సూర్య గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్న ‘రెట్రో’ చిత్రం ఈ జాబితాలో 12వ స్థానంలో ఉంది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకుడు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన వాటిల్లో అధిక శాతం గ్యాంగ్‌స్టర్ తరహా కథాంశాలు కావడం.. ఆ సినిమాలన్నీ యాక్షన్ ప్రియులను అలరించడంతో ‘రెట్రో’పై మంచి అంచనాలున్నాయి. మే 1న సినిమా విడుదలవుతోంది.
రాజాసాబ్: ‘సలార్’, ‘కల్కి 2898 ఏ.డీ’ చిత్రాల వరుస విజయాలతో జోరుమీదున్నారు ప్రభాస్. ఆయన కథానాయకుడిగా మారుతి దర్శకత్వంతో తెరకెక్కుతోన్న చిత్రం ‘రాజాసాబ్’ ఈ జాబితాలో ఆరోస్థానంలో ఉంది. ఈ హారర్ థ్రిల్లర్‌ను మొదట ఏప్రిల్ 10న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఏవో కారణాలవల్ల ఈ సినిమా విడుదల తేదీ మారింది. రిలీజ్ ఎప్పుడనే విషయంలో సస్పెన్స్ ఉన్నప్పటికీ, అంచనాలు మాత్రం తారస్థాయిలో ఉన్నాయి.
ఎల్ 2 ఎంపురాన్: మలయాళ నటుడు మోహన్‌లాల్ 2019లో నటించిన ‘లూసీఫర్’కు ఇది కొనసాగింపు భాగం. పృథ్వీరాజన్ సుకుమారన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం జాబితాలో ఎనిమిదో స్థానంలో ఉంది. స్టీఫెన్ గట్టుపల్లిగా మొదటిభాగంలో అలరించిన మోహన్‌లాల్, రెండో భాగం ‘ఎల్ 2 ఎంపురాన్’ లో గ్యాంగ్‌స్టర్ అబ్రహం ఖురేషిగా కనిపించనుండడంతో ఈ సినిమా కోసం అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
వార్ 2: ‘ఆర్‌ఆర్‌ఆర్’, ‘దేవర’ చిత్రాలతో నార్త్‌లోనూ మంచి క్రేజ్ సంపాదించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఇప్పుడు డైరెక్ట్‌గా ‘వార్ 2’ చిత్రంతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నారు. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ‘బ్రహ్మాస’్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకుడు. ఈ జాబితాలో ఏడో స్థానాన్ని సంపాదించిందీ చిత్రం. ‘వార్’ చిత్రానికి ఇది కొనసాగింపు.
కన్నప్ప: మంచు విష్ణు టైటిల్ రోల్‌లో నటిస్తున్న చిత్రం పీరియాడిక్ ఫాంటసీ చిత్రం ‘కన్నప్ప’ ఈ జాబితాలో 11వ స్థానంలో ఉంది. ముఖేశ్‌కుమార్ దర్శకత్వంలో మోహన్‌బాబు నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 25న విడుదల. ఈ చిత్రంలో ప్రభాస్, మోహన్‌బాబు, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, ఆర్.శరత్‌కుమార్, బ్రహ్మానందం, అక్షయ్‌కుమార్, ప్రీతి ముకుందన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
థగ్ లైఫ్: హీరో కమల్‌హాసన్, దర్శకుడు మణిరత్నం కలయికలో 1987లో వచ్చిన ట్రెండ్‌సెట్టర్ ‘నాయకుడు’. దాదాపు 38 ఏళ్ల తర్వాత వీరి కలయికలో ‘థగ్ లైఫ్’. తెరకెక్కుతోంది. ఈ జాబితాలో 13వ స్థానంలో ఉందీ చిత్రం. దీనిపై అంచనాలు అధికమయ్యాయి. శింబు, జయం రవి, త్రిష, ఐశ్వర్య లక్ష్మీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూన్ 5న చిత్రం విడుదలవుతోంది.
కాంతార ఏ లెజెండ్: ఛాప్టర్ 1
‘కాంతార’ సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్‌ను సంపాదించుకున్నారు కన్నడ నటుడు రిషబ్ షెట్టి. ‘కాంతార’కు ప్రీక్వెల్‌గా ఆయన కథానాయకుడిగా నటిస్తూ, స్వీయ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘కాంతార ద లెజెండ్’: ఛాప్టర్ 1’. ఈ జాబితాలో 18వ స్థానంలో ఉంది. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న చిత్రం విడుదలవుతోంది.
తండేల్: నాగచైతన్య, సాయి పల్లవి నటించిన ఈ సినిమాకు చందు మొందేటి దర్శకుడు. ఈ జాబితాలో 20వ స్థానంలో ఉంది. ఓ మత్స్యకారుని జీవితంలో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఫిబ్రవరి 7న విడుదలవుతోంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పాటలు సినిమాపై అంచనాలను పెంచేశాయి.
జాబితాలోని 20 చిత్రాలివే
ఇందులో 11 హిందీ చిత్రాలు ఉన్నాయి. తెలుగు నుంచి మూడు.. తమిళ్ నుంచి మూడు చిత్రాలు ఉన్నాయి. కన్నడ నుంచి రెండు చిత్రాలు.. మలయాళం నుంచి కేవలం ఒక్క చిత్రం చోటుదక్కిందచుకుంది. హీరోల్లో అత్యధికంగా అక్షయ్‌కుమార్ నటించిన మూడు సినిమాలు.. ‘స్కై ఫోర్స్’, ‘కన్నప్ప’, ‘హౌస్‌ఫుల్ 5’ లిస్ట్‌లో ఉన్నాయి. అలాగే, హీరోయిన్లలో రష్మిక నటించిన మూడు సినిమాలు.. ‘సికందర్’, ‘ఛావా’, ‘థామా’ ఈ జాబితాలో ఉన్నాయి. ఈ లిస్ట్‌లో ఉన్న ఐదు చిత్రాలు ‘హౌస్‌ఫుల్ 5’, ‘బాఘీ 4’, ‘వార్ 2’, ‘సితారే జమీన్ పర్’, ‘కాంతార ఏ లెజెండ్: ఛాప్టర్ 1’ చిత్రాలు సీక్వెల్స్ లేదా విజయవంతమైన ఫ్రాంచైజీలకు కొనసాగింపు కావడం విశేషం.

1.సికందర్
2.టాక్సిక్
3.కూలీ
4.హౌస్‌ఫుల్
5. బాఘీ 4
6.ద రాజాసాబ్
7.వార్ 2
8. ఎల్2:ఎంపురాన్
9.దేవ
10.ఛావా
11.కన్నప్ప
12.రెట్రో
13.థగ్‌లైఫ్
14.జాట్
15.స్కై ఫోర్స్
16.సితారే
జమీన్ పర్
17.థామా
18.కాంతార ఏ లెజెండ్: ఛాప్టర్ 1
19.ఆల్ఫా
20.తండేల్.