Monsoon Plant Care: వానల్లో మొక్కల సంరక్షణ
ABN , Publish Date - Sep 03 , 2025 | 02:27 AM
మనం సాధారణంగా బాల్కనీలో, ఇంటి పరిసరాల్లో మొక్కల కుండీలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. వర్షాకాలంలో ఈ మొక్కలు బాగా పెరుగుతాయి. కానీ ఒక్కోసారి ఆకులు పసుపు రంగులోకి మారడం...
మనం సాధారణంగా బాల్కనీలో, ఇంటి పరిసరాల్లో మొక్కల కుండీలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. వర్షాకాలంలో ఈ మొక్కలు బాగా పెరుగుతాయి. కానీ ఒక్కోసారి ఆకులు పసుపు రంగులోకి మారడం, కాండానికి ఫంగస్ రావడం, వేళ్లు కుళ్లిపోయి మొక్కలు వడలిపోవడం లాంటివి గమనిస్తూ ఉంటాం. అలాకాకుండా మొక్కలు ఆరోగ్యంగా పెరగాలంటే వర్షాకాలంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం...
నీళ్లు ఎక్కువగా అవసరంలేని మొక్కల కుండీలకు వర్షం తగలకుండా జాగ్త్రలు తీసుకోవాలి. వీటి మీద గ్రీన్ నెట్ అమర్చడం మంచిది.
వర్షాకాలంలో కుండీలను ముప్పావు వంతుకు పైగా మట్టితో నింపాలి. దీనివల్ల వర్షపు నీరు ఎక్కువగా కుండీల్లో నిలవకుండా ఉంటుంది.
కుండీల్లో మట్టి మరీ మెత్తగా ఉంటే అది ఎక్కువగా నీటిని పీల్చుకుంటుంది. దీనివల్ల వర్షాకాలంలో మొక్కలు త్వరగా పాడవుతాయి. అలాంటప్పుడు ఈ మెత్తని మట్టిలో కొద్దిగా ఇసుకను కలిపితే అదనపు నీరు త్వరగా బయటికి వెళుతుంది.
కుండీ అడుగు భాగంలో ఉండే రంధ్రాలను గమనించాలి. కుండీలో చేరిన అదనపు నీరు బయటికి వస్తుందో లేదో పరిశీలించాలి. రంధ్రాల వద్ద వేళ్లు లేదా మట్టి చేరి నీళ్లు బయటికి పోకుండా అడ్డుపడుతుంటాయి. వీటిని ఎప్పటికప్పుడు సరిచేస్తూ ఉండాలి.
వర్షాకాలంలో కుండీల కింద పళ్లాలు ఉంచకూడదు. అలా ఉంచితే మొక్కల వేళ్లు కుళ్లిపోయే అవకాశం ఉంటుంది. చిన్న కాళ్లు ఉన్న కుండీలను ఎంచుకోవడం మంచిది. అలా లేని పక్షంలో కుండీ కింద నాలుగు వైపులా చదునుగా ఉన్న రాళ్లు అమర్చాలి. అప్పుడు కుండీలో చేరే వర్షపు నీరు సులువుగా బయటికి వెళుతుంది.
వర్షాకాలంలో గాలులు బలంగా వీస్తుంటాయి. వీటి ధాటికి కుండీల్లోని మొక్కలు వంగిపోవచ్చు. ఒక్కోసారి వేళ్లతో సహా ఒరిగిపోవచ్చు. అలాకాకుండా మొక్కలన్నింటికీ ఆధారంగా కర్రలను కుండీల్లో నిలబెట్టాలి.
కాండానికి కింది భాగంలో ఉన్న ఆకులకు తేమ ఎక్కువగా తగులుతూ ఉంటుంది. దీనివల్ల మొక్కకు ఫంగస్ చేరవచ్చు. కాబట్టి కుండీలో మట్టికి దగ్గరగా ఉండే ఆకులను కత్తిరించడం మంచిది.
ఈ వార్తలు కూడా చదవండి..
పోలీసులపై కాల్పులు.. రేప్ కేసులో అరెస్టయిన ఎమ్మెల్యే పరార్..
సీఎం సిద్దూ సంచలన కామెంట్స్.. బీజేపీది రాజకీయ యాత్ర
For More National News