Share News

Monsoon Care Silk Sarees: వర్షాకాలంలో పట్టుచీరలను ఇలా

ABN , Publish Date - Aug 31 , 2025 | 02:38 AM

పర్వదినాల్లో మహిళలు పట్టుచీరలు కట్టుకుని దేవాలయాలకు, బంధు మిత్రుల ఇళ్లకు వెళుతూ ఉంటారు. ఆ సమయంలో అనుకోకుండా వర్షం కురిస్తే ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ పట్టుచీరలు కొద్దో గొప్పో...

Monsoon Care Silk Sarees: వర్షాకాలంలో పట్టుచీరలను ఇలా

పర్వదినాల్లో మహిళలు పట్టుచీరలు కట్టుకుని దేవాలయాలకు, బంధు మిత్రుల ఇళ్లకు వెళుతూ ఉంటారు. ఆ సమయంలో అనుకోకుండా వర్షం కురిస్తే ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ పట్టుచీరలు కొద్దో గొప్పో తడిసి తేమను పీల్చుకుంటాయి. అలాంటప్పుడు పట్టుచీరలను సంరక్షించుకునే పద్ధతులతోపాటు వర్షాకాలంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం...

  • తేమవల్ల పట్టుచీర మీద ఒకరకమైన బూజు ఏర్పడుతుంది. దీంతో దారం పోగులు బలహీనమవుతాయి. చీర చిరుగులు పడుతుంది. కాబట్టి తడిసిన పట్టుచీరను గాలి తగిలేలా నీడలో ఆరవేయాలి.

  • ఇస్త్రీ చేసిన తరవాత పట్టుచీర నుంచి కొద్దిపాటి తేమ బయటికి వస్తుంది. చీర పూర్తిగా వేడి చల్లారేవరకు వేచి ఉండాలి. ఏమాత్రం తడి లేదని నిర్ధారించుకున్న తరవాతనే బీరువాలో పెట్టాలి.

  • పట్టుచీరలను పలుచని కాటన్‌ వస్త్రం లేదా పేపర్లో చుట్టి జాగ్రత్త చేయాలి. దీనివల్ల వాతావరణంలోని తేమ, దుమ్ము లాంటివి చీరకు పట్టకుండా ఉంటాయి. ఈ చీరలను ప్లాస్టిక్‌ కవర్లలో పెట్టి ప్యాక్‌ చేయకూడదు. అలా చేస్తే ఫంగస్‌ లాంటివి చేరి పాడుచేస్తాయి.

  • బీరువాలో పట్టుచీరలను ఉంచిన అరల్లో ఒకటి లేదా రెండు సిలికా జెల్‌ సాచెట్లను ఉంచడం మంచిది. ఇవి తేమను పీల్చుకుని చీరలను పొడిగా ఉంచుతాయి. కొద్దిగా రాతి ఉప్పు, బేకింగ్‌ సోడా, చార్‌కోల్‌ పొడిలో ఒకదాన్ని తీసుకుని చిన్న కాగితాల్లో కొద్దికొద్దిగా వేసి పొట్లాలు కట్టి వాటిని బీరువా అరల్లో ఉంచినా మంచి ప్రయోజనం కనిపిస్తుంది. రెండు వారాలకు ఒకసారి ఈ పొట్లాలను మారుస్తూ ఉండాలి.

  • కర్పూరం బిళ్లలు, కలరా ఉండలు, ఎండిన వేపాకులను పలుచని గుడ్డలో చుట్టి బీరువా అరల్లో ఉంచడం వల్ల సిల్వర్‌ ఫిష్‌, చిమ్మటలు లాంటి క్రిమి కీటకాలు చేరకుండా ఉంటాయి.

  • నెలకు ఒకసారి పట్టుచీరలను బయటికి తీసి మడతలు విప్పి మెల్లగా దులపాలి. తరవాత మరోవిధంగా మడతపెట్టి జాగ్రత్త చేయాలి. చీర లు తేమగా ఉన్నాయనిపిస్తే కొద్దిసేపు లేత ఎండలో ఆరవేయాలి. సూర్యరశ్మి నేరుగా తగిలితే చీరలు రంగు కోల్పోయే అవకాశముంటుంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

  • బీరువా అమర్చిన చోట నేరుగా ఎండ తగలకుండా చూసుకోవాలి. బీరువా వెనక గోడ నుంచి లీకేజీ, చెమ్మ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. బీరువా కింద, పక్కల.. బూజు, దుమ్ము చేరకుండా తరచూ శుభ్రం చేస్తూ ఉండాలి. అప్పుడే బీరువాలోని పట్టుచీరలు చాలాకాలం మన్నుతాయి.

ఈ వార్తలు కూడా చదవండి..

ఇన్‌ఫార్మర్‌ నెపంతో గిరిజనుడి హత్య

గణేశుడి మండపం వద్ద కరెంట్‌ షాక్‌తో బాలుడి మృతి

Read Latest Telangana News and National News

Updated Date - Aug 31 , 2025 | 02:39 AM