Share News

Meera Badwedi : చూపు లేని వారికి చుక్కానిలా

ABN , Publish Date - Feb 05 , 2025 | 11:39 PM

అంధ విద్యార్థులకు పాఠాలు చెప్పడంతో మొదలై, వారికి అన్నీ తానై నిలిచే వరకూ... మీరా బద్వేది సుదీర్ఘమైన ప్రయాణం. దాదాపు ముప్ఫయ్యేళ్లుగా... వేలమంది అంధులకు విద్య, ఆశ్రయం, ఉపాధి కల్పన ద్వారా వారి సర్వతోముఖాభివృద్ధికి ఆమె దోహదం చేస్తున్నారు. ‘‘ఎవరో వస్తారని ఎదురుచూడడం కన్నా మనమే ముందడుగు వెయ్యాలి’’ అంటున్న మీరా బద్వే కథ ఆమె మాటల్లోనే...

Meera Badwedi : చూపు లేని వారికి చుక్కానిలా

అంధ విద్యార్థులకు పాఠాలు చెప్పడంతో మొదలై, వారికి అన్నీ తానై నిలిచే వరకూ... మీరా బద్వేది సుదీర్ఘమైన ప్రయాణం. దాదాపు ముప్ఫయ్యేళ్లుగా... వేలమంది అంధులకు విద్య, ఆశ్రయం, ఉపాధి కల్పన ద్వారా వారి సర్వతోముఖాభివృద్ధికి ఆమె దోహదం చేస్తున్నారు. ‘‘ఎవరో వస్తారని ఎదురుచూడడం కన్నా మనమే ముందడుగు వెయ్యాలి’’ అంటున్న మీరా బద్వే కథ ఆమె మాటల్లోనే...

‘‘ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సమయంలో ‘నా జీవితానికి అర్థమేమిటి?’ అనే ప్రశ్న ఎదురవుతుంది. జీవితాన్ని అర్థవంతంగా చేసుకోవడానికి మనం చేసే ప్రయత్నాల్లో... ఎంతో ఆలోచించి అమలు చేసినవి విఫలమవుతాయి. కానీ ఎలాంటి ప్రణాళిక లేకుండా చేసిన కొన్ని పనులు మన జీవితానికి వినూత్నమైన నిర్వచనాన్ని ఇస్తాయి. అలాంటి మార్పు తెచ్చిన సంఘటన ముప్ఫయ్యేళ్ళ క్రితం జరిగింది. నేను పుట్టింది మహారాష్ట్రలోని పుణేలో. చదువు పూర్తయ్యాక పాఠశాలలు, కళాశాలల్లో ఆంగ్ల బోధకురాలుగా పని చేశాను. వివాహమై, మా అమ్మాయి ఉమ పుట్టిన తరువాత ఉద్యోగం వదిలి, పూర్తిగా ఇంటి బాధ్యతలకే పరిమితం అయిపోయాను. అయితే ఏదో వెలితిగా ఉండేది. అందుకే మా అమ్మాయి కాస్త పెద్దది కాగానే... ఒక కాలేజీ నుంచి వచ్చిన అవకాశాన్ని అంగీకరించాను. కానీ అక్కడ చేరేలోగా... స్థానికంగా ఉన్న అంధుల పాఠశాల సందర్శన నన్ను కొత్త దారిలో నడిపించింది.


వారి భరోసాతో కళ్ళలో నీళ్ళు తిరిగాయి...

నా భర్తకు చాలా సంవత్సరాలుగా ఒక అంధుల పాఠశాలకు విరాళాలు ఇవ్వడం ఆనవాయితీ. ఒకసారి ఆయనతోపాటు ఆ పాఠశాలకు వెళ్ళాను. అప్పుడు అక్కడ అడ్మిషన్లు జరుగుతున్నాయి. ఎంతోమంది పిల్లలు క్యూలో నిలబడి ఉన్నారు. ‘అపరిచితమైన కొత్త ప్రదేశంలో ఎలా ఉండాలా?’ అనే బాధ, దిగులు వారిలో కనిపిస్తున్నాయి. ఇంతలో ఒక పిల్లాడు ఆ క్యూ మధ్యలోనుంచి పరిగెత్తుతూ వచ్చాడు. దారిలో ఉన్న నన్ను గట్టిగా పట్టుకున్నాడు. నేను అతని తల్లిని అనుకున్నాడు. ఇంటికి తీసుకువెళ్ళాలంటూ ఏడుస్తున్నాడు. ఈలోగా తల్లితండ్రులు వచ్చి అతన్ని తీసుకుపోయారు. నేను, నా భర్త తిరిగి వెళ్తున్నప్పుడు ‘‘ఈ పిల్లల కోసం ఏదైనా చెయ్యాలని ఉంది. ఇక్కడే టీచర్‌గా చేరాలనుకుంటున్నాను’’ అని చెప్పాను. నాకు గతంలో అనుభవం ఉంది కాబట్టి అక్కడ బోధకురాలుగా చేరడం కష్టం కాలేదు. అయితే చేరిన తరువాత మాత్రం ఎన్నో సవాళ్ళు ఎదురయ్యాయి. అప్పటికి నాకు బ్రెయిలీ రాకపోవడంతో బోధించడానికి తడబడ్డాను. కానీ క్రమంగా పిల్లలతో నాకు మంచి అనుబంధం ఏర్పడింది. నేను ఇబ్బంది పడుతున్నానని గ్రహించిన ఆ పిల్లలు ‘‘మీకు బ్రెయిలీ రాదని మమ్మల్ని వదిలేసి వెళ్ళొద్దు టీచర్‌! మీకు మేము నేర్పిస్తాం’’ అని భరోసా ఇచ్చినప్పుడు నాకు కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఆ తరువాత బ్రెయిలీ నేర్చుకున్నాను. వారితో మమేకమెన నేను మూడేళ్ళ తరువాత ఆ ఉద్యోగం మానెయ్యాల్సి వచ్చింది.

ఆ ధోరణి భరించలేక...

పిల్లలకు వారి వైకల్యాన్ని పదేపదే గుర్తు చేసేలా వ్యవహరించకూడదనేది నా ఉద్దేశం. ‘‘వారూ అందరు పిల్లల్లాంటివారే. అల్లరి చేస్తారు. ఆటలు ఆడతారు. కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉత్సాహపడతారు. వారికీ ఇష్టాయిష్టాలుంటాయి. ఇవేవీ పట్టించుకోకుండా... వారు కుంగిపోయేలా ప్రవర్తించకూడదు’’ అని నేను చాలా సందర్భాల్లో స్కూల్‌ నిర్వాహకులకు చెప్పాను. కానీ పట్టించుకోలేదు. ఆ ధోరణి భరించలేక... రాజీనామా చేశాను. తరువాత ఒక రోజు ఆ స్కూల్‌ విద్యార్థి నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. అతను చదువుతున్నది తొమ్మిదోతరగతి. కానీ వయసు పద్ధెనిమిదేళ్ళు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం... అతను వయోజనుడయ్యాడు కాబట్టి బ్లయిండ్‌ స్కూల్‌లో అతను ఉండడం కుదరదు. అతని చదువు, వసతి, భోజన ఖర్చులను అతనే సంపాదించుకోవాలి. అందుకని అతణ్ణి స్కూల్‌లోంచి బయటకు పంపేశారు. అతణ్ణి తల్లితండ్రులు ఎప్పుడో వదిలేశారు. ఎక్కడికి వెళ్ళాలో తెలియక... మూడు వారాలపాటు సరైన తిండి లేకుండా రోడ్ల మీద తిరిగాడు. చివరకు మా ఇంటికి వచ్చాడు. ఆ పిల్లవాడికి ఆశ్రయం కల్పించి, అతని చదువుకు సాయం చేశాను. ఎంతో కష్టపడి చదివిన అతను పదోతరగతిలో నూరుశాతం మార్కులు తెచ్చుకునప్పుడు... తీవ్రమైన ఉద్వేగానికి గురయ్యాను. మానవీయత కరువైన విధానాల వల్ల ఇలాంటి ఎందరో పిల్లల జీవితాలు నాశనమైపోతున్నాయనే ఆవేదన కలిగింది. సమాజం వారికి సాయం చెయ్యడానికి ముందుకురాదు. ఆర్థిక స్థోమత లేని కుటుంబాలు వారిని భారంగా చూస్తాయి. ఈ పరిస్థితిలో... ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురుచూడడం కన్నా... నేనే వారికో దారి చూపాలనుకున్నాను. 1996లో... ‘నివంత్‌ అంధ్‌ ముక్త వికాసాలయ్‌’ పేరుతో ఒక సంస్థను ప్రారంభించాను.


ఆ నమ్మకం ఉంది...

ఇరవై తొమ్మిది ఏళ్ళ క్రితం... ఒకే ఒక విద్యార్థితో మొదలైన మా ‘నివంత్‌’ ఇప్పుడు విద్య, జీవన నైపుణ్యాలను నేర్పిస్తూ, భావోద్వేగమైన మద్దతును అందించే కేంద్రంగా అభివృద్ధి చెందింది. అప్పట్లో మాకు వనరులు, నిధులు తక్కువగా ఉండేవి. బ్రెయిలీ వచ్చిన విద్యార్థులు తక్కువ. బ్రెయిలీలో పుస్తకాలను చేతుల్తో రాసుకోవలసి వచ్చేది. అలా దాదాపు 300కు పైగా పుస్తకాలను మా విద్యార్థులు ఎంతో శ్రమ పడి రాశారు. 2007లో బ్రెయిలీ ప్రింటర్‌ సమకూర్చుకోవడంతో.. ఈ పని సులభం అయింది. ఆ తరువాత ‘విజన్‌ అన్‌లిమిటెడ్‌’ అనే లైబ్రరీని ఏర్పాటు చేశాం. మూడువేలకు పైగా పుస్తకాలు అందులో ఉన్నాయి. రోటరీ క్లబ్‌ లాంటి సంస్థల సహాయంతో.... పాఠ్య, పాఠ్యేతర అంశాలతో మేము ఏడాదికి లక్షన్నర పేజీలకు పైగా బ్రెయిలీ పుస్తకాలను ముద్రిస్తున్నాం. మహారాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు కేంద్రాల్లో ఈ లైబ్రరీ అంధులకు సేవలు అందిస్తోంది. మా సంస్థలో ఇప్పటివరకూ 3,500 మందికి పైగా అంధ బాలలు ఆశ్రయం పొందారు. అందరూ స్వతంత్రంగా జీవించే నైపుణ్యాలను సాధించారు. ఈ ప్రయత్నంలో. నా భర్త, కుమార్తె కూడా నాకు పూర్తి మద్దతుగా నిలుస్తున్నారు. వారి సహకారంతోనే ‘స్వలేఖన్‌ టైపింగ్‌ ట్యూటర్‌’ అనే యాప్‌ను ఆరేళ్ళ కిందట ఆవిష్కరించాం. అనేక భాషల్లో టైపింగ్‌ను నేర్పే ఈ యాప్‌ ద్వారా... అంధులైన విద్యార్థులు ఎవరి సాయం లేకుండా పరీక్షలు రాయవచ్చు. పుణేలో కొన్ని అంధ బాలల పాఠశాలల్లో పిల్లలకు ఈ యాప్‌ వినియోగంలో శిక్షణ ఇస్తున్నాం. 2,000 మందికి పైగా పిల్లలు దీన్ని ఉపయోగిస్తున్నారు. అలాగే... మేము సొంతంగా ‘టెక్‌ విజన్‌’ అనే సాఫ్ట్‌వేర్‌ను రూపొందించుకున్నాం. దీనిలో వ్యాపార అవకాశాలు ఉన్నాయనే విషయం గ్రహించి... ఇరవైమంది అంధ విద్యార్థుల బృందంతో ఒక కంపెనీని ఏర్పాటు చేశాం. ఇప్పుడు ఈ కంపెనీ ద్వారా ఏడాదికి నాలుగైదు కోట్ల రూపాయల లాభం వస్తోంది. అలాగే మా విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తోంది. వెనక్కి తిరిగి చూసుకుంటే ఎంతో సంతృప్తిగా అనిపిస్తోంది. ఇంకా చేయాల్సింది ఎంతో ఉందని నాకు తెలుసు. కానీ నా తరువాత ఈ బాధ్యతను మా విద్యార్థులు ఇంకా సమర్థవంతంగా నిర్వర్తిస్తారనే నమ్మకం నాకుంది.’’


మరిన్ని వార్తల కోసం..

PM Modi: ఎవర్నీ వదిలిపెట్టలేదు.. ఆటాడుకున్న పీఎం

Maha Kumbh Mela 2025: కుంభమేళాకు ప్రధాని మోదీ.. పవిత్ర స్నానంతోపాటు ప్రత్యేక పూజలు

Delhi Elections: ఎన్నికలకు సిద్ధం.. 35,000 మంది పోలీసులు, సీసీ టీవీ నిఘా..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 05 , 2025 | 11:39 PM