Share News

Kalluri Madhubala Midhani Finance Director: అంచెలంచెలుగా ఎదిగి

ABN , Publish Date - Sep 10 , 2025 | 12:28 AM

భారత రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని మిశ్రధాతు నిగమ్‌ లిమిటెడ్‌ (మిధానీ) చరిత్రలో డైరెక్టర్‌ (ఫైనాన్స్‌)గా ఒక మహిళ ఎంపిక కావడం తొలిసారి కాగా... ఆమె తెలుగు మహిళ కావడం మరింత విశేషం....

Kalluri Madhubala Midhani Finance Director: అంచెలంచెలుగా ఎదిగి

భారత రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని మిశ్రధాతు నిగమ్‌ లిమిటెడ్‌ (మిధానీ) చరిత్రలో డైరెక్టర్‌ (ఫైనాన్స్‌)గా ఒక మహిళ ఎంపిక కావడం తొలిసారి కాగా... ఆమె తెలుగు మహిళ కావడం మరింత విశేషం. ఎనిమిది ప్రభుత్వ రంగ సంస్థల నిపుణులతో పోటీ పడి ఆ స్థాయికి చేరిన మధుబాల కల్లూరి 32 ఏళ్లుగా మిధానీలో అంచలంచెలుగా ఎదిగారు. తన ఉద్యోగ ప్రయాణం గురించి, విద్య, వైద్యపరంగా తను నిర్వహిస్తున్న సేవల గురించి ‘నవ్య’తో ఆమె ప్రత్యేకంగా పంచుకున్నారు.

‘‘మాది విజయవాడ. మా నాన్న అన్నే వెంకట్రావు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో గెజిటెడ్‌ ఆఫీసర్‌. పంచాయత్‌రాజ్‌ శాఖలో పనిచేశారు. అమ్మ సూర్యకుమారి గృహిణి. అప్పుడు ఉన్న పరిమిత వనరులతోనే వారు మాకు చదువు మీద శ్రద్ధ కలిగేలా చేశారు. మేము ముగ్గురం సోదరీమణులం. మా అక్క ఇస్రోలో సైంటిస్ట్‌ ‘జి’గా పనిచేస్తుంటారు. ఇప్పటికీ ఆమె మాకు స్ఫూర్తి. మరో అక్క ఎంపీడీఓగా కంకిపాడులో చేస్తున్నారు.

ఆడపిల్లకు చదువెందుకని అనుకోలేదు...

చాలామంది అంటుండేవారు... ఆడపిల్లలకు చదువులెందుకని! కానీ, మా నాన్న అవేవీ పట్టించుకోలేదు. ఆయన చదువుకు ప్రాధాన్యం ఇవ్వడంతో మేము తొలి నుంచి చదువులో ముందుండేవాళ్లం. ఆరవ తరగతిలో ఉన్నప్పుడు విజయవాడ నుంచి మచిలీపట్టణానికి నన్ను అమ్మానాన్నా ఒంటరిగా పంపేవారు. నాన్న ఆంగ్ల పత్రిక ఒకటి తీసుకువచ్చి చదవమనేవారు. పాఠశాల విద్యాభ్యాసం అంతా విజయవాడ చుట్టుపక్కలనే జరిగింది. కామర్స్‌లో డిగ్రీ మాత్రం నాగార్జున విశ్వవిద్యాలయంలో, పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ఆంధ్రా యూనివర్శిటీలో చేశా. అనంతరం ఐసీడబ్ల్యుఏఐ, సీఎంఏ కూడా చేశాను. మా అక్కలా నేనూ సైన్స్‌ చదవాలనుకున్నాను. అయితే... నాన్న ఉద్యోగరీత్యా వేరే ప్రాంతా ల్లో ఉండడంతో... నేను హాస్టల్‌లో చేరాల్సి వచ్చింది. అక్కడ కాలేజీలో కామర్స్‌ బాగా బోధిస్తారని ఆ కోర్సులో చేరాను. డిగ్రీ అయ్యాక సీఏ చేయాలనుకున్నాను. అప్పుడు ‘‘ఐసీడబ్ల్యుఏఐ అయితే త్వరగా అయిపోతుంది. ఉద్యోగంలో చేరవచ్చు. మీ ప్రాంతంలో ఆడపిల్లలకు త్వరగా వివాహం చేస్తారు కదా... సీఏ అయితే మధ్యలో చదువు ఆగిపోయే ప్రమాదం ఉంది’’ అని విజయవాడలో మోడ్రన్‌ అకాడమీ ప్రిన్సిపాల్‌ పాపారావు సూచించారు. అలా ఐసీడబ్ల్యుఏఐలో చేరాను. ఆయన సలహాకు ఎప్పుడూ రుణపడి ఉంటాను.


అదే విజేతగా నిలిపింది...

ఐసీడబ్ల్యుఏఐ పూర్తయ్యాక... బెంగళూరులో రెండేళ్లపాటు ఒక కంపెనీలో మేనేజిమెంట్‌ ట్రైనీగా పని చేశాను. ఆ తరువాత 1993లో మిధానీలో చేరాను. వచ్చే డిసెంబర్‌కు మిధానీతో నా అనుబంధం 32 ఏళ్లు పూర్తిచేసుకోబోతోంది. పలు ప్రభుత్వ రంగ సంస్థల్లో అవకాశం వచ్చినా... హైదరాబాద్‌లో స్థిరపడాలనే ఉద్దేశంతో ఇక్కడే ఉండిపోయాను. ఇక్కడ అకౌంట్స్‌ ఆఫీసర్‌గా నా ప్రయాణం మొదలయింది. మాది చిన్న సంస్థ కావడం వల్ల నేను పెద్దగా ఇబ్బందులు ఎదుర్కోలేదు. అన్ని విభాగాల్లో ఏం జరుగుతోందో తెలుసుకోవడానికి, పలు అంశాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం కలిగింది. ఫైనాన్స్‌ విభాగంలో వివిధ హోదాల్లో పనిచేశాను. కాస్టింగ్‌, అకౌంట్స్‌, ఆడిట్‌, పేమెంట్స్‌. ట్యాక్సేషన్‌, ప్రాజెక్ట్స్‌ లాంటి విభాగాల్లో పనిచేయడం కెరీర్‌లో ఎదిగేందుకు ఎంతగానో తోడ్పడింది. ఈ ఏడాది జూలై 21న ఫైనాన్స్‌ డైరెక్టర్‌గా బాధ్యతలను చేపట్టాను. ఈ పోస్ట్‌ కోసం ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ఎనిమిది మంది ఫైనాన్స్‌ నిపుణులతో పోటీ పడ్డాను. అయితే... మిధానీలో ఫైనాన్స్‌పరంగా అన్ని విభాగాల్లో నాకు పట్టు ఉండడం, ప్రభుత్వ రంగ ఆర్థిక పరిపాలనపై నాకున్న రికార్డు ఈ రేసులో నన్ను విజేతగా నిలిపిందని భావిస్తున్నాను. సంస్థకు, ఉద్యోగులకు అవసరమైన విధానాల రూపకల్పనలో నేను కీలక పాత్ర పోషించాను. మిధానీలో ప్రతి అంశం నాకు తెలుసు. ఆ అనుభవం, ప్రతి అంశాన్నీ విశ్లేషణాత్మకంగా చూసే అలవాటు... ఇవి ఇంటర్వ్యూలో బాగా ఉపయోగపడ్డాయి.

మహిళా ఉద్యోగులు పెరగడానికి దోహదం చేశా...

నేను పదేళ్ల నుంచి ఫైనాన్స్‌ విభాగం అధిపతిగా పని చేస్తున్నాను. నేను చేరినప్పుడు ఇక్కడ మహిళా ఉద్యోగుల సంఖ్య వేళ్ల మీద లెక్కించగలిగేలా ఉండేది. ఇప్పుడు మిధానీలో 10 శాతం మంది ఉద్యోగులు మహిళలు. వారిలో 30 మంది అధికారులు. వర్క్‌మెన్‌ క్యాడర్‌లో మహిళలు ఉన్నారు. ఫర్నేస్‌ దగ్గర కూడా పని చేస్తున్నారు. ఇక్కడ ఎలాంటి వివక్షా లేదు. 2011 నుంచి స్వతంత్ర డైరెక్టర్లలోనూ మహిళలు ఉన్నారు. ప్రస్తుతం కూడా బోర్డులో సగం మంది.. అంటే ముగ్గురు మహిళా డైరెక్టర్లే. వారిలో నేనొకరిని కాగా... ఇద్దరు స్వతంత్ర డైరెక్టర్లు. ఇక మా ఉద్యోగుల్లో, కనీసం మా విభాగంలో మహిళల నియామకంలో, వారి శాతం పెరగడంలో నా పాత్ర ఉందని చెప్పగలను. అయితే మహిళ అని కాకుండా... వారి పనితీరు, అర్హతల ఆధారంగానే నియమిస్తాం. శ్రద్ధ, అంకితభావం ఎవరికైనా ముఖ్యం. మన పనితీరే మన గురించి చెప్పే ప్రమాణం అవుతుంది. మహిళలకు కూడా ఇదే వర్తిస్తుంది.


ఆనందకరమైన బాధ్యత...

ఫైనాన్స్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే బీపీడీఏవి స్కూల్‌ ఛైర్మన్‌గానూ వ్యవహరిస్తున్నాను. మిధానీ, బీడీఎల్‌ సంయుక్తంగా ఈ స్కూల్‌ నిర్వహిస్తున్నాయి. ఇది ప్రాజెక్ట్‌ స్కూల్‌. మిధానీలో అన్ని విభాగాలకు ఇది అదనపు బాధ్యత. అందరూ స్వచ్ఛందంగానే తోడ్పాటు అందిస్తారు. ఈ స్కూల్‌లో దాదాపు 2,100 మంది పిల్లలున్నారు. పాఠశాలకు సంబంధించి మౌలిక సదుపాయాలు, రోజువారీ సమస్యల గురించి సమావేశాలు జరుపుతాం. సమస్యలుంటే పరిష్కరిస్తుంటాం. మిధానీ ప్రైమరీ హెల్త్‌ కేర్‌ సెంటర్‌కు చైర్మన్‌గా మూడున్నర సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నాను. సమాజానికి కొంత మేర సహాయం చేసేందుకు ఇది తోడ్పడుతుంది. ఇక్కడ 10 రూపాయలతో రిజిస్టర్‌ చేసుకుంటే సరిపోతుంది. చికిత్స కార్పొరేట్‌ హాస్పిటల్‌ స్థాయిలో ఉంటుంది. సేవలు కూడా అతి తక్కువ ఖర్చుతో అందిస్తుంటాం. ఇది నాకు అదనపు బాధ్యతే కానీ... ఆనందకరమైన బాధ్యత. ఇవి కాకుండా పలు సీఎ్‌సఆర్‌ కార్యక్రమాలను పర్యవేక్షిస్తాను.

వారి తోడ్పాటు అపూర్వం...

నేను ఇక్కడివరకూ వచ్చానంటే మా అమ్మనాన్నలతో పాటుగా అత్తమామలు కల్లూరి సుబ్బారావు, సుశీల సహాయ సహకారాలే కారణం. నేను ఉద్యోగంలో చేరిన కొత్తలో మా అబ్బాయి ఆలనాపాలనా మా అత్తగారు చూసుకునేవారు. ఆమె మరణించాక మా మామగారి బాధ్యతను చూసుకున్నాను. మావారు, రవికిశోర్‌ కూడా నా ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడుతున్నారు. ఆయనకు ఎంతో విశ్లేషణా శక్తి ఉంది. అందుకే ఆయన సూచనలను తప్పకుండా పాటిస్తాను. నాకు ఖాళీ సమయం దొరకడం అరుదే. కాస్త సమయం చిక్కితే చారిటీకి సమయం కేటాయిస్తుంటాను. ఆదివారాలు కచ్చితంగా గార్డెనింగ్‌లో కొంత సమయం గడపడానికి ప్రయత్నిస్తాను. మొక్కల్ని చూస్తే అన్నీ మరచిపోతాను. ఒత్తిడి తగ్గించుకొని, ఆనందం పొందుతాను.’’

పులగం గిరి


కష్టే ఫలి...

సీఏ, సీఎంఏ లాంటి కోర్సులు చేస్తున్న చాలామంది మధ్యలో ఆపేస్తున్నారు. ఆ కోర్సు పూర్తి చేయండి. 2, 3 ఏళ్లు కష్టపడితే మంచి ఉద్యోగం దొరుకుతుంది’’ అని నేను చెబుతాను. మహిళా ఉద్యోగులు ఇంటిని, ఆఫీసును బ్యాలెన్స్‌ చేసుకోవడం కోసం సమయాన్ని షెడ్యూల్‌ చేసుకోవాలి. ఇది తెలియని వారికి మేము కౌన్సెలింగ్‌ ఇస్తుంటాం. పరిష్కారాలు సూచిస్తూ ఉంటాం. అయితే కుటుంబ సభ్యుల సహకారం లేకుండా ఏదీ సాధ్యం కాదు. ఇక... అత్తమామలతో ఎలా వ్యవహరించాలో తల్లిదండ్రులు పిల్లలకు నేర్పాలి. అది లేకనే సమస్యలు వస్తున్నాయనేది నా భావన. కాగా... ఈ తరానికి పెద్ద సమస్య... చదివే అలవాటు లేకపోవడం. దీనివల్ల సబ్టెక్ట్‌ అప్‌డేట్‌ కావడం లేదు. తాజా సమాచారం ఎప్పుటికప్పుడు తెలుసుకుంటే మనల్ని అధిగమించేవారు ఉండరు. కాబట్టి నిత్యం అధ్యయనం చేస్తూనే ఉండాలి.

ఈ వార్తలు కూడా చదవండి..

యూరియాపై వైసీపీది అసత్య ప్రచారం.. మంత్రి సుభాష్ ఫైర్

ఆ ఐపీఎస్‌లకు మళ్లీ షాక్ ఇచ్చిన ప్రభుత్వం

For More AP News And Telugu News

Updated Date - Sep 10 , 2025 | 12:28 AM