Hyderabad: బాలికలు.. భవితకు వారధులు
ABN , Publish Date - Oct 11 , 2025 | 11:10 AM
దేశ భవిష్యత్తుకు, వర్తమానానికి వారధులు బాలికలు. అసమానతలు, ఆంక్షలు, వివక్షను అధిగమించి మానవీయ సమాజ నిర్మాతలుగా ఎంతోమంది అమ్మాయిలు ముందుకొస్తున్నారు. సమస్యల మీద గళమెత్తుతున్నారు. సమానత్వం కోసం సమరభేరి మోగిస్తున్నారు.
- నేడు అంతర్జాతీయ బాలికా దినోత్సవం
దేశ భవిష్యత్తుకు, వర్తమానానికి వారధులు బాలికలు. అసమానతలు, ఆంక్షలు, వివక్షను అధిగమించి మానవీయ సమాజ నిర్మాతలుగా ఎంతోమంది అమ్మాయిలు ముందుకొస్తున్నారు. సమస్యల మీద గళమెత్తుతున్నారు. సమానత్వం కోసం సమరభేరి మోగిస్తున్నారు. నేడు అంతర్జాతీయ బాలికా దినోత్సవం. ఈ సందర్భంగా సామాజిక మార్పు లక్ష్యంతో వినూత్న కార్యక్రమాలకు నాయకత్వం వహిస్తోన్న నలుగురు బాలికలు.. మన భాగ్యనగర బంగారు తల్లుల స్ఫూర్తి గాథల పరిచయం.!
- హైదరాబాద్ సిటీ, ఆంధ్రజ్యోతి

బడి పిల్లల కోసం బస్సును రప్పించింది
మనం అనుభవించిన బాధలు మరొకరు పడకూడదని అనుకుంటారు చాలామంది. అయితే తోటి వారికి అండగా నిలిచేవారు అతికొద్దిమంది మాత్రమే. అలాంటి అరుదైన వ్యక్తుల్లో ఒకరు పహాడిషరీ్‌ఫకు చెందిన వినీత. ఈ అమ్మాయి తండ్రి దినసరికూలీ. పేదరికం వల్ల తానూ మొదట బడికి దూరమైంది. ఎమ్.వీ ఫౌండేషన్ సహాయంతో తిరిగి చదువు కొనసాగించింది. ఇప్పుడు డిగ్రీ చదువుతున్నది. తన ఇంటి చుట్టుపక్కల చాలామంది పిల్లలు అర్ధాంతరంగా చదువు మానేసి, పనులకు వెళుతున్న విషయం గుర్తించింది.
అందుకు కారణం స్కూలుకు బస్సు సౌకర్యం లేకపోవడమేనని తెలుసుకుంది. బస్సు సౌకర్యం కల్పించాలని విద్యాశాఖ మంత్రి, అప్పటి ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌తో పాటు డిపో మేనేజర్లకు వినపతిపత్రం ఇచ్చింది. వారంతా సానుకూలంగా స్పందించి చార్మినార్, మిధాని నుంచి మామిడిపల్లికి రెండు బస్సులు వేశారు. తెలంగాణ ఎంవీఎఫ్ వలంటీర్ సువర్ణ సహకారంతో బస్తీలోని అమ్మాయిలతో తరచుగా సమావేశాలు పెడుతూ వారి సాధకబాధకాలు తెలుసుకుంటోంది. ఈ మధ్యనే తొమ్మిదో తరగతి అమ్మాయి వివాహాన్ని సైతం నిలిపివేయించింది. తోటి అమ్మాయిల అభ్యున్నతి కోసం పాటుపడడంలోనే తనకు సంతోషం ఉందని చెబుతోంది.
- వినీత, పహాడిషరీఫ్
ఛేంజ్ మేకర్ ‘జయలక్ష్మి’
‘అంబేడ్కర్ రచనల స్ఫూర్తితో చదువు విలువ తెలుసుకున్నాను. నా లాంటి పేద అమ్మాయిలు జీవితంలో మరో మెట్టు పైకి ఎక్కాలంటే చదువు ఒక్కటే ఆయుధమని గుర్తించాను అని అంటోంది నగరానికి చెందిన అరిపిన జయలక్ష్మి(Jayalaxmi). ఈమె బ్రిటీషు డిప్యూటీ హై కమిషనర్ హోదాలో ఒకరోజు బాధ్యతలు కూడా నిర్వర్తించారు. అందుకు గట్టిపోటీనే ఎదుర్కొని గెలిచి నిలిచారు. బ్రిటీషు హైకమిషనర్‌ను తాను నివసించే పిల్లిగుడిసెల బస్తీకి రప్పించింది.
అమ్మాయి అమ్మానాన్న ఇంటింటికి తిరిగి చెత్తసేకరించే పారిశుధ్య శ్రామికులు. వారికి చేదోడువాదోడుగా ఉంటూనే ఆమె చదువుకున్నారు. మౌంట్‌ఫోర్డ్ సోషల్ ఇనిస్టిట్యూట్ చిల్డ్రన్స్ పార్లమెంటులో రెండుసార్లు ప్రధానిగా వ్యవహరించారు. బస్తీలో అంగన్వాడీ కేంద్రాల ఏర్పాటుకు కృషి చేశారు. ‘ఛేంజ్‌మేకర్’ జాతీయ స్థాయి అవార్డును ఆమె అందుకున్నారు. సివిల్స్‌లో మంచి ర్యాంకు సాధించాలి. ఒక అధికారిణిగా సమాజానికి తన వంతు సేవలు అందించాలి. సామాజిక మార్పులో భాగంకావాలన్నదే తన ముందున్న కర్తవ్యమని చెబుతున్నారు జయలక్ష్మి.
పుస్తక యజ్ఞంతో ‘ఆకర్ష’ణ
కొన్నిసార్లు ముఖ్యమంత్రులు కలవడానికే ప్రధాని సమయం ఇవ్వరు. అలాంటిది హైదరాబాద్(Hyderabad)కు చెందిన ఓ పాఠశాల విద్యార్థినితో మూడుసార్లు ప్రత్యక్షంగా మోదీ సంభాషించారంటే మాటలా. అమ్మాయి పేరు ఆకర్షణ సతీష్. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న ఈ చిన్నారికి ప్రధానమంత్రి 8లక్షలకు పైగా పుస్తకాలు నేషనల్ బుక్‌ట్రస్ట్ ద్వారా పంపించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సైతం రెండుసార్లు రాష్ట్రపతి నిలయానికి ఆహ్వానించారు.
చిన్నవయసులోనే ఇంతమంది పెద్దల మన్ననలు అందుకున్న చిన్నారి ఆకర్షణ నాలుగేళ్లు కాలంలో 16,375పుస్తకాలతో 24 గ్రంథాలయాలు ఏర్పాటు చేశారు. వంద లైబ్రరీల ఏర్పాటే తన లక్ష్యం అని చిన్నారి చెబుతుంది. ‘ఇప్పుడు తన వద్ద 11వేలకుపైగా పుస్తకాలున్నాయని, మెట్రోస్టేషన్ లేదా ఏదైనా ప్రభుత్వ పాఠశాలలో మరో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నాను. ఈ 25వ గ్రంథాలయాన్ని ప్రారంభిస్తానని ప్రధాని మోదీ మాట ఇచ్చారు..’ అని చెబుతోంది. పాఠశాలలోనూ రీడింగ్‌కు ఒక పీరియడ్ కేటాయించాలని అంటోంది ఆకర్షణ సతీష్.
ఈ వార్తలు కూడా చదవండి..
స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
భద్రాద్రి రామయ్య సేవలో 225 జంటలు
Read Latest Telangana News and National News