Etukoori Krishnamurthy: రహస్యంగా పత్రికలు బట్వాడా చేశా
ABN , Publish Date - Aug 14 , 2025 | 12:44 AM
‘‘సామాజిక మార్పును కోరే కమ్యూనిస్టులే కలసి పని చేయలేకపోతున్నారు. ఇక సామాన్యులు ఐకమత్యంతో ఉండాలని కోరుకోవడం అత్యాశ అవుతుందేమో. గుంటూరు టౌన్ హైస్కూల్లో ఎస్‌ఎల్‌సీ చదువుతున్న రోజుల్లో ‘క్విట్ ఇండియా’ ఉద్యమానికి...
‘‘సామాజిక మార్పును కోరే కమ్యూనిస్టులే కలసి పని చేయలేకపోతున్నారు. ఇక సామాన్యులు ఐకమత్యంతో ఉండాలని కోరుకోవడం అత్యాశ అవుతుందేమో. గుంటూరు టౌన్ హైస్కూల్లో ఎస్‌ఎల్‌సీ చదువుతున్న రోజుల్లో ‘క్విట్ ఇండియా’ ఉద్యమానికి మద్దతుగా మేము నిరసన సభ నిర్వహించాం. కొందరు స్నేహితులం కలసి లాలాపేట పోలీస్ స్టేషన్‌మీద జాతీయ జెండా ఎగరేశాం. దాంతో పోలీసులు మమ్మల్ని అరెస్టు చేసి గుంటూరు సబ్ జైలులో నిర్బంధించారు.
మాకు సంఘీభావంగా స్థానికులు పెద్ద సంఖ్యలో పరామర్శకు వస్తుండడంతో... మమ్మల్ని బాపట్ల, మంగళగిరి... అలా రకరకాల ప్రదేశాలు తిప్పారు. మేము నాలుగు నెలలకు పైగా జైలు జీవితం గడిపాం. దేశభక్త కొండా వెంకటప్పయ్య గారి మనుమలు నాకు మంచి స్నేహితులు. వారి ఇంటికి తరచుగా వెళ్లేవాణ్ణి. మరోవైపు ఉన్నవ లక్ష్మీనారాయణ పంతులు లాంటి నాయకులను కలిసేవాణ్ణి.
ఆర్మీలో తిరుగుబాటు...
మా బాబాయి ఏటుకూరి జోగిరాజు సైమన్ కమిషన్ వ్యతిరేక పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు. ఆయన స్ఫూర్తితోనే నేనూ జాతీయోద్యమంలోకి వెళ్లాను. విజయవాడ నుంచి భారత కమ్యూనిస్టు పార్టీ ‘స్వతంత్ర భారత్’ పత్రిక ప్రచురించేది. ఆ పత్రికను గుంటూరులోని జాతీయోద్యమ నాయకులకు పంచే బాధ్యత నాది. అలా రహస్యంగా చాలాకాలం ఆ పత్రికల్ని బట్వాడా చేశాను. కొన్నాళ్లకు ‘బ్రిటిష్ - ఇండియా ఆర్మీ’లో చేరాను. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా రాయల్ ఇండియన్ నేవీ సైనికులు తిరుగుబాటు ప్రారంభించారు. వారికి మద్దతుగా నేనూ నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నాను. మమ్మల్ని అరెస్టు చేసి, లాహోర్ జైల్‌లో కొన్నాళ్లు నిర్బంధించారు. దేశానికి స్వాతంత్య్రం ప్రకటించిన తర్వాత మమ్మల్ని విడుదల చేశారు. ఆ వెంటనే ఆంధ్రా రెవెన్యూ శాఖలో ఉద్యోగిగా కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో చేరాను. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులకు నావంతుగా సహకారం అందించాను. ప్రస్తుతం స్వాతంత్య్ర సమరయోధుల సంఘానికి ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నాను. రోజూ దినపత్రికలే నా కాలక్షేపం.’’
ఏటుకూరి కృష్ణమూర్తి, 104 ఏళ్లు
సాంత్వన్
ఫొటోలు: హరిప్రేమ్
ఈ వార్తలు కూడా చదవండి..
బీసీ గర్జన సభను మరోసారి వాయిదా వేసిన బీఆర్ఎస్
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. సీఎం చంద్రబాబు కీలక సూచనలు
Read Latest Telangana News And Telugu News