స్వతంత్రంగా ఎదగనివ్వాలి
ABN , Publish Date - Jun 18 , 2025 | 01:55 AM
తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రేమతో అపురూపంగా పెంచాలని అనుకుంటారు. పిల్లలకు సంబంధించిన ప్రతి పనినీ దగ్గరుండి చేస్తూ వాళ్లకి ఏ కష్టమూ కలగకూడదని తాపత్రయపడుతూ...

పేరెంటింగ్
తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రేమతో అపురూపంగా పెంచాలని అనుకుంటారు. పిల్లలకు సంబంధించిన ప్రతి పనినీ దగ్గరుండి చేస్తూ వాళ్లకి ఏ కష్టమూ కలగకూడదని తాపత్రయపడుతూ ఉంటారు. ఈ ధోరణి వల్ల పిల్లలు స్వతంత్రంగా ఏ పనీ చేయలేక పోతున్నారు. అలాకాకుండా పిల్లలకు చిన్నప్పటినుంచే సొంత పనులు చేసుకోవడంతోపాటు ఇతర పనులూ చేయడం నేర్పించాలని నిపుణులు సూచిస్తున్నారు..
పిల్లలకు ఉదయాన్నే నిద్ర లేవడం అలవాటు చేయాలి. కొంచెం పెద్ద పిల్లలు అయితే దుప్పట్లు మడతపెట్టడం, పక్క సర్దడం లాంటివి చేయమని చెప్పవచ్చు. నిద్ర లేవగానే పళ్లు తోముకోవడం, మంచినీళ్లు తాగడం, కాలకృత్యాలు తీర్చుకోవడం, స్నానం చేయడం, యూనిఫామ్ లేదా బట్టలు వేసుకోవడం, షూ లేసులు కట్టుకోవడం లాంటి వాటిని దగ్గరుండి నేర్పించాలి.
బడికి వెళ్లేముందు బ్యాగ్‌లో పుస్తకాలు సర్దుకోవడం, లంచ్ బాక్స్- వాటర్ బాటిల్ పెట్టుకోవడం లాంటి పనులను వాళ్లనే చేసుకోనివ్వాలి. బడి నుంచి ఇంటికి రాగానే లంచ్ బాక్స్‌ను వంటగది సింక్‌లో వేయడం అలవాటు చేయాలి..
సాయంత్రం వేళ కొద్ది సేపు తోటపని చేయడం, పెంపుడు జంతువులను బయటికి తీసుకెళ్లడం, బజారు నుంచి వస్తువులు కొని తీసుకురావడం లాంటి పనులు చేయించాలి.
ఇంట్లో నానమ్మ, తాతయ్య లాంటి పెద్దవారికి సహాయం చేయడం, చిన్నపిల్లలను ఆడించడం నేర్పించాలి. వంటచేసేటప్పుడు చిన్న చిన్న పనులు చెప్పి చేయించాలి.
వారాంతాల్లో ఇల్లు శుభ్రం చేసేటప్పుడు పిల్లల సహాయం అడగాలి. వాళ్లు ఆడుకునే బొమ్మలు, రోజూ వేసుకునే బట్టలు, యూనిఫామ్‌లు, పుస్తకాలను కేటాయించిన అరల్లో చక్కగా ఎలా సర్దాలో చేసి చూపించాలి.
యుక్తవయసు పిల్లలకు వ్యక్తిగత పరిశుభ్రత, వంటచేయడం, బట్టలు ఉతకడం వంటివి నేర్పించాలి. బ్యాంక్ సంబంధిత ఆర్థిక వ్యవహారాలపై కొద్దిపాటి అవగాహన కల్పించాలి. వివిధ రకాల బిల్లులు చెల్లించడం, పొదుపు చేయడం, ప్రథమ చికిత్స పద్ధతుల గురించి తెలియజెప్పాలి.
పిల్లలకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్లు ఏవిధంగా పరిష్కరించుకుంటున్నారో గమనించాలి. అవసరమైతేనే సహాయం చేయాలి. పెద్దలను సలహా అడగడం అలవాటు చేయాలి.
పిల్లలు ఏదైనా పొరబాటు చేస్తే దానినుంచి ఎలా పాఠం నేర్చుకోవాలో సూచించాలి.
గెలిచినప్పుడు పొంగిపోవడం, ఓడినప్పుడు కుంగిపోవడం కాకుండా రెంటినీ సమానంగా స్వీకరించే విధానాన్ని నేర్పించాలి.
ఇవి కూడా చదవండి
సంచలనం.. షర్మిల కాల్స్ రికార్డ్.. అన్నకు సమాచారం
మా అమ్మ, బిడ్డలు ఏడుస్తున్నా పట్టించుకోలేదు.. శిరీష ఆవేదన
Read Latest AP News And Telugu News