Share News

కుప్పడం చీరలకు కొత్త గుర్తింపు

ABN , Publish Date - Jun 19 , 2025 | 02:13 AM

కుప్పడం చీరలు.. చాలా మందికి ఇంకా తెలియని అద్భుతమైన నేత చీరలు. తాజాగా ఈ చీరలకు ‘ఒక జిల్లా - ఒక ఉత్పతి’్త (ఓడీఓపీ) కార్యక్రమంలో భాగంగా జాతీయ అవార్డు లభించింది. దీనిని...

కుప్పడం చీరలకు కొత్త గుర్తింపు

విభిన్నం

కుప్పడం చీరలు.. చాలా మందికి ఇంకా తెలియని అద్భుతమైన నేత చీరలు. తాజాగా ఈ చీరలకు ‘ఒక జిల్లా - ఒక ఉత్పతి’్త (ఓడీఓపీ) కార్యక్రమంలో భాగంగా జాతీయ అవార్డు లభించింది. దీనిని వచ్చే నెల 14వ తేదీన ఢిల్లీలో అందిస్తారు..

బాపట్ల జిల్లాలోని చీరాలకు జాతీయోద్యమంలో ఒక ప్రత్యేకత ఉంది. స్వదేశీ ఉద్యమంలో భాగంగా మహ్మాతాగాంధీకి మద్దతుగా ఈ ప్రాంత ప్రజలు విదేశీ గుడ్డలను బహిష్కరించారు. వేల సంఖ్యలో నేత కార్మికులు గుడ్డలను నేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఆ రోజుల్లో దీనిని చాలా మంది ఒక అరుదైన సంఘటనగా అభివర్ణించేవారు. ఆ సమయంలో ప్రారంభమయిన నేత ఉద్యమం కొనసాగుతూ వచ్చింది. స్వాతంత్య్రం వచ్చిన చాలా కాలం తర్వాత కూడా చీరాలకు చెందిన నేతకు.. ముఖ్యంగా కుప్పాడం చీరలకు మంచి ఆదరణ లభించింది. కానీ ఆధునిక కాలంలో నేత వస్త్రాలకు ఆదరణ తగ్గటంతో కుప్పాడం చీరలను నేసేవారి సంఖ్య కూడా తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం చీరాల ప్రాంతంలో ఐదువేల నేత మగ్గాలు ఉంటే- కేవలం రెండు వేల మగ్గాలపై మాత్రమే చీరలను నేస్తున్నారు. తాజాగా వచ్చిన జాతీయ అవార్డు వల్ల దేశవ్యాప్తంగా ఈ చీరలకు ఆదరణ పెరుగుతుందని.. ఎక్కువ మంది కొనుగోలు చేస్తారని స్థానిక చేనేత కార్మికులు ఆశిస్తున్నారు.


ప్రత్యేకతలివే...

చీరకు అంచు ఒక ప్రత్యేకతను ఇస్తుంది. ఈ అంచు ఎంత భిన్నంగా ఉంటే- చీర అంత అందంగా తయారవుతుంది. సాధారణంగా దేశంలో వివిధ ప్రాంతాల్లో నేసే నేత చీరల అంచు ఐదు అంగుళాలకు మించదు. కానీ కుప్పాడం చీరల అంచు మాత్రం 18 అంగుళాలు ఉంటుంది. ‘‘చీర అంచే కుప్పడం ప్రత్యేకత. ఈ అంచులో నేసే డిజైన్లు మిగిలిన చేనేతలకు భిన్నంగా ఉంటాయి. నేతలోనే ఈ అంచు కూడా తయారవుతుంది. ఈ అంచులను తయారుచేయటానికి ప్రత్యేకమైన నాడులు.. అచ్చులు ఉంటాయి. ఒక సారి నేసిన తర్వాత చీరలోనే అంచు కలిసిపోతుంది..’’ అంటారు ఈ చీరలను నేసే హెచ్చిన భువనేశ్వరి. ఈ చీరలను నేయటానికి ఎక్కువ సమయం కూడా పడుతుంది. ‘‘రోజుకు ఇద్దరు పనిచేస్తే- ఒక చీర నేయటానికి మూడు నుంచి నాలుగు రోజులు పడుతుంది. అందువల్ల ఖరీదు పెరుగుతుంది. మంచి కుప్పడం సిల్క్‌ చీరను తయారుచేయటానికి ముడి సరుకుతో కలిపి 3 నుంచి 8వేల వరకూ అవుతుంది. పట్టణాలలో పెద్ద పెద్ద దుకాణాలలో వీటిని రెట్టింపు ధరకు అమ్ముతారు’’ అంటారు భువనేశ్వరి.


00-navya.jpg

కాలంతో పరిగెట్టి...

ఈ ఆధునిక యుగంలో ప్రజలు కొత్త కొత్త డిజైన్లను కోరుకుంటున్నారు. ఈ డిజైన్లను అందించలేని చేనేతలకు ఎక్కువ డిమాండ్‌ ఉండటం లేదు. ‘‘కొత్త డిజైన్లు తయారుచేసి మార్కెట్‌లో ప్రవేశపెట్టాలంటే డిమాండ్‌ ఎక్కువగా ఉండాలి. అంతే కాకుండా ఈ కళపై ఆసక్తి ఉండాలి. ఈ ఆసక్తి రావాలంటే యువతీ, యువకులకు మంచి వేతనాలు లభించాలి. ప్రభుత్వం నుంచి బ్యాంకుల నుంచి ప్రోత్సాహం లభించాలి. ప్రస్తుతం కుప్పడం చీరల నేత విషయంలో మేము ఎదుర్కొంటున్న సమస్యలివే..’’ అంటారు మాస్టర్‌ వీవర్‌ సిద్ది బుచ్చేశ్వరరావు. ప్రస్తుతం ఎక్కువ ఆదరణ లేకపోయినా- ప్రతి రోజూ కనీసం రెండు వేల మంది కార్మికులు మగ్గాలపై చీరలను నేస్తున్నారు. ఈ చీరకు లభించిన జాతీయ అవార్డు వల్ల ప్రజలకు ఈ చీరలపై అవగాహన పెరుగుతుందని.. దీని ద్వారా డిమాండ్‌ వస్తుందని చేనేత కార్మికులు ఆశిస్తున్నారు. వీరి ఆశలు ఫలించాలని.. ఈ చీరలకు జాతీయ, అంతర్జాతీయ వ్యాప్తంగా గుర్తింపు రావాలని కోరుకుందాం.

తాళ్లూరి ప్రదీప్‌, చీరాల


విపత్కర పరస్థితుల్లో

వాతావరణం ప్రతికూల సమయాల్లో మగ్గం సాగక చాలా ఇబ్బందులు పడుతుంటాము. ఇటువంటి పరిస్థితులలో ప్రత్యేక భరోసా కల్పించాలి. కూలీల ధరలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. దీంతో ఆకలి కేకలు తప్పడంలేదు. చేనేత కార్మికులకు ప్రభుత్వం భరోసా కల్పించాలి.

భువనేశ్వరి,

చేనేత కార్మికురాలు

ఈ వార్తలు కూడా చదవండి..

హీరో ఫిన్‌కార్ప్‌ రూ 260 కోట్ల సమీకరణ

మీ పర్సనల్ లోన్ ఇలా తీర్చుకోండి.. మీ ఖర్చులు తగ్గించుకోండి..

For National News And Telugu News

Updated Date - Jun 19 , 2025 | 02:15 AM