Kiran Abbavaram: చిన్న మాట మాట్లాడినా ప్రమాదమే
ABN , Publish Date - Oct 26 , 2025 | 02:50 AM
తెలుగు సినీ పరిశ్రమలో ప్రతిభావంతులైన యువ హీరోల్లో కిరణ్ అబ్బవరం ఒకరు. ఈ మధ్యకాలంలో ఆయన నటించిన ‘కె-ర్యాంప్’ సంచలన విజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో ప్రేక్షకుల నాడిని ఎలా పట్టుకోవాలి...
తెలుగు సినీ పరిశ్రమలో ప్రతిభావంతులైన యువ హీరోల్లో కిరణ్ అబ్బవరం ఒకరు. ఈ మధ్యకాలంలో ఆయన నటించిన ‘కె-ర్యాంప్’ సంచలన విజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో ప్రేక్షకుల నాడిని ఎలా పట్టుకోవాలి? సోషల్ మీడియాలో ఎలాంటి పాత్ర పోషిస్తోందనే విషయాలపై ఆయన ‘నవ్య’కు ఇచ్చిన ఇంటర్వ్యూ.
‘కె-ర్యాంప్’ విజయం మీలో ఎలాంటి మార్పు తీసుకువచ్చింది..
‘కె-ర్యాంప్’ విజయం చాలా ఆత్మవిశ్వాసాన్ని కలగజేసింది. ఈ విజయాన్ని పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నాను. ఈ సినిమాను మొదలుపెట్టినప్పుడే దీపావళికి విడుదల చేయాలనుకున్నాం. ఎందుకంటే పండుగకి ఇంట్లో వాళ్లందరితోను కలిపి సినిమాకు వెళ్లాలనుకుంటారు. పైగా పండుగ అంటే నగరాల నుంచి వేల మంది తమ సొంత ఊళ్లకు వెళ్తారు. అలాంటి వారందరు సరదాగా ఎంజాయ్ చేసే సినిమా తీయాలనుకున్నాం. సినిమాలో సీన్స్ అన్నీ అలాగే డిజైన్ చేశాం. ఆ ప్రయత్నంలో విజయవంతమయ్యామనే అనుకుంటున్నా.
కొన్ని వివాదాలూ ఎదురయ్యాయి కదా...
అవును. పత్రికా సమావేశాల్లో కొన్ని వివాదాస్పదమైన ప్రశ్నలు వేస్తూ ఉంటారు. అవి చాలావరకు సినిమాకు సంబంధం లేనివే అయి ఉంటాయి. అప్పుడప్పుడు ఈ ప్రశ్నలు ఎందుకు తలెత్తుతున్నాయనే ఆలోచనల వస్తుంది. కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఒక పండుగకు నాలుగు సినిమాలు విడుదలయినప్పుడు వాటి మధ్య పోటీ ఉంటుంది. పత్రికా సమావేశాల్లో కూడా ఈ సినిమాలను పోలుస్తూ ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. పొరపాటున మాట్లాడే చిన్న చిన్న మాటలు కూడా వివాదాస్పదమవుతున్నాయి. అందువల్ల చాలా సందర్భాలలో వివాదాస్పదమయిన ప్రశ్నలు అడిగినప్పుడు మౌనంగా ఉండిపోతున్నాను.
మీ స్క్రిప్ట్‌ల ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు
తీసుకుంటున్నారు?
గత ఏడాదిన్నర నుంచి నా ఆలోచన సరళిలో మార్పు వచ్చింది. నాకు అర్ధమయినంత వరకు అందరు ప్రేక్షకులను అలరించే విధంగా సినిమా తీయలేం. ప్రేక్షకులు చాలా స్మార్ట్‌గా ఉంటున్నారు. వారికి నచ్చింది మాత్రమే చూస్తున్నారు. అందువల్ల రకరకాల సినిమాలు చేయాలనుకుంటున్నా. ఉదాహరణకు ‘కె-ర్యాంప్’నే తీసుకుందాం. ఇది ఎంటర్‌టైన్‌మెంట్ జోనర్‌కు సంబంధించినది. దీనిని ఇష్టపడే ప్రేక్షకుల కోసం ఎంత కొత్తగా తీయగలం, వారికి థియేటర్స్‌కు ఎలా తీసుకురాగలం? అనే విషయంపైనే ఎక్కువగా ఆలోచించా. నా ఉద్దేశంలో ఇంకా నాకు వయస్సు ఎక్కువ రాలేదు కాబట్టి... వచ్చే నాలుగేళ్ల పాటు రకరకాల స్ర్కిప్ట్‌లను ఎంచుకొని సినిమాలు చేయవచ్చు.
ప్రేక్షకుల అభిరుచులు మారిపోతున్నాయనుకుంటున్నారా?
అనుకున్న సమయానికి సినిమా బయటకు రాకపోతే ఇబ్బందే! నా ఉద్దేశంలో మీడియం బడ్జెట్ సినిమాలకు- సినిమా మొదలుపెట్టిన ఏడు నెలల లోపులో బయటకు వచ్చేయాలి. ప్రొడక్షన్ విషయంలో లేటు అయితే సమస్యలు ఎదురవుతాయి. ప్రేక్షకులు కేవలం వర్తమానంలో ఉన్న భావోద్వేగాలకు ప్రభావితం అవుతున్నారు. ఏదైనా సినిమా మూడేళ్లు లేటు అయిందనుకుందాం. ఆ సబ్జెక్ట్ అప్పటి దాకా రానిదే అయిఉండవచ్చు. కానీ దానిలో ఉండే ప్రధానమైన పాయింట్స్ ఎక్కడో ఒక చోట వచ్చేస్తున్నాయి. ఎమోషన్స్ పాతబడిపోతున్నాయి. ఉదాహరణకు నేను నటించిన ‘దిల్ రుబా’ సినిమాను తీసుకుందాం. అది నా ఉద్దేశంలో మంచి సినిమా. 2022లో ప్రారంభించాం. లేటు అయిపోయింది. ఆదరణ తగ్గిపోవటానికి ఈ లేటే కారణం.

మీరు రచయిత కదా... మీ ఉద్దేశంలో
తెలుగులో కథా రచయితలు తగ్గిపోవటానికి కారణాలేమిటి?
అవును. నేను రచయిత కావాలని ఇండస్ట్రీకి వచ్చాను. కానీ నటుడయ్యాను. ఇక కథల విషయానికి వస్తే- ప్రతి రచయిత తానే ఎందుకు దర్శకుడు కాకూడదనుకుంటున్నాడు. నా దగ్గరకు వచ్చే వాళ్లలో- ‘‘నా దగ్గర కథ ఉంది.. నిర్మాత లేదా డైరక్టర్‌ను చూపిస్తారా?’’ అడిగేవారు ఎవరూ లేరు. చాలామంది నిర్మాతలు- ‘‘మా డైరక్టర్ దగ్గర కథ ఉంది. వినండి’’ అంటారు. దర్శకులు ‘‘మా దగ్గర కథ ఉంది.. వినండి’’ అంటారు. ఇతర భాషల్లో ఇలాంటి సమస్య లేదు. మళయాళంలో అనేకమంది రచయితలు కనిపిస్తారు.
ప్రేక్షకులను థియేటర్‌కు ఎలా తీసుకురావాలి?
సినిమాకు ఒక వైబ్ క్రియేట్ చేయాలి. కానీ ఆ వైబ్ ఎలా వస్తుందనే విషయం ఎవరికి తెలియదు. టీజర్‌తో వర్క్‌అవుట్ అవుతుందా? ట్రైలర్‌తో వర్కవుట్ అవుతుందా? అనే విషయం తెలియదు. ఒక సినిమాలో ఉన్నదేమిటనే విషయం పది రోజుల ముందు ప్రేక్షకులకు అర్థమవ్వాలి. అప్పుడే వాళ్లు థియేటర్స్‌కు వస్తున్నారు. సినిమా విడుదలయిన తర్వాత సినిమాలో ఉన్నది అర్థమయినా ప్రయోజనం ఉండకపోవచ్చు. ఓటీటీల్లో వస్తే చూద్దాం అనుకోవచ్చు. ‘కె-ర్యాంప్’ సినిమా కోసం నేను తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో పర్యటించాను. ఈ సినిమా విజయం కావటానికి కారణం- దీనిలో ఉన్న ఎంటర్‌టైన్‌మెంట్ ప్రేక్షకులకు అర్థం కావటం. ‘థియేటర్‌కు వెళ్లి ఎంజాయ్ చేద్దాం’ అనే భావన ఉన్నప్పుడే ప్రేక్షకులు థియేటర్‌కు వస్తారు. లేకపోతే ఓటీటీలో వచ్చినప్పుడు చూద్దాం అని ఆగిపోతున్నారు.
అందరూ ‘ఓటీటీలోనే చూద్దాం’
అనే ఫీలింగ్‌లో ఉన్నారా?
అందరూ అలా లేరు. ఆడియన్స్‌కు కంటెంట్ నచ్చితే కచ్చితంగా థియేటర్‌కు వస్తారు. ఓటీటీలో చూద్దాం అనుకోరు. సినిమాలో ఉన్న ముఖ్యమైన విషయాలను ప్రేక్షకుడి దాకా పట్టుకు వెళ్లటమే నిజమైన ఛాలెంజ్. ఒకసారి ప్రేక్షకుడు సినిమాలో తమకు నచ్చేది ఉందని నమ్మితే వారు సినిమాను విజయవంతం చేస్తారు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చాలామంది మామూలు ప్రేక్షకులు సినిమా చూసి వచ్చి రివ్యూలు పెడుతున్నారు. ‘‘మామా... సినిమా అదిరింది.. థియేటర్‌లో చూడు’’ అంటున్నారు. లేకపోతే ‘‘మామా... సినిమా సో.. సో.. ఓటీటీలో చూసుకోవచ్చులే’’ అంటున్నారు.
నిర్మాతలు, దర్శకులు కూడా ఓటీటీల కోసమే తీస్తున్నారనే విమర్శ ఉంది కదా...
ఈ విమర్శను నేను అంగీకరించను. ప్రతి దర్శకుడు, నిర్మాత- తన సినిమా థియేటర్‌లో విడుదల చేయాలనే అనుకుంటాడు. మొదలు పెట్టినప్పుడు- థియేటరికల్ కాకుండా మిగిలిన మార్కెట్ల నుంచి ఎంత సొమ్ము వస్తుందని ఆలోచించవచ్చు. కానీ థియేటర్‌లో విడుదల చేయాలనే కోరిక ప్రతి నిర్మాతకు ఉంటుంది. షూటింగ్ ఒక 40 శాతం పూర్తయిన తర్వాత సినిమా ఎలా వస్తోందనే విషయం నిర్మాతకు అర్థమయిపోతుంది. ఒక వేళ ఏదైనా తేడా ఉంటే- మరింత మెరుగ్గా ఎలా చేయాలనే విషయాన్ని ఆలోచిస్తారు. అంతే తప్ప ఓటీటీలో విడుదల చేద్దాం అని వదిలేయరని నా అభిప్రాయం.
సోషల్ మీడియాపై మీ అభిప్రాయమేమిటి?
సోషల్ మీడియా ఒక వైల్డ్ ఫైర్‌లా తగులుకుంది. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన రోజులు వచ్చాయి. ప్రతి చిన్న మాట ఆచితూచి మాట్లాడాల్సి వస్తోంది. ఇంతకు ముందు ఏదైనా మాట మాట్లాడితే అందరికీ తెలియటానికి కొన్ని రోజులు పట్టేది. ప్రస్తుతం గంటల సమయం వైల్డ్ ఫైర్‌లా పాకేస్తోంది.
సీవీఎల్‌ఎన్ ప్రసాద్
ఈ వార్తలు కూడా చదవండి..
కర్నూలు బస్సు ప్రమాదంలో కీలక మలుపు
వాయుగుండం ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు
Read Latest AP News And Telugu News