Share News

Jesus the Guiding Lord: దారి చూపిన ప్రభువు

ABN , Publish Date - Sep 19 , 2025 | 04:51 AM

ఏసు క్రీస్తు పన్నెండుమంది శిష్యులను ఏర్పరచుకున్నాడు. సమాజంలోని మానవులతో ఎలా ప్రవర్తించాలో వారికి బోధించాడు. తన సందేశాన్ని అందరికీ అందించాల్సిందిగా వారిని ఆదేశించాడు. వారు పయనమవుతున్నప్పుడు...

Jesus the Guiding Lord: దారి చూపిన ప్రభువు

దైవమార్గం

ఏసు క్రీస్తు పన్నెండుమంది శిష్యులను ఏర్పరచుకున్నాడు. సమాజంలోని మానవులతో ఎలా ప్రవర్తించాలో వారికి బోధించాడు. తన సందేశాన్ని అందరికీ అందించాల్సిందిగా వారిని ఆదేశించాడు. వారు పయనమవుతున్నప్పుడు... తీసుకోవలసిన జాగ్రత్తలను సూచించాడు.

‘‘సమాజంలో మిమ్మల్ని కొందరు శపించవచ్చు. వారిపై కోపగించుకోకుండా దీవించండి. మిమ్మల్ని ఎవరైతే బాధిస్తారో... వారి కోసం ప్రార్థించండి. మిమ్మల్ని ఎవరైనా ఒక చెంప మీద కొడితే... రెండో చెంపను కూడా చూపించండి. మీ వస్తువులను ఎత్తుకుపోయేవారిని ఏమాత్రం అడ్డగించకండి. ఇతరులు మీకు ఏవేవి చేయాలని మీరు ఆశిస్తారో... మీరు కూడా వారికోసం అవి చేయడానికి సిద్ధపడాలి. మిమ్మల్ని ప్రేమించేవారిని తిరిగి మీరు ప్రేమిస్తే అందులో పెద్ద విశేషం లేదు. మిమ్మల్ని ద్వేషించేవారిని కూడా ప్రేమించాలి. కీడు చేసేవారికి మేలు చేయాలి. పైలోకంలో ఉన్న ఆ తండ్రి మీపైన ఎంత కనికరం చూపిస్తున్నాడో... అంతటి దయా దాక్షిణ్యాలను తోటివారిపైన మీరు చూపించాలి. మీ ముందు ఎవరైనా తప్పు చేస్తే వారిని క్షమించండి. అప్పుడే దేవుడు కూడా మీ తప్పులను క్షమిస్తాడు. ఇతరులను మీరు ఎటువంటి కొలమానంతో కొలుస్తారో... అదే కొలమానం మీకు కూడా వర్తిస్తుంది. ఏ శిష్యుడైనా తన బోధకుడి మాదిరిగానే ప్రవర్తించాలి. ఏదీ తెలియనివాణ్ణి మార్గదర్శిగా ఎంచుకోకూడదు. ఎప్పుడైనా ఒక అంధుడు మరో అంధుడికి దారి చూపగలడా? వారిద్దరూ ఒక గుంతలో పడిపోతారు కదా!’’ అంటూ వారికి హితవు చెప్పాడు.


అంతేకాదు... ‘‘ఒక్కోసారి ఇతరులు చేసిన తప్పులేమిటో గమనించకుండానే విమర్శిస్తాం. మీ కంట్లో ఉన్న దూలాన్ని పరిగణనలోకి తీసుకోకుండా... మీ తోటివారి కంట్లో ఉన్న నలుసు గురించి మాట్లాడడం సమంజసమా? చక్కటి ఆలోచనా ధోరణితో మంచి పునాదిని నిర్మించుకోవాలి. అదే సత్కార్యాలకు నాంది. మంచి వృక్షాల్లా ఎదగాలి. తియ్యని ఫలాలను కాయించాలి. మంచి చెట్టుకు పనికిమాలిన ఫలాలు కాయవు. మంచికీ, చెడుకూ హృదయం కేంద్రస్థానం. ఒక మనిషి సజ్జనుడు కావాలన్నా, దుర్జనుడు కావాలన్నా హృదయమే మూలం. అది మంచి చెట్టుకు బీజం లాంటిది. నేను చెప్పే మాటలను మీరు శ్రద్ధగా ఆచరించి చూడండి. సత్ఫలాలు లభిస్తాయి. నా మాట వినకపోతే నన్ను ఊరకే ‘‘ప్రభువా, ప్రభువా’’ అని పిలవడం వ్యర్థం. నా మాటలు మీకు మంచి పునాది వేస్తాయి. ఆ పునాది మీద ఎంతటి అందమైన భవనమైనా నిర్మించవచ్చు. కాబట్టి నా ఈ సందేశాన్ని మీ జీవన భవనానికి పునాదిగా చేసుకోండి’’ (లూకా... ఆరవ అధ్యాయం) అంటూ వారికి మార్గనిర్దేశం చేశాడు. ఏసు తన శిష్యులకు చెప్పిన మాటలు ఎవరికైనా,

ఏ కాలంలోనైనా గొప్ప సామాజిక, ఆధ్యాత్మిక జీవనానికి దారి చూపుతాయి.

డాక్టర్‌ యం. సోహినీ బెర్నార్డ్‌,

9866755024

ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 19 , 2025 | 04:54 AM