Pankti Pandey ISRO Scientist: భూమికి భారం తగ్గిస్తున్నారు
ABN , Publish Date - Nov 27 , 2025 | 02:33 AM
ISRO Scientist Turned Eco Warrior: Pankti Pandey’s Zero-Waste Mission
స్ఫూర్తి
ఒకప్పుడు రాకెట్ ప్రయోగాల్లో భాగస్వామి అయిన ఆమె... ఇప్పుడు పర్యావరణ కార్యకర్తగా వ్యర్థాలపై యుద్ధం చేస్తున్నారు. మార్పునకు ఇంటి నుంచే శ్రీకారం చుట్టి... ఆపై సమాజంలో చైతన్యం తెచ్చే పనిలో పడ్డారు. ‘జీరో వేస్ట్ అడ్డా’ ఇన్‌స్టా వేదికగా అవగాహన కల్పిస్తూ... భారతీయుల గృహాల్లో వ్యర్థాలను తగ్గించేలా స్ఫూర్తి రగిలిస్తున్నారు. ప్రధాని మోదీ నుంచి ‘నేషనల్ గ్రీన్ చాంపియన్ క్రియేటర్’ అవార్డును సైతం అందుకున్న ఇస్రో మాజీ శాస్త్రవేత్త పంక్తి పాండే ప్రయాణం ఇది.
‘‘మార్పు కోసం వేసే తొలి అడుగు ఎప్పుడూ ఒంటరే. ఆ అడుగు నాదే ఎందుకు కాకూడదు? ఈ ఆలోచనే నాలో ఉద్యమ స్ఫూర్తి రగిలించింది. వ్యర్థంపై యుద్ధానికి ప్రేరణ కలిగించింది. ఫలితంగా నాలుగేళ్ల కిందట ‘జీరో వేస్ట్ అడ్డా’ పురుడు పోసుకుంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరం మాది. బీటెక్ తరువాత ఇస్రోలో మైక్రోవేవ్ ఇంజనీర్‌గా ఉద్యోగం వచ్చింది. 2009లో చేరాను. గత ఏడాది మార్చి వరకు పని చేశాను. అయితే మొదటి నుంచీ నాకు భూమికి భారంగా మారుతున్న, ముఖ్యంగా ప్లాస్టిక్ వ్యర్థాల విషయంలో ఆందోళన ఉండేది. ఈ క్రమంలో ఒకరోజు పత్రికలో దీనికి సంబంధించిన ఒక కథనం చదివాను. పర్యావరణవేత్తలు, ప్రేమికులు ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాల గురించి అందులో చర్చించారు. ఆ సమయంలో నేను గర్భవతిని. ఇప్పుడే వాతావరణం ఇంతలా కలుషితమైతే... ఇక పుట్టబోయే బిడ్డ పరిస్థితి ఏంటని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. ఈ ప్రశ్న నన్ను కుదురుగా కూర్చోనివ్వలేదు. మరి పరిష్కారం ఏంటి?
మా ఇంటి నుంచి...
తెలిసి కొందరు, తెలియక కొందరు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వ్యర్థాలు పేరుకుపోవడానికి మనమందరం కారణం అవుతున్నాం. మా ఇల్లే తీసుకోండి... టిఫెన్ ప్లేట్ల నుంచి క్యారీబ్యాగ్‌ల వరకు ప్లాస్టిక్ వస్తువులే ఉండేవి. సౌలభ్యం కోసం కావచ్చు, మరొకటి కావచ్చు... కారణం ఏదైనా మనకు తెలియకుండా ప్లాస్టిక్ తదితర వ్యర్థాలు మన ఇంటిని ఆక్రమించేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే... అది నాతోనే మొదలుకావాలని భావించాను. అందుకే మా ఇంటి నుంచే మార్పునకు శ్రీకారం చుట్టాను. క్యారీ బ్యాగ్‌లు, షాంపూ బాటిల్స్, కిచెన్‌లో వాడే స్క్రబ్బర్స్... ఇలా ఎన్నో ఎక్కడబడితే అక్కడ కనిపించాయి. వాటికి ప్రత్యామ్నాయంగా పునర్వినియోగ స్టీల్ వస్తువులు, క్లాత్ బ్యాగ్స్‌లాంటివి తెచ్చాను. సెకండ్‌హ్యాండ్ ఫర్నీచర్ కొన్నాను. సాధ్యామైనంతవరకు వ్యర్థాలు తగ్గించుకొని, తదనుగుణంగా జీవనశైలిని మార్చుకున్నాను. ఆహార పదార్థాలు కూడా అవసరానికి మించి పేరుకుపోకుండా జాగ్రత్తలు తీసుకున్నా. ఇదేతరహాలో ప్రజలను చైతన్యవంతులను చేస్తే ప్రయోజనం ఉంటుందని అనుకున్నా.
సామాజిక మాధ్యమాల ద్వారా...
నా దృష్టిలో త్వరితగతిన ప్రజలకు చేరువ కావడానికి సామాజిక మాధ్యమాలు అద్భుత సాధనాలు. సరైన రీతిలో ఉపయోగించుకొంటే సమాజంపై ఎంతో ప్రభావం చూపుతాయి. ఈ భావనతోనే 2021లో నేను ‘జీరో వేస్ట్ అడ్డా’ పేరుతో ఇన్‌స్టాగ్రామ్ పేజీ ప్రారంభించాను. దానిద్వారా పర్యావరణానికి హాని కలిగిస్తున్న వ్యర్థాల గురించి అవగాహన కల్పించాను. వాటికి ప్రత్యామ్నాయ మార్గాలు సూచించాను. అవకాశం ఉన్నవారికి అనువైన కంపోస్టింగ్ పద్ధతులు వివరించాను. కొద్ది రోజుల్లోనే నా పోస్టులు వేలమందిని ఆకర్షించాయి. ఇప్పుడు ఇన్‌స్టాలో నా పేజీని నాలుగు లక్షలమందికి పైగా ఫాలో అవుతున్నారు. ఫేస్‌బుక్ తదితర సామాజిక మాధ్యమాల్లో కూడా నా పోస్టులు షేర్ చేస్తున్నారు. నా సూచనలు, సలహాలతో చాలామంది తమ జీవన శైలిని మార్చుకున్నామని చెబుతుంటే నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. ఒక చిన్న అడుగుతో పర్యావరణానికి కొంతైనా మేలు జరుగుతోంది. ఇలాంటి మార్పునే నేను కోరుకుంది.’’
వర్క్‌షాప్‌లు కూడా...
ఒక పర్యావరణ ప్రేమికురాలిగానే కాకుండా... శాస్త్రవేత్తగా కూడా నేను ఆలోచించడం మొదలుపెట్టాను. వ్యర్థాలను తగ్గించి, తద్వారా కాలుష్యాన్ని నివారించేందుకు, పునర్వినియోగించేందుకు ఆచరణసాధ్యమయ్యే మార్గాలపై నిత్యం అన్వేషిస్తూనే ఉంటాను. ప్రయోగాలు చేస్తుంటాను. దీనికి అనుబంధంగా ‘ప్రాజెక్ట్ కాంచన్’ నెలకొల్పాను. మరింత చైతన్యం తేవాలనే లక్ష్యంతో దేశవ్యాప్తంగా అవగాహన తరగతులు నిర్వహిస్తున్నాను. నా సేవలకు గుర్తింపుగా గత ఏడాది ప్రధాని మోదీ నుంచి ‘నేషనల్ గ్రీన్ చాంపియన్ క్రియేటర్’ అవార్డు అందుకున్నాను. ‘ఫోర్బ్స్’ మ్యాగజైన్ టాప్ 100 చేంజ్ మేకర్స్ జాబితాలో కూడా చోటు సంపాదించాను. ఏదిఏమైనా దీన్ని ఒక పనిగా కాకుండా ఒక బాధ్యతగా భావిస్తున్నా. అందరూ అలానే భావిస్తే భూమికి భారం తగ్గుతుంది. పర్యావరణం పచ్చగా వర్థిల్లుతుంది.’’
ఈ వార్తలు కూడా చదవండి..
బీసీలకు మోసం జరుగుతుంటే.. బీఆర్ఎస్ నుంచి నో రియాక్షన్: కవిత
For More AP News And Telugu News