Share News

Inspiring at 80 Usha Ray: ఎనభైలో ఎమ్‌బిఎ

ABN , Publish Date - Oct 29 , 2025 | 05:28 AM

దృఢసంకల్పం ఉన్నప్పుడు విద్యకు వయసు అడ్డంకి కాదని నిరూపించారు లక్నోకి చెందిన ఉష రే! 80 ఏళ్ల వయసులో ఎంబీఏ పూర్తి చేసిన ఉష... క్యాన్సర్‌ మీద ఏకంగా రెండుసార్లు విజయం సాధించిన ధీశాలి కూడా!...

Inspiring at 80 Usha Ray: ఎనభైలో ఎమ్‌బిఎ

స్ఫూర్తి

దృఢసంకల్పం ఉన్నప్పుడు విద్యకు వయసు అడ్డంకి కాదని నిరూపించారు లక్నోకి చెందిన ఉష రే! 80 ఏళ్ల వయసులో ఎంబీఏ పూర్తి చేసిన ఉష... క్యాన్సర్‌ మీద ఏకంగా రెండుసార్లు విజయం సాధించిన ధీశాలి కూడా! ఈ నిత్య విద్యార్థి గురించిన మరిన్ని ఆసక్తికరమైన విశేషాలు...

పుణెకు చెందిన డాక్టర్‌ డి.వై. పాటిల్‌ విద్యాపీఠ్‌ సెంటర్‌ ఫర్‌ ఆన్‌లైన్‌ లెర్నింగ్‌లో ఎంబీఏ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు ఉషకు 77 ఏళ్లు. ఈ ఏడాది ఆగస్టులో 80వ పుట్టినరోజు జరుపుకొన్న రెండు వారాలకు, చివరి సెమిస్టర్‌ పరీక్షలకు హాజరయ్యారు ఉష. పెద్ద వయసులో ఎంబీఏ చదవాలనే ఉష నిర్ణయం వెనక కూడా ఒక ఆసక్తికరమైన కారణం ఉంది. లక్నో విశ్వవిద్యాలయం నుంచి ఎమ్మెస్సీ పూర్తి చేసిన ఉష.... దశాబ్దాల తరబడి ఉపాధ్యాయ వృత్తికే పరిమితమైపోయారు. భారతదేశంతో పాటు బ్రిటన్‌, యెమెన్‌ దేశాల్లోని అంతర్జాతీయ పాఠశాలల్లో సైతం విద్యార్థులకు బయాలజీ బోధించారు. 2009లో పదవీ విరమణ పొందిన తర్వాత, లఖ్‌నవూ గోమతినగర్‌లోని లోవీ శుభ్‌ హాస్పిటల్‌ సిఇఒగా సేవలందించడం మొదలుపెట్టారు.

ఎమ్‌బిఎ ఆలోచన వెనక...

అయితే అక్కడే ఆగిపోవడం ఆమెకు ఇష్టం లేదు. ఏదో ఒకటి నేర్చుకోవాలనే తపన ఆమెను వేధించడం మొదలుపెట్టింది. ఆ క్రమంలో 2023లో ఆస్పత్రి సిఇఒగా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసే సమయంలో, వాళ్లలో ఎకువ మంది ఎంబీఏ అర్హత కలిగి ఉన్న విషయాన్ని గ్రహించారామె. ఆ సందర్భం గురించి వివరిస్తూ... ‘ఎంబీఏ... ఎంబీఏ... ఏ దరఖాస్తులో చూసినా అదే డిప్లొమా. ‘ఏంటీ ఎంబీఏ? ఇంతమంది దీన్నే ఎందుకు ఎంచుకున్నారు?’ అనే ఆసక్తితో దాని గురించి తెలుసుకోవడం మొదలుపెట్టాను. తెలిసిన ఆ తరువాత... ప్రస్తుత వృత్తికి సహాయపడేలా 2023 ఏప్రిల్‌లో, హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్స్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ విభాగంలో ఎంబీఏకి దరఖాస్తు చేసుకున్నాను. ఆలస్యంగానైనా ఎంబీఏ చదువుతున్నందుకు సంతోషించాను. కానీ ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. అసలా కోర్సును చదవగలనా? అనే అనుమానం మొదలైంది. సబ్జెక్టులన్నీ నాకు పూర్తిగా కొత్త. నేనేమో ఎమ్మెస్సీ బయాలజీ చదివాను. ఏళ్ల తరబడి ఆ విద్యనే బోధించాను. కానీ ఇప్పుడు కొత్తగా ఎకనామిక్స్‌, స్టాటిస్టిక్స్‌ నేర్చుకోవడం కష్టంగా అనిపించింది.


అదొక పెద్ద సవాలుగా మారింది. కానీ నాకు సవాళ్లంటే చాలా ఇష్టం’’ అని వివరిస్తున్న ఉష... కంప్యూటర్‌ వాడకాన్ని కూడా నేర్చుకున్నారు. అయితే ఆమెది ఊపిరి సలుపుకోని వృత్తి. అయినప్పటికీ సాయంత్రం ఆస్పత్రి నుంచి ఇంటికి రాగానే, ఆన్‌లైన్‌ తరగతులకు హాజరవుతూ, రాత్రి పొద్దుపోయే వరకూ చదువుకుంటూ సబ్జెక్టుల మీద పట్టు సాధించారు. పాఠాలు నేర్చుకోవడం కోసం తానెదుర్కొన్న ఇబ్బందులను గుర్తు చేసుకుంటూ...

‘‘పాఠాలు నేర్చుకోడానికి నా వయసు, జ్ఞాపకశక్తి సహకరించలేదు. అందుకోసం నాలుగు రెట్లు ఎక్కువ కష్టపడవలసి వచ్చింది. అయినా ఆ కష్టాన్ని ఇష్టంగా స్వీకరించాను. కాబట్టే పరీక్షల్లో 80 శాతం మార్కులు సాధించగలిగాను. కానీ ప్రయత్నాన్ని విరమించుకోవాలనే ఆలోచన నాకెప్పుడూ రాలేదు. ఏదైనా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత, వెనకడుగు వేసే అలవాటు నాకు లేదు. అనునిత్యం పోరాడి, అంతిమంగా విజయం సాధించడాన్నే నేను లక్ష్యంగా పెట్టుకుంటాను’’ అంటూ వివరించారు ఉష.

క్యాన్సర్‌పె

రెండు సార్లు విజయం

పట్టుదలతో పోరాడడం ఆమెకు కొత్త కాదు. 2003లో యెమెన్‌లో పని చేసేటప్పుడు ఛాతీ క్యాన్సర్‌ బారిన పడ్డారామె. 8 నెలల పాటు కీమోథెరపీ, రేడియోథెరపీ తీసుకున్న తర్వాత పూర్తిగా కోలుకున్నారు. అయినప్పటికీ 2020లో ఆ వ్యాధి మళ్లీ తిరగబెట్టింది. అప్పుడు కూడా ఉష్‌ క్యాన్సర్‌తో ధైర్యంగా పోరాడి విజయం సాధించారు. ఆ చేదు అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ....‘‘సమస్య మీద విజయం సాధించిన తర్వాత, మనం మరింత దృఢంగా, అప్రమత్తంగా మారిపోతాం. నేనొక ఇనుప మహిళగా మారిపోయాను. ఆ వ్యాధి మీద విజయం సాధించాను కాబట్టి ఈ ప్రపంచంలో ఏ పోరాటంలోనైనా విజయం సాధించగలుగుతాననే నమ్మకం నాలో పెరిగింది’’ అంటున్న ఉష... తన విజయం వెనక కుటుంబసభ్యులు, సాటి ఉద్యోగుల అండదండలున్నాయని అంటున్నారు. ‘‘ఈ వయసులో నేను పోగొట్టుకునేదేమీ ఉండదు. ఎంబీఏ పూర్తి చేయలేకపోయినా నేనేమీ బాధపడను. కానీ ప్రయత్నం చేయకుండా ఉండిపోవడం మాత్రం నా నైజం కాదు’ అని చెప్పారు. ఆసక్తి ఉన్న పనిని ఎంచుకోవాలనీ, మన దృష్టి మరల్చే అంశాలు అనేకం ఉన్నప్పటికీ, ఏకాగ్రతనే కీలకంగా మలచుకోవాలనీ, అప్పుడు ఎలాంటి విజయమైనా సాధ్యపడుతుందనీ నేటి యువతకు ఉష సందేశమిస్తున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి...

మొంథా తుపాను.. ఎమ్మెల్యేలకు లోకేష్ ముఖ్య సూచనలు

ఆ జిల్లా ప్రజలను వణికిస్తోన్న తుపాను హెచ్చరికలు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 29 , 2025 | 05:28 AM