Indian Racer Women Diana Pundole: అంతర్జాతీయ పోటీలో మన మహిళా రేసర్
ABN , Publish Date - Nov 05 , 2025 | 03:05 AM
పూణెకు చెందిన 32 ఏళ్ల డయానా పుండోలె... తన ఫెరారి కారుతో అంతర్జాతీయ పోటీకి సిద్ధమవుతోంది. ఈ నెల నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ వరకూ జరిగే ‘ఫెరారీ క్లబ్ ఛాలెంజ్ మిడిల్ ఈస్ట్’ కార్ల రేసులో...
వార్తల్లో వ్యక్తి
పూణెకు చెందిన 32 ఏళ్ల డయానా పుండోలె... తన ఫెరారి కారుతో అంతర్జాతీయ పోటీకి సిద్ధమవుతోంది. ఈ నెల నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ వరకూ జరిగే ‘ఫెరారీ క్లబ్ ఛాలెంజ్ మిడిల్ ఈస్ట్’ కార్ల రేసులో పాల్గొనబోతున్న ఈ రేసర్ గురించిన ఆసక్తికరమైన విశేషాలు...
మధ్యప్రాచ్యంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఫార్ములా వన్ సర్క్యూట్స్‌లో తన ఫెరారీ 296 ఛాలెంజ్ కారుతో డయానా పుండోలె పోటీ పడుతోంది. ఈ పోటీలో భాగంగా ఆమె దుబాయి, అబుదాబి, బహ్రెయిన్, ఖతార్, సౌదీ అరేబియాల్లోని సర్క్యూట్స్‌లో సత్తా చాటబోతోంది. సాధారణంగా రేసు కార్ల పోటీలు పురుషులకే పరిమితం. అలాంటిది ఒక మహిళ ఈ రంగంలోకి ప్రవేశించి, గుర్తింపు పొందే స్థాయికి ఎదగడం అసాధారణమైన విషయమే! ఈ విషయంలో డయానా తన తండ్రి నుంచి స్ఫూర్తి పొందింది. రేసింగ్ పట్ల మక్కువ కలిగిన ఆ దివంగత మోటార్‌స్పోర్ట్స్ ఔత్సాహికవేత్త గురించి మాట్లాడుతూ... ‘‘రేసింగ్ పట్ల నాన్నకున్న మక్కువే నన్ను ఈ రంగంలోకి అడుగుపెట్టేలా ప్రోత్సహించింది. ఇప్పుడు ఆయన భౌతికంగా నాతో లేకపోయినా... నేను ట్రాక్ మీద ప్రయాణిస్తున్న ప్రతిసారీ ఈ క్రీడ పట్ల ఆయనకున్న మక్కువ నన్ను ముందుకు నడిపిస్తూనే ఉంటుంది’’ అంటూ తన తండ్రి గురించి చెప్పుకొచ్చింది డయానా!
నాన్న స్ఫూర్తితో...
కార్ల రేసులో డయానా ప్రస్థానం 2018లో మొదలైంది. క్రమేపీ మోటార్‌స్పోర్ట్‌లో ర్యాంకులు సాధిస్తూ, 2024లో మద్రాస్ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌లోని ఎమ్‌ఆర్‌ఎఫ్ సలూన్ కేటగిరీలో చేపట్టిన జాతీయ స్థాయి రేసింగ్ పోటీలో గెలిచింది. ఆ పోటీలో గెలిచిన మొట్టమొదటి భారతీయ మహిళగా గుర్తింపు తెచ్చుకునే స్థాయికి ఎదిగింది. ఒక జాతీయ స్థాయి రేసింగ్ పోటీలో ఒక మహిళ పురుష ప్రత్యర్థులను వెనక్కు నెట్టి గెలుపొందడం అదే ప్రథమం. ఆ విజయం గురించి ప్రస్తావిస్తూ... ‘‘జెండర్ కాదు, సామర్థ్యమే ఒక రేసర్‌ను నిర్వచిస్తుందనే నమ్మకం ఆ విజయంతో బలపడింది’’ అంటూ వివరించింది డయానా. ఆ విజయంతో, కార్ల రేసింగ్ పట్ల డయానాకు ఉన్న నిబద్ధత, పట్టుదల స్పాన్సర్ల దృష్టిని ఆకట్టుకున్నాయి.
బెంగుళూరుకు చెందిన రేస్‌టెక్ ఇండియా...
2022 నుంచి ఆమె రేసింగ్ పోటీలకు మద్దతు ఇవ్వడం మొదలుపెట్టింది. ఆమె జాతీయ స్థాయి విజయం తరువాత... అలైన్డ్ ఆటొమేషన్, ఫెరారీ న్యూఢిల్లీలు మధ్యప్రాచ్యంలో జరగబోతున్న ఫెరారీ ఛాలెంజ్‌లో ఆమె పాల్గొనేందుకు మార్గం సుగమం చేశాయి.

ఫెరారీ 296 ఛాలెంజ్
రేసింగ్ కోసం ఫెరారీ 296 ఛాలెంజ్ కారును ఎంచుకోవడంతో డయానా రేస్ ప్రయాణంలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. ప్రత్యేకంగా రేసులకు తగ్గట్టు మార్పులు చేసిన ఈ కారులో 700 హార్స్‌పవర్ వి6 ఇంజన్ బిగించి ఉంటుంది. కేవలం 1330 కిలోల బరువు మాత్రమే ఉండే ఈ కారు అత్యాధునిక యంత్రంలాంటిది. దీని ఏరోడైనమిక్స్, నడిపే సౌలభ్యం, కచ్చితత్వాలు మరో స్థాయిలో ఉంటాయి. ‘‘నా మునుపటి కార్లతో పోలిస్తే ఈ కారును నడపడం కాస్త కష్టమే! అయినప్పటికీ అంతిమంగా పొందే ప్రతిఫలం అద్భుతంగా ఉంటుంది’’ అంటూ తన రేసు కారు గురించి వివరిస్తున్న డయానా, దుబాయ్ ఆటోడ్రోమ్ యాస్ మెరీనాతో పాటు, బహ్రెయిన్ అంతర్జాతీయ సర్క్యూట్‌లో పోటీ పడబోతోంది. గతంలో ఆ ప్రదేశాల్లో శిక్షణ పొందాననీ, తిరిగి అవే సర్క్యూట్స్‌లో పోటీలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందనీ కూడా చెప్పుకొస్తోంది డయానా.
వేగం ఒక్కటే సరిపోదు
కార్ల రేసు పోటీలకు సిద్ధపడుతున్న డయానా భౌతిక సామర్థ్యంతో పాటు మానసిక ఏకాగ్రతను కూడా మెరుగుపరుచుకుంటోంది. అందుకోసం కార్డియోతో పాటు స్ట్రెంగ్త్ ట్రైనింగ్, రిఫ్లెక్స్ డ్రిల్స్, ధ్యానం సాధన చేస్తోంది. ‘‘రేసింగ్‌లో వేగం ఒక్కటే సరిపోదు. కచ్చితత్వం, స్థిరత్వం, మానసిక సామర్థ్యం కూడా ముఖ్యమే! ఒత్తిడిలో పట్టు తప్పిపోకుండా ఉండడం కోసం విజువలైజేషన్, ధ్యానం.. ఈ రెండింటినీ నేను సాధన చేస్తూ ఉంటాను’’ అంటూ వివరిస్తున్న డయానా, ఫెరారీ క్లబ్ ఛాలెంజ్ మిడిల్ ఈస్ట్ కార్ల రేసులో విజయం సాధించాలని కోరుకుందాం!
ఇవి కూడా చదవండి...
వ్యవసాయ రంగం అభివృద్ధి దేశ ఆర్థిక ప్రగతికి మూలం: కిషన్‌రెడ్డి
ఒక్క ఛాన్స్ అని.. తెలంగాణని దివాళా తీయించారు.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ షాకింగ్ కామెంట్స్
Read Latest Telangana News And Telugu News