దారి తప్పితే... అనర్థం తప్పదు
ABN , Publish Date - Feb 14 , 2025 | 03:03 AM
పూర్వం ఒక గారడివాడు ఉండేవాడు. అతను ఊరూరు తిరుగుతూ, గారడి ప్రదర్శనలు చేస్తూ జీవించేవాడు. అతని దగ్గర పాము, కోతి, మేక ఉండేవి. వాటిని అతను స్నేహితుల్లా భావించి, వాటిని సంరక్షిస్తూ ఉండేవాడు...

సద్బోధ
పూర్వం ఒక గారడివాడు ఉండేవాడు. అతను ఊరూరు తిరుగుతూ, గారడి ప్రదర్శనలు చేస్తూ జీవించేవాడు. అతని దగ్గర పాము, కోతి, మేక ఉండేవి. వాటిని అతను స్నేహితుల్లా భావించి, వాటిని సంరక్షిస్తూ ఉండేవాడు. ఒకసారి అతను ఒక ఊరిలో బస చేశాడు. ఇంతలో భారీ వర్షాలు వచ్చి, ఆ ఊరిని వరదనీరు ముంచెత్తింది. గ్రామస్తులందరూ ఊరిని ఖాళీ చేసి వెళిపోతున్నారు. అతను కూడా సురక్షిత ప్రాంతానికి బయలుదేరాడు. దారిలో ఒక వాగు కనిపించింది. అందులో నీటి ప్రవాహం ఉద్ధృతంగా ఉంది. అప్పుడు ఆ గారడివాడు పాముల బుట్టని తల మీద పెట్టుకొని, కోతిని భుజాల మీద కూర్చోబెట్టుకొని, మేకని చంకలో ఉంచుకొని... నీటిలో నడుస్తున్నాడు.
ప్రవాహం మధ్యకు వారు చేరుకొనేసరికి, కోతికి దాని సహజసిద్ధమైన బుద్ధితో... పాముల పెట్టె మూతను తెరిచింది. వెంటనే పాము బుస్సుమంటూ పైకి దూకి, కోతిని కాటెయ్యబోయింది. ప్రమాదాన్ని గుర్తించిన కోతి నీటిలోకి గెంతింది. దాని వెనుకే పాము కూడా నీటిలోకి దూకింది. ఈ గందరగోళంతో భయపడిన మేక... ఆ గారడివాడి పట్టు వదిలించుకొని నీటిలో పడింది. ఆ మూడూ ప్రవాహంలో కొట్టుకుపోయాయి. వాటిని ఏదో రకంగా తనతోపాటు అవతలి ఒడ్డుకు చేర్చాలని గారడివాడు అనుకున్నా ప్రయోజనం లేకపోయింది.
ఈ కథను యోగిగా, సద్గురువుగా ఖ్యాతి పొందిన స్వామి నారాయణ్ మహరాజ్ తన భక్తులకు వివరిస్తూ... ‘‘మనిషి స్వభావం కోతిలాంటిది. అనవసరమైన పనులవైపే దృష్టి మళ్ళుతూ ఉంటుంది. చాలా సందర్భాలలో... మనం చేసే పని వల్ల సంభవించే ప్రమాదాల గురించి ఆలోచించం. పాము ఉన్న బుట్టను కోతి తెరిచింది. పాము స్వభావం కాటు వెయ్యడం. కాబట్టి అది కోతి మీదకు దూకింది. అపాయాన్ని తప్పించుకోవడానికి మరో అపాయంలోకి... నీటి ప్రవాహంలోకి కోతి దూకి, కొట్టుకుపోయింది. కోతిని తరుముతూ పాము కూడా దాని వెనుకే నీటిలో పడింది. దీనంతటినీ చూసి భయపడిన మేక కూడా తనను రక్షించేవాణ్ణి వదిలించుకొని నీళ్ళలోకి దూకింది. అవి వరదలో పడకుండా కాపాడుకోవడానికి గారడివాడు ఎంతో తాపత్రయపడ్డాడు. తన దారి తను చూసుకోకుండా వాటిని తనతో పాటు మోసుకువెళ్ళాడు. కానీ ఆ రక్షణను అవి ఉపయోగించుకోలేకపోయాయి. మనిషి విషయంలోనూ అంతే... భగవంతుడు మనల్ని ఎల్లప్పుడూ కాపాడాలనే ప్రయత్నిస్తాడు. కానీ మన స్వభావాల కారణంగా, అవివేకం కారణంగా ఆయన నిర్దేశించిన దారి నుంచి తప్పించుకోవాలని చూస్తాం. దాని ప్రతిఫలం అనుభవిస్తాం.అన్నివేళలా భగవంతుడినే ధ్యానిస్తూ, వివేకంతో మసలుకున్నప్పుడు ఎలాంటి ప్రమాదాన్నైనా మనం దాటగలం’’ అని వివరించారు.
Also Read:
ఇద్దరు మహిళలు కలిస్తే ఇలాగే ఉంటుందేమో..
బర్డ్ ఫ్లూ.. సీఎస్ విజయానంద్ ఏం చెప్పారంటే..
అప్పుల తెలంగాణ.. కేంద్ర మంత్రి షాకింగ్ కామెంట్స్..
For More Andhra Pradesh News and Telugu News..