How to Visit a Shiva Temple: శివాలయాన్ని ఎలా దర్శించాలి
ABN , Publish Date - Oct 24 , 2025 | 02:26 AM
పవిత్రమైన కార్తిక మాసంలో శివాలయ దర్శనం అత్యంత శుభప్రదం. ఆ దర్శన క్రమాన్ని మన పూర్వులు, మహర్షులు వివరించారు. శివాలయానికి వెళ్ళినవారు మూడు లింగాలను కచ్చితంగా దర్శించుకోవాలి. అవి: స్థూల లింగం...
తెలుసుకుందాం
పవిత్రమైన కార్తిక మాసంలో శివాలయ దర్శనం అత్యంత శుభప్రదం. ఆ దర్శన క్రమాన్ని మన పూర్వులు, మహర్షులు వివరించారు. శివాలయానికి వెళ్ళినవారు మూడు లింగాలను కచ్చితంగా దర్శించుకోవాలి. అవి: స్థూల లింగం, సూక్ష్మ లింగం, భద్ర లింగం. వాటినే ‘లింగత్రయం’ అంటారు.
స్థూల లింగం విమానంస్యాత్ సూక్ష్మ లింగం సదాశివమ్... బలిపీఠం భద్రలింగం లింగత్రయ మిహోచ్యతే... అంటే గర్భగుడిపైన నిర్మితమైన విమానం... స్థూల లింగం. ఆలయంలో కొలువుతీరిన మూల లింగం... సూక్ష్మ లింగం. ధ్వజ స్తంభానికి ముందు ఉండే బలిపీఠం... భద్ర లింగం. మొదట ఆలయ గోపురాన్ని దర్శించిన వెంటనే... దాన్ని స్థూల లింగంగా భావించి, నమస్కరించాలి. ఆ తరువాతనే ఆలయంలో ప్రవేశించాలి. ధ్వజ స్తంభం దగ్గర సాష్టాంగ నమస్కారం చేయాలి. భగవంతుడి నామాన్ని ఉచ్చరిస్తూ ఆలయానికి ప్రదక్షిణ చేయాలి. మళ్ళీ ధ్వజ స్తంభం దగ్గర సాష్టాంగ నమస్కారం చేయాలి. ధ్వజస్తంభం, బలిపీఠం, నంది దగ్గర ఎదురుగా నిలబడి, స్తోత్రం చేసి, ఆలయంలో ప్రవేశించాలి. మొదట వినాయకుణ్ణి దర్శించుకొని... మూడుసార్లు గుంజిళ్ళు తీయాలి. అనంతరం ఆలయంలోని మూలస్థాన మూర్తి ముందు నిలబడి, రెండు చేతులూ జోడించి, నమస్కరించి, పంచాక్షరి మంత్రాన్ని (ఓం నమఃశివాయ) పఠిస్తూ, తమకు వచ్చిన స్తోత్రాలను చదువుతూ దర్శనం చేసుకోవాలి. ఆ తరువాత ఆలయంలోని అమ్మవారి సన్నిధికి వెళ్ళి... దేవీ స్తోత్రాలు పారాయణ చేస్తూ నమస్కారం చేయాలి. అలాగే ఉత్సవ విగ్రహాలను దర్శించి, రెండో ప్రదక్షిణ చేయాలి. తరువాత నటరాజ స్వామిని, శివకామసుందరి అమ్మవార్లను, ప్రాకారంలోని ఇతర పరివార దేవతలను దర్శించి, నమస్కరించుకోవాలి. తరువాత సుబ్రహ్మణ్యస్వామిని దర్శించుకొని, నవగ్రహ సన్నిధికి వెళ్ళాలి. అక్కడ ఒకసారి లేదా మూడుసార్లు ప్రదక్షిణలు చేయాలి. చివరిగా... ఆలయానికి మూడో సారి ప్రదక్షిణ చేయాలి. మూడోసారి ప్రదక్షిణ చేసేటప్పుడు... దక్షిణామూర్తి సన్నిధిని, దుర్గా సన్నిధిని, చివరిగా చండీశ్వరుణ్ణి దర్శించాలి. చండీశ్వరుడు మానవునిగా జన్మించి, పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకొని, శివ నిర్మాల్యానికి అధిపతి అయ్యాడు. భక్తి మార్గంలో పరమేశ్వర సాయుజ్యం పొందాడు. ఆయన విగ్రహానికి నమస్కరించి... ‘‘ఈ దర్శన క్రమంలో ఏదైనా తప్పు ఉంటే క్షమించి, దర్శన ఫలితాన్ని ఇవ్వు’’ అని ప్రార్థించాలి. చివరిగా ధ్వజస్తంభం దగ్గరకు వచ్చి, మరోసారి సాష్టాంగ నమస్కారం చేయాలి. అక్కడ కూర్చొని శివనామ జపం చేయాలి. తరువాత కాసేపు కన్నులు మూసుకొని... ఆలయంలో దర్శించిన మూర్తులను గుర్తుకు తెచ్చుకొని నమస్కరించాలి. శివ నామ ధ్యానంతో ఇంటికి బయలుదేరాలి.
దగ్గుపాటి నాగవరప్రసాద్,
స్థపతి, 9440525788

అలా చేస్తే సత్ఫలితాలు
ఆలయంలో స్వామిని పాదాల నుంచి కిరీటం వరకూ... దిగువ నుంచి పైకి చూస్తూ దర్శనం చేసుకోవాలి. ‘ధూళిదర్శనం దుఃఖనాశనం, పాదదర్శనం పాపనాశనం, శిఖరదర్శనం చింతనాశనం, కటిదర్శనం కర్మనాశనం, కంఠదర్శనం వైకుంఠ సాధనం, ముఖదర్శనం ముక్తిదాయకం, కిరీటదర్శనం కీర్తిదాయకం సర్వాంగ దర్శనం సర్వపాపవిమోచనం’ అంటూ భగవంతుణ్ణి, ఆయన అవయవాలను దర్శిస్తే కలిగే ఫలితం గురించి ‘తీర్థ క్షేత్ర మహిమ’ గ్రంథం వివరించింది. ‘ధూళి దర్శనం’ అంటే మనం యాత్రకు బయలుదేరిన తరువాత ఆ క్షేత్రాన్ని చేరుకున్నాక... కాళ్ళు, చేతులు కడుక్కోవడం లాంటివి ఏవీ చేయకుండా... నేరుగా ఆలయంలోకి వెళ్ళి స్వామిని దర్శించడం. ఇది వినడానికి కొంత వింతగా అనిపించినా మన పూర్వీకులు దీన్ని సంప్రదాయంగా అనుసరించారు. దీనికి కారణం ఏమిటంటే... తీర్థయాత్ర ప్రారంభించినప్పటి నుంచి యాత్రికులు నియమ నిష్టలను, ఆహార నియమాలను పాటిస్తూ ఆ క్షేత్రానికి చేరుకుంటారు. ఆలయంలో ప్రవేశించి, ధ్వజస్తంభం దగ్గర సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు... ఆ ఆలయంలోని పరమ భక్తుల పాదధూళి, ఆలయంలోని దివ్యత్వం అతణ్ణి పవిత్రుణ్ణి చేస్తాయి. అప్పుడు స్వామిని దర్శించుకొనే అర్హత అతనికి కలుగుతుంది. ధూళి దర్శనం దుఃఖాలను హరింపజేస్తుంది. శ్రీశైల క్షేత్రంలో ఈ ధూళి దర్శన సంప్రదాయం ఉంది. ఇక... ఆలయానికి చేరిన భక్తుడు ముందుగా విమాన శిఖరాన్ని దర్శించాలి. అది అతని చింతలను తీరుస్తుంది. దూరం నుంచి విమాన శిఖరాన్ని చూసినంత మాత్రాన సర్వపాపాల నుంచి విముక్తుడు అవుతాడు. అలాగే ఆలయంలో స్వామివారి వివిధ అవయవాలను దర్శించడం ద్వారా అనేక సత్ఫలితాలను భక్తులు పొందుతారు. కాగా ఆలయ విమానం నీడను దాటడం, తొక్కడం దోషం. బలి పీఠం దగ్గర తప్ప మరెక్కడా సాష్టాంగ నమస్కారం చేయకూడదు.
ఈ వార్తలు కూడా చదవండి..
అబుదాబీలో వరుస భేటీలు.. పెట్టుబడులపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్
పీపీపీ మోడ్ అంటే అమ్మడం కాదు.. వైసీపీపై రఘరామ సెటైర్లు
Read Latest AP News And Telugu News