Statement Jewelry Trends: స్టయిల్ స్టేట్‌మెంట్
ABN , Publish Date - Dec 21 , 2025 | 07:09 AM
చూడగానే పలకరించినట్లుంటాయి స్టేట్‌మెంట్ ఆభరణాలు. సంప్రదాయ డిజైన్లకు భిన్నంగా ఆధునికతను ప్రతిబింబిస్తూ కళాత్మకత ఉట్టిపడేలా ఉంటాయి. నెక్లెస్, ఉంగరం, జుంకాలు... వీటిలో ఏ ఒక్కటి పెట్టుకున్నా...
చూడగానే పలకరించినట్లుంటాయి స్టేట్‌మెంట్ ఆభరణాలు. సంప్రదాయ డిజైన్లకు భిన్నంగా ఆధునికతను ప్రతిబింబిస్తూ కళాత్మకత ఉట్టిపడేలా ఉంటాయి. నెక్లెస్, ఉంగరం, జుంకాలు... వీటిలో ఏ ఒక్కటి పెట్టుకున్నా నలుగురిలో ప్రత్యేకంగా నిలబెడతాయి. అందుకే సెలబ్రిటీల నుంచి సామాన్య మహిళల వరకు అందరూ వీటిని ధరించడానికి ఇష్టపడుతున్నారు. ఈ ఆభరణాలను బంగారం, వెండి, ప్లాటినంతోపాటు ఇతర లోహాలు, సెమీ ప్రేషియస్ రాళ్లు, ముత్యాలు, రత్నాలు, కలప, వివిధ రకాల ఫ్యాబ్రిక్ పీస్‌లు, పక్షుల ఈకలు, పట్టు దారాలతో కూడా తయారు చేస్తున్నారు జ్యువెలరీ డిజైనర్లు.
వి లేదా స్కూప్ లాంటి ఓపెన్ నెక్‌లైన్ ఉన్న మోడరన్ డ్రెస్‌ల మీద స్టేట్‌మెంట్ నెక్లెస్‌లు బాగా నప్పుతాయి. ప్లంగింగ్, ఆఫ్ షోల్డర్ స్టయిల్ డ్రెస్‌ల మీదకూడా ఇవి సూటవుతాయి. డ్రెస్ కలర్‌తో మ్యాచ్ అయ్యేలా నెక్లె్‌సలో రాళ్లు, పూసలు లేదా పెండెంట్ ఉండేలా చూసుకుంటే బాగుంటుంది. పెద్ద పెద్ద కుందనాలు లేదా రత్నాలతో కూడిన మల్టీలేయర్డ్ నెక్లె్‌సలు ట్రెండింగ్‌లో ఉన్నాయి. స్టేట్‌మెంట్ నెక్లెస్ పెట్టుకున్నప్పుడు చెవులకు ఎలాంటి ఇయర్ రింగ్స్ ధరించకూడదు. అప్పుడే ముఖం ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
స్టేట్‌మెంట్ ఇయర్ రింగ్స్‌లో జుంకాలు, చాంద్‌బాలీలు, షాన్డిలియర్స్, హూప్స్, డ్రాప్స్ ఇలా ఎన్నో లభ్యమవుతున్నాయి. వీటిని పెట్టుకున్నప్పుడు మెడను బోసిగా ఉంచాలి. హెయిర్ స్టయిల్ సింపుల్‌గా ఉండాలి. భారీ సైజులో ఉండే స్టేట్‌మెంట్ ఇయర్ రింగ్స్.. సంప్రదాయ, ఆధునిక ఫ్యాషన్ దుస్తులన్నింటి మీద చక్కగా నప్పుతాయి. మిర్రర్ వర్క్, ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్న కుర్తాలు, కుర్తీలు, అనార్కలీ డ్రెస్‌ల మీద పెద్ద డోమ్ ఆకారంలో ఉండే ఆక్సిడైజ్డ్ జుంకాలు అద్భుతంగా సూటవుతాయి.
ఇక కఫ్ బ్యాంగిల్స్‌ది ప్రత్యేక స్థానం. మెటాలిక్, బీడెడ్, కటౌట్, మిక్స్‌డ్ మెటీరియల్ కఫ్ బ్యాంగిల్స్‌కు డిమాండ్ అధికం. ఒక చేతికి రెండు లేదా మూడు కఫ్ బ్యాంగిల్స్ వేసుకుని మరో చేతికి సింపుల్ వాచ్ పెట్టుకుంటే బాగుంటుంది. వేళ్లకు ఉంగరాలు పెట్టుకోకూడదు. మెడలో సన్నని గొలుసు, చెవులకు చిన్న స్టడ్స్, ముఖానికి సింపుల్ మేకప్ ఎంపిక చేసుకుంటే సరిపోతుంది.
విభిన్నమైన ఆకృతుల్లో భారీగా కనిపించే కాక్‌టెయిల్ ఉంగరాలను స్టేట్‌మెంట్ జ్యువెలరీగా ధరిస్తున్నారు మహిళలు. బంగారం, వజ్రాలు, రత్నాలతో గ్రాండ్‌గా రూపొందించిన ఉంగరాలను పార్టీలు, ఫంక్షన్లలో పెట్టుకుంటున్నారు. ఏదైనా ఒక వేలికి మాత్రమే స్టేట్‌మెంట్ ఉంగరం పెట్టుకోవాలి. మిగిలిన వేళ్లకు ఏ రింగ్‌లూ పెట్టకూడదు.
ఇటీవల ముంబైౖలో జరిగిన స్వదేశీ స్టోర్ ప్రారంభోత్సవ వేడుకల్లో నీతా అంబానీ.. చెవులకు వందేళ్లనాటి పోల్కీ కుందన్ జుంకాలు పెట్టుకుని బోసి మెడతో ఆకర్షణీయంగా కనిపించారు. ఎడమ చేతి వేలికి వజ్రాలు, కెంపులు పొదిగిన పక్షి ఉంగరం, కుడి చేతికి బంగారు బ్రేస్‌లెట్, ఉంగరాలను జోడించే ప్రత్యేకమైన హాత్‌ఫూల్‌ను ధరించారు. ఇవన్నీ నీతాకు ఆమె తల్లి నుంచి వారసత్వంగా లభించాయి. ఈమధ్య ఓ ఈవెంట్‌లో అదితీరావు హైదరీ.. బీడ్స్ జతచేసిన ఆక్సిడైజ్డ్ జుంకాలతో తళుక్కుమన్నారు. అలాగే జాన్వీ, కృతి సనన్, సమంత, కాజల్, శ్రియ, అనన్య పాండే, శిల్పాశెట్టి, కరీనా, దీపిక తదితర నటీమణులు కూడా తరచూ స్టేట్‌మెంట్ ఆభరణాలతో కనువిందు చేస్తుంటారు.
Also Read:
న్యూ ఇయర్ పార్టీ.. ఇండియాలో బెస్ట్ బీచ్ డెస్టినేషన్స్ ఏవో తెలుసా?
కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు శరీరంలో కనిపించే సంకేతాలు ఇవే.!
For More Latest News