Rose Plant Care: చెట్టునిండా గులాబీలు పూయాలా
ABN , Publish Date - Oct 08 , 2025 | 01:09 AM
నేలమీదే కాదు మిద్దె తోటల్లో, బాల్కనీ కుండీల్లో కూడా చక్కగా పెరిగి గుత్తులుగా పువ్వులు పూసే మొక్క గులాబీ. అందరూ ఇష్టపడే రంగురంగుల గులాబీలు ఏడాదంతా పూయాలంటే...
నేలమీదే కాదు మిద్దె తోటల్లో, బాల్కనీ కుండీల్లో కూడా చక్కగా పెరిగి గుత్తులుగా పువ్వులు పూసే మొక్క గులాబీ. అందరూ ఇష్టపడే రంగురంగుల గులాబీలు ఏడాదంతా పూయాలంటే ఏ జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం...
రోజుకు కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటలపాటు ఎండ తగిలేలా ఏర్పాటు చేసుకుంటే గులాబీ మొక్క గుబురుగా పెరుగుతుంది. అలాగే మొక్కకు బాగా గాలి ఆడేలా చూసుకోవాలి. అప్పుడే మొగ్గలు ఎక్కువగా వస్తాయి.
గులాబీలు ఎక్కువగా పూయాలంటే మట్టి పోషకాలతో నిండి ఉండాలి. నేలలో లేదా కుండీలో తగినంత తోటమట్టి, కొద్దిగా ఇసుక కలిపితే మొక్క మొదట్లో నీరు నిలవకుండా ఉంటుంది. దీంతో వేర్లు బలంగా పెరుగుతాయి. మట్టిలో తరచూ వర్మీ కంపోస్తు, కోకో పీట్ కలుపుతూ ఉంటే మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది. కొత్త చిగుర్లు వచ్చి చక్కగా పువ్వులు పూస్తాయి.
గులాబీ మొక్కలకు ఉదయం వేళల్లోనే నీళ్లు పోయడం మంచిది. మరీ ఎక్కువగా కాకుండా మట్టి తడిసేలా నీళ్లు చిలకరిస్తే చాలు. ఆకులను నీటితో తడపకూడదు. అలా చేస్తే ఆకులకు తెగుళ్లు వచ్చే అవకాశం ఏర్పడుతుంది. వేసవిలో మట్టి పూర్తిగా ఎండిపోకుండా, వర్షాకాలంలో మొక్క మొదట్లో నీళ్లు నిలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
పువ్వులు రాలిన తరువాత ఒక అంగుళం మేర ఆ కొమ్మలను కత్తిరించాలి. అప్పుడే అక్కడి నుంచి కొత్త చిగుర్లు, మొగ్గలు వస్తాయి.
ఆర్నెల్లకోసారి గులాబీ మొక్కల మీద కొద్దిగా వేపనూనెను పిచికారీ చేస్తే చీమలు, ఇతర పురుగులు, చీడలు చేరకుండా ఉంటాయి. అలాగే మట్టిలో కొద్దిగా వేప పొడి కలపడం వల్ల వేర్లు సురక్షితంగా ఉంటాయి.
వాడేసిన కాఫీ లేదా టీ పొడి, కోడి గుడ్డు పెంకులు, ఉల్లిపాయ తొక్కలు, నిమ్మతొక్కలను మొక్క మొదట్లో ఉన్న మట్టిలో కలపడం వల్ల మంచి ప్రయోజనం కనిపిస్తుంది. ఒక గ్లాసు నీళ్లలో కొన్ని పాలు లేదా మజ్జిగ కలిపి అందించినా మొక్క ఆరోగ్యంగా పెరిగి చక్కగా గులాబీలు పూస్తాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
పీఎంఓ పేరిట మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్..!
Read Latest Telangana News And Telugu News