Share News

Cholesterol Risks and Management Tips: కొలస్ట్రాల్‌ మనకు మిత్రుడా శత్రువా

ABN , Publish Date - Sep 16 , 2025 | 02:46 AM

అతి కచ్చితంగా అనర్థదాయకమే! ఈ సూత్రం కొలస్ట్రాల్‌కూ వర్తిస్తుంది. తగు మోతాదుల్లో ఆరోగ్యానికి మేలు చేసే కొలస్ట్రాల్‌, మితిమీరితే కచ్చితంగా చేటు చేస్తుందంటున్నారు వైద్యులు....

Cholesterol Risks and Management Tips: కొలస్ట్రాల్‌ మనకు మిత్రుడా శత్రువా

అధిక కొలస్ట్రాల్‌

అతి కచ్చితంగా అనర్థదాయకమే! ఈ సూత్రం కొలస్ట్రాల్‌కూ వర్తిస్తుంది. తగు మోతాదుల్లో ఆరోగ్యానికి మేలు చేసే కొలస్ట్రాల్‌, మితిమీరితే కచ్చితంగా చేటు చేస్తుందంటున్నారు వైద్యులు. మరీ ముఖ్యంగా గుండెకు హాని కలగకుండా ఉండడం కోసం కొలెస్ట్రాల్‌ మోతాదును ఎలా పరిమితం చేసుకోవాలో ప్రముఖ హృద్రోగ నిపుణులు డాక్టర్‌ రమేష్‌ గూడపాటి ఇలా వివరిస్తున్నారు.

కొలస్ట్రాల్‌ అనగానే అందరికీ గుండెజబ్బులే గుర్తొస్తాయి. కానీ నిజానికి కొలస్ట్రాల్‌ మన శరీరానికి అత్యవసరమైన ముడి పదార్థం. శరీరంలో హార్మోన్‌ స్రావాల ఉత్పత్తిలో, కణ సంశ్లేషణలో కొవ్వులు కీలక పాత్ర పోషిస్తాయి. కానీ పరిమితిలో ఉన్నంత కాలం వీటితో ఎలాంటి హానీ ఉండదు. అయితే వీటిలో రకాలతో పాటు, మంచివీ, చెడ్డవీ కూడా ఉంటాయి. వాటి రకాలు, ఆరోగ్యకర మోతాదులు ఏవంటే...

టోటల్‌ కొలస్ట్రాల్‌: 200 (మిల్లీగ్రామ్స్‌ పర్‌ డెసిలీటర్‌) కంటే తక్కువ ఉండాలి

ఎల్‌డిఎల్‌ కొలస్ట్రాల్‌: ఇది చెడు కొలస్ట్రాల్‌. ఇది వంద లోపు ఉండాలి

హెచ్‌డిఎల్‌ కొలస్ట్రాల్‌: ఇది మంచి కొలస్ట్రాల్‌. 40 కంటే ఎక్కువ ఉండాలి

విఎల్‌డిఎల్‌ కొలస్ట్రాల్‌: 30 కంటే తక్కువ ఉండాలి

ట్రైగ్లిజరైడ్స్‌: 150 కంటే తక్కువ ఉండాలి. మంచి కొలస్ట్రాల్స్‌ కూడా వాటి పరిమితులు దాటకుండా చూసుకోవాలి. పరిమితి మించితే ఇవి కూడా శరీరానికి హాని చేస్తాయి.


ఒక్కొక్కరిలో ఒక్కోలా...

కొలస్ట్రాల్‌ మోతాదులు, వాటి ప్రభావం అందరికీ ఒకేలా ఉండదు. కొవ్వు మోతాదులు వ్యక్తుల ఆరోగ్య పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి. ఆరోగ్యవంతుల మోతాదులకూ, హృద్రోగులు, మధుమేహుల మోతాదులకూ తేడాలుంటాయి. మధుమేహుల మోతాదులు సాధారణ స్థాయుల కంటే తక్కువగా ఉండాలి. అలాగే గుండె రక్తనాళాల్లో అవరోధాలున్నవాళ్లలో కూడా కొలస్ట్రాల్‌ స్థాయులు మరింత తక్కువగా ఉండాలి. మధుమేహుల్లో ఎల్‌డిఎల్‌ 70 కంటే తక్కువ ఉండాలి. మధుమేహంతో పాటు గుండెజబ్బు కూడా ఉన్నప్పుడు, ఎల్‌డిఎల్‌ 55 కంటే తక్కువ ఉండాలి. గుండెజబ్బు మాత్రమే ఉన్న వాళ్లు, 70 కంటే తక్కువ ఉండేలా చూసుకోవాలి.

కొలస్ట్రాల్‌ మీద కన్నేసి...

మూడింట రెండొంతుల కొలస్ట్రాల్‌ మన శరీరంలోనే తయారవుతుంది. మూడింట ఒక వంతు కొలస్ట్రాల్‌ మాత్రమే మనం తీసుకునే ఆహారం, అనుసరించే అలవాట్ల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి శరీరంలోనే తయారయ్యే కొలస్ర్టాల్‌ మన జన్యు నిర్మాణం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి దాన్ని మనం నియంత్రించలేం! అయితే జన్యుపరమైన కారణాల వల్ల కొందర్లో సహజసిద్ధంగానే కొలస్ట్రాల్‌ ఎక్కువ మోతాదుల్లో ఉత్పత్తి అవుతూ ఉంటుంది. కాబట్టి శరీర దారుఢ్యం కలిగి ఉండి, మంచి ఆహారపుటలవాట్లను కలిగి ఉండి, ఆరోగ్యంగా ఉన్నవాళ్లు తమకు కొలస్ట్రాల్‌ ఎక్కువగా ఉండే అవకాశం లేదని అనుకోడానికి వీల్లేదు. అలాగే స్థూలకాయులై ఉండి, అనారోగ్యకరమైన జీవనవిధానాన్ని కొనసాగించే వాళ్లలో కొలస్ట్రాల్‌ సాధారణ మోతాదుల్లో ఉండే అవకాశాలూ ఉంటాయి. కొలస్ట్రాల్‌ మోతాదులు పెరిగినా ఎటువంటి లక్షణాలూ కనిపించవు కాబట్టి, జన్యు నిర్మాణం ఎలా ఉందో ఎవరికి వారు తెలుసుకునే వీలు లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ రక్త పరీక్షతో ఈ కొవ్వు మోతాదులను పరీక్షించుకుంటూ ఉండాలి. 30 ఏళ్లు పైబడిన వాళ్లు కొలస్ట్రాల్‌ను పరీక్షించుకుని, కొవ్వులన్నీ సరైన మోతాదుల్లో ఉండి, ఎటువంటి ఆరోగ్య సమస్యలూ లేనప్పుడు, ఐదేళ్లకోసారి కొలస్ట్రాల్‌ను పరీక్షించుకుంటూ ఉంటే సరిపోతుంది. 50 ఏళ్లకు చేరుకున్న తర్వాత ఏడాదికోసారి తప్పనిసరిగా పరీక్షించుకోవాలి. అలాగే మధుమేహం, అధిక రక్తపోటు ఉన్నవాళ్లు వయసుతో సంబంధం లేకుండా ఏడాదికోసారి పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. కుటుంబ చరిత్రలో గుండె జబ్బులున్నవాళ్లు రెట్టింపు అప్రమత్తంగా ఉంటూ, కొలస్ట్రాల్‌ మోతాదులను సాధారణ స్థాయుల కంటే తక్కువలో ఉంచుకోవాలి.


కొలస్ట్రాల్‌ ఎక్కువైతే?

కొవ్వు మోతాదులు మించితే రక్తనాళాల్లోని గోడల్లో పేరుకుపోయి, పూడికలు ఏర్పడతాయి. వీటి మీద రక్తపు గడ్డలు ఏర్పడి గుండెపోటుకు దారి తీయవచ్చు. ఇలా గుండె రక్తనాళాల్లో పూడికలతో గుండెపోటు వచ్చినట్టే మెదడు రక్తనాళాల్లో పూడికలు ఏర్పడితే బ్రెయిన్‌ స్ట్రోక్‌ వస్తుంది. ఇది పక్షవాతానికి దారి తీస్తుంది. అదే విధంగా మూత్రపిండాల రక్తనాళాల్లో పూడికలు ఏర్పడితే మూత్రపిండాల సామర్థ్యం కుంటుపడవచ్చు. ఈ ప్రదేశాల్లోనే కాకుండా శరీరంలోని ఏ రక్తనాళంలోనైనా కొలస్ట్రాల్‌ పూడికలు ఏర్పడవచ్చు. ఫలితంగా సంబంధిత అవయవానికి రక్తసరఫరా తగ్గి ఆ అవయవం దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి అధిక కొలస్ట్రాల్‌ను గుండెకు ముప్పు తెచ్చే అంశంగానే పరిగణించాలి. ప్రపంచవ్యాప్త మరణాలకు... గుండె, రక్తనాళాల సమస్యలే ప్రధాన కారణాలు. ప్రతి వంద మందిలో 30 మంది ఈ రెండు సమస్యల వల్లే ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. ఈ రెండు సమస్యలకు దారి తీసే ముఖ్యమైన ప్రమాద కారకాల్లో అధిక కొలస్ట్రాల్‌ ఒకటి.

నియంత్రణ ఇలా...

కొలస్ట్రాల్‌ను ఆరోగ్యకర మోతాదుల్లో ఉంచుకోవడం కోసం ఆరోగ్యకరమైన జీవనవిధానాన్ని కొనసాగించాలి. అందుకోసం...

ఆహారం: ఆహారంలో పండ్లు, కూరగాయలు, చిరుధాన్యాలు ఎక్కువగా, మటన్‌, బీఫ్‌, పోర్క్‌లు (రెడ్‌ మీట్‌) తక్కువగా ఉండేలా చూసుకోవాలి. అలాగే కొవ్వు తక్కువగా ఉండే పాల ఉత్పత్తులు తీసుకోవాలి. వెన్న, నెయ్యిలను పరిమితం చేసి, మీగడ తీసిన పెరుగు, కొవ్వు తొలగించిన పాలు తీసుకోవాలి. బాదం, పిస్తా లాంటి నట్స్‌ కూడా పరిమితంగా తీసుకోవాలి. వేపుళ్లు, తీపి పదార్థాలు తగ్గించుకోవాలి.

వ్యాయామం: రోజుకు కనీసం అరగంట చొప్పున, వారంలో ఐదు రోజుల పాటు వ్యాయామం చేయాలి. నడక, పరుగు, ఈత, సైకిల్‌ తొక్కడం... ఇలా ఏదో ఒక వ్యాయామం తప్పనిసరిగా చేయాలి.

దురలవాట్లు: ధూమపానం, మద్యపానం కొలస్ట్రాల్‌ మోతాదులను పెంచుతాయి. కాబట్టి వీటిని మానేయడం మంచిది.

అధిక బరువు: ఎత్తుకు తగిన బరువు ఉండేలా చూసుకోవాలి. అధిక బరువును ఐదు శాతం తగ్గించుకున్నా కొలస్ట్రాల్‌ మోతాదులు చాలా బాగా తగ్గుతాయి

పరీక్షలు: క్రమం తప్పక ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి.


సమర్థమైన మందులున్నాయి

అస్తవ్యస్థ జీవనశైలి వల్ల కొందర్లో కొలస్ట్రాల్‌ మోతాదులు పెరిగిపోవచ్చు. జన్యుపరమైన కారణాల వల్ల కూడా కొందర్లో ఈ పరిస్థితి తలెత్తవచ్చు. ఇలాంటి సందర్భాల్లో కొవ్వు మోతాదులను తగ్గించే మందులను వాడుకోవాలి. కొలస్ట్రాల్‌ను తగ్గించుకోవడం కోసం సాధారణంగా స్టాటిన్స్‌ మందులనే వాడుకుంటూ ఉంటాం. ఈ మందులు టోటల్‌ కొలస్ట్రాల్‌, హెచ్‌డిఎల్‌, ఎల్‌డిఎల్‌ కొలస్ట్రాల్స్‌ను తగ్గిస్తాయి. అయితే ట్రైగ్లిజరైడ్స్‌ను మాత్రమే తగ్గించే ఫిబ్రేడ్స్‌ మందులు కూడా ఉన్నాయి. కొలస్ట్రాల్‌, ట్రైగ్లిజరైడ్స్‌... ఈ రెండూ ఎక్కువగా ఉన్నప్పుడు, రెండు రకాల మందులూ కలిపి వాడుకోవాలి. ఎక్కువ శాతం కొలస్ట్రాల్‌ మన శరీరంలో రాత్రివేళ్లే తయారవుతుంది. కాబట్టి ఈ మందులను రాత్రి భోజనం తర్వాతే వేసుకోవాలి. ఈ మందులతో ఎల్‌డిఎల్‌ కొలస్ట్రాల్‌ 30 నుంచి 40 శాతానికి తగ్గుతుంది. ఇటీవలి కాలంలో ఇంజెక్షన్‌ రూపంలోని మందులు కూడా అందుబాటులోకొచ్చాయి. ఆరు నెలలకోసారి తీసుకునే ఇంజక్షన్‌తో పాటు రెండు వారాలకోసారి తీసుకునే ఇంజక్షన్లు కూడా ఉన్నాయి. వీటితో కొలస్ట్రాల్‌ మోతాదులను 60ు మేరకు తగ్గించుకునే వీలుంది. స్టాటిన్స్‌ వాడుతున్నప్పటికీ కొలస్ట్రాల్‌ స్థాయులు ఆశించిన స్థాయికి తగ్గకపోయినప్పుడు ప్రత్యామ్నాయంగా ఇంజక్షన్లను ఎంచుకోవచ్చు. అలాగే స్టాటిన్లతో ఒళ్లునొప్పులు దుష్ప్రభావాలు ఎదుర్కొనేవాళ్లు కూడా ఇంజక్షన్లను ఎంచుకోవచ్చు. కొందరికి స్టాటిన్లు ఒక్కటే సరిపోవు, అలాంటి వారికి కూడా ఇంజక్షన్లు అవసరమవుతాయి. అయితే స్టాటిన్స్‌తో పోల్చితే ఇంజక్షన్లు ఖరీదైనవి. నెలకోసారి తీసుకునే ఇంజక్షన్‌ ధర సుమారు లక్ష రూపాయలుంటే, రెండు వారాలకోసారి తీసుకునే ఇంజక్షన్‌ 20 వేలు ఉంటుంది. ఈ రోజు కొలస్ట్రాల్‌ను నియంత్రించుకుంటే, రేపటి కోసం గుండెను కాపాడుకోవచ్చు. సంతులన జీవనవిధానం, క్రమం తప్పని ఆరోగ్య పరీక్షలు, సమర్థమైన చికిత్సలతో కొలస్ట్రాల్‌ మోతాదులను అదుపులో ఉంచుకోవడం కచ్చితంగా సాధ్యమే!


000-navya.jpg

అపోహలు - వాస్తవాలు

అపోహ: సన్నగా, ఫిట్‌గా ఉంటే అధిక కొలస్ట్రాల్‌ సమస్య ఉండదు

వాస్తవం: ఇది నిజం కాదు. కొలస్ట్రాల్‌ మోతాదులు జన్యునిర్మాణం మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి ఆరోగ్యవంతుల్లో కూడా అధిక కొలస్ట్రాల్‌ ఉండే అవకాశం లేకపోలేదు

అపోహ: మందులతో కొలస్ర్టాల్‌ తగ్గితే మందులు వాడుకోవలసిన అవసరం లేదు

వాస్తవం: మధుమేహం, అధిక రక్తపోటు మాదిరిగానే కొలస్ట్రాల్‌ మందులు కూడా దీర్ఘకాలం వాడుకోవాల్సి ఉంటుంది. కాబట్టి కొలస్ట్రాల్‌ తగ్గిందని మందులు ఆపకూడదు. అలాగే వ్యాయామాలు, ఆహార నియమాలు కూడా ఆపడానికి వీల్లేదు. అవసరమైతే మందుల మోతాదు పెంచుకుందామనే ఆలోచనతో ఆహారనియమాలను ఉల్లంఘించకూడదు

అపోహ: అధిక కొలస్ట్రాల్‌ ఉన్నవాళ్లు గుడ్డు పచ్చ సొన తినకూడదు

వాస్తవం: ఒక రోజుకు ఒకట్రెండు గుడ్ల పచ్చసొనలు తినడం వల్ల ఎలాంటి సమస్యా ఉండదు

ఏ నూనె ఉత్తమం?

వంటనూనెల్లో మోనో అన్‌శాచురేటెడ్‌ కొవ్వులు, అన్‌ శాచురేటెడ్‌ కొవ్వులు, శాచురేటెడ్‌ కొవ్వులు ఉంటాయి. వీటిలో మొదటి రెండు కొవ్వులూ మన శరీరానికి మంచివి. శాచురేటెడ్‌ కొవ్వులు కొంత హానికరమైనవి. కాబట్టి శాచురేటెడ్‌ కొవ్వులు ఎక్కువగా ఉండే డాల్డా, పామాయిల్‌, కొబ్బరినూనెల వాడకం తగ్గించాలి. పొద్దుతిరుగుడు, నువ్వులు, వేరుసెనగ, రైస్‌ బ్రాన్‌, ఆలివ్‌ మొదలైన నూనెల్లో కొవ్వులన్నీ వివిధ నిష్పత్తుల్లో ఉంటాయి. కాబట్టి ప్రతి రెండు, మూడు నెలలకూ ఈ నూనెలను మార్చి వాడుకుంటూ ఉండాలి. వంటకు ఏ నూనె వాడుకుంటున్నాం? అనే దాని కంటే ఎంత నూనె వాడుకుంటున్నాం? అన్నది ముఖ్యం. ఒక వ్యక్తి నెలకు అర కిలో నూనె మాత్రమే వాడుకోవాలి.

డాక్టర్‌ రమేష్‌ గూడపాటి

సీనియర్‌ కన్సల్టెంట్‌ అండ్‌ హెచ్‌ఒడి, ఇంటర్వెన్షనల్‌ కార్డియాలజీ,

స్టార్‌ హాస్పిటల్స్‌, హైదరాబాద్‌.

ఈ వార్తలు కూడా చదవండి..

మహిళలకు రాజకీయ అవకాశాలతోనే అభివృద్ధి సాధ్యం: గవర్నర్ అబ్దుల్ నజీర్

భూముల ఆక్రమణకు చెక్.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

For AP News And Telugu News

Updated Date - Sep 16 , 2025 | 02:46 AM