Ganesh Vrata Story: గణేశ వ్రత కథ మర్మం ఇదీ
ABN , Publish Date - Aug 22 , 2025 | 01:57 AM
ఎన్నో ఏళ్ళ నుంచి వినాయక చవితి రోజున మనం పూజ చేసుకొని, చివర్లో వ్రత కథలు వింటున్నాం. కానీ ఆ వ్రత కథలను సరిగ్గా అర్థం చేసుకోలేదేమో అనిపిస్తుంది. ఆ కథల్లో తెలుసుకోదగిన అంతరార్థాలు అనేకం ఉన్నాయి...
పర్వదినం
ఎన్నో ఏళ్ళ నుంచి వినాయక చవితి రోజున మనం పూజ చేసుకొని, చివర్లో వ్రత కథలు వింటున్నాం. కానీ ఆ వ్రత కథలను సరిగ్గా అర్థం చేసుకోలేదేమో అనిపిస్తుంది. ఆ కథల్లో తెలుసుకోదగిన అంతరార్థాలు అనేకం ఉన్నాయి. ఆ విశేషాలన్నీ... లోతుగా పరిశీలించినప్పుడే తెలుస్తాయి.
గజుడు అనేవాడు ఒక రాక్షసుడు. అతను శివుడి కోసం తపస్సు చేశాడు. ఆ బేల శంకరుడు (అమాయకుడైనవాడు... బోళా శంకరుడు కాదు) ప్రత్యక్షమై... ‘‘ఏ వరం కావాలి?’’ అని అడిగాడు. అప్పుడు గజుడు తన రాక్షస బుద్ధితో ‘‘నువ్వు నా పొట్టలో లింగ రూపంలో ఉండిపోవాలి’’ అని కోరాడు. శివుడు సరేనని అలాగే ఉండిపోయాడు. పార్వతీదేవి తన భర్త జాడ గురించి విష్ణువును ఆశ్రయించింది. తన భర్తను తనకు ఇప్పించవలసిందిగా కోరింది. శ్రీహరి దేవతలందరినీ పిలిచి... తలొక వాద్యాన్నీ ఇచ్చాడు. ఒకరు వేణువు ఊదేవారుగా, మరొకరు మద్దెల మోగించేవారుగా, నందీశ్వరుణ్ణి నృత్యం చేసేవాడిగా... ఇలా వేషాలు వేయించాడు. గజుడు ఉండే నగరానికి వారిని తనతో పాటు తీసుకువెళ్ళి, నృత్య గీత వినోదాన్ని ప్రదర్శించాడు. గజుణ్ణి మెప్పించి... అతని ఉదరంలో ఉన్న శంకరుణ్ణి బయటకు తెచ్చుకున్నాడు. శంకరుడు కైలాసానికి వస్తూనే... తనను కైలాస ముఖద్వారం వద్ద నిరోధించిన వినాయకుడి శిరస్సును శూలంతో ఖండించాడు. దుఃఖించిన పార్వతికి ఆనందాన్ని కలిగిస్తూ... ఆ గజుడి శిరస్సుని తెచ్చి... శిరస్సులేని వినాయకుడికి అతికించాడు. ఆ కారణంగా... వినాయకుడి శిరస్సు గజాసురుడి శిరస్సే అవుతోంది కదా! దానికే మనం పూజ చేస్తున్నాం!
ఎన్నెన్నో సందేహాలు...
ఊరకే కథ విని అక్షతలను తలపైన ధరించడం కాదు, కథలో విశేషాన్ని గమనించాలి. గజుడు రాక్షసుడు. అతను తపస్సు చేస్తే... దేవతా విరోధి అయిన అతనికి శివుడు ప్రత్యక్షం కావడం దేనికి? పోనీ ప్రత్యక్షమైనా... తన ఉదరంలో ఆత్మ లింగరూపంలో ఉండిపోవాలని ఆ రాక్షసుడు కోరినంత మాత్రాన... దానికి అంగీకరించడం దేనికి? ‘లయం’ అనే బాధ్యతను నిర్వర్తించేవాడు శివుడు. మరి ఆ బాధ్యతను మరెవరికైనా అప్పగించాలి కదా! భార్యకు కూడా ఒక్క మాట చెప్పకుండా... ఎంతకాలం గజుడి ఉదరంలో ఉండాలని కనీసం అడగనక్కరలేదా? తనకు లయం అనే బాధ్యతను అప్పగించిన ఆది పరాశక్తికైనా చెప్పి, అనుమతి పొందనక్కరలేదా? పైగా... లోకాలన్నిటినీ పరిపాలించే పార్వతీదేవికి తన భర్త జాడ తెలియలేదా? విష్ణువును ఆశ్రయించి ఆయనను ఇప్పించవలసిందిగా ఎందుకు కోరాలి? సరే... విష్ణువు సుదర్శన చక్రాన్ని పంపి ఉంటే... గజరాజు తల తెగి, శంకరుడు బయటకు రాగలిగేవాడు కదా! దేవతలందరితోనూ శ్రీహరి విచిత్ర వేషాలు వేయించడం ఏమిటి? వాళ్ళతో తనూ వెళ్ళడం ఏమిటి? నృత్యోత్సవం ఏమిటి? ఇలా ఆలోచించే కొద్దీ అసంబద్ధంగా అనిపించడం లేదూ? ఈ కథను తరచి తరచి చూస్తే... లోపలి విషయం అర్థమవుతుంది.
గజుడి తపశ్శక్తి...
ఆ రాక్షసుడి పేరు గజుడు కాదు గ-జుడు. ‘గ’ అంటే గతించడం. ‘జ’ అంటే జన్మించడం. చాలామంది చావడం, పుట్టడం అనే జనన మరణ చక్రంలో పడిపోతూ ఉంటే... ఇతనికి తన జన్మను శాశ్వతం చేసుకోవాలని, పునర్జన్మ లేకుండా చేసుకోవాలని ఆలోచన కలిగింది. దాంతో అతను శంకరుడి గురించి తపస్సు చేశాడు. శంకరుడు అతని తపశ్శక్తి స్థాయిని గమనించాడు. తాను ప్రత్యక్షం అయి తీరాల్సినంత తపస్సు చేశాడని గుర్తించాడు. ఆయన పరమ ధర్మమూర్తి కాబట్టి... ఆత్మలింగ రూపంలో తన ఉదరంలో ఉండాలని గజుడు కోరగానే... అతని తపశ్శక్తి స్థాయి కారణంగా... తప్పనిసరి పరిస్థితుల్లో గజుడి ఉదరంలో ఉండిపోయాడు. శంకరుడు లింగరూపంలో తన ఉదరంలో ఉండిపోగానే... ఆ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకున్న గజుడు నిత్యం రుద్రాభిషేకాన్ని, మంత్ర సాధనను మరింత తీవ్ర నిష్ఠతో కొనసాగించాడు. పార్వతీదేవి ప్రార్థన మేరకు... ‘శంకరుడు ఎక్కడ ఉన్నాడా?’ అని శ్రీహరి దివ్య దృష్టితో గమనించి నివ్వెరపోయాడు. గజుడిది తాను సుదర్శనాన్ని పంపినా తల తెగిపడనంత తపశ్శక్తి అని తెలుసుకున్నాడు. అంతేకాదు... అంతకుముందు శంకరుణ్ణి మాత్రమే దర్శించగలిగే తపశ్శక్తి కాస్తా... శంకరుడు అతని ఉదరంలో ఉన్న సమయంలో చేసిన రుద్రాభిషేక, మంత్ర సాధనల కారణంగా దేవతలందరినీ దర్శించగలిగే స్థాయికి పెరిగిందని శ్రీహరి గ్రహించాడు. అందుకే దేవతలందరినీ వాద్యకారుల్ని చేశాడు. జన్మలక్షణం ప్రకారం గజుడు అహంకారి. తమోగుణం ఉండేవాడు. కాబట్టి అతణ్ణి ఎదిరించి, భయపెట్టడం వల్ల ప్రయోజనం ఉండదని, అతణ్ణి ఆనందపరచి, ఆ ఆనంద సమయంలో శంకరుణ్ణి బయటకు రప్పించాలని ప్రణాళిక వేశాడు. దేవతలందరూ అత్యద్భుతంగా నృత్య గీత వాద్య వినోదాల్ని ప్రదర్శించగానే... ఆ ఆనందంలో ఒళ్ళు మరచిన గజుడు ఏ వరం కావాలని అడిగాడు. విష్ణువు కోరాడు. ఆ తరువాత నందీశ్వరుడు తన కొమ్ములతో గజుడి ఉదరాన్ని చీల్చి... శంకరుణ్ణి బయటకు తెచ్చి, తన మీద ఎక్కించుకున్నాడు, కైలాసానికి చేర్చాడు. చివరకు గజుని తల వినాయకుడి ముఖం (గజముఖం) అయింది.
ఆ భావన కలగాలి...
శ్రీహరిని పార్వతి ఆశ్రయించడానికి కారణం... సృష్టి స్థితి లయాలనే మూడిటిలో స్థితి (దేవతా సమూహానికి ఏదైనా రక్షణ) విషయంలో ఇబ్బంది ఏర్పడితే... ఆశ్రయించాల్సింది శ్రీహరినే కాబట్టి! ఇక... కార్యాలయాల్లో అహంకారి, నిరంకుశుడు, పెద్దలతో బాగా పరిచయాలు ఉన్నవాడు మనకు అధికారిగా (అధిక=గొప్ప, అరి= శత్రువులా ప్రతిదానికీ ‘కాదు, కూడదు, కుదరదు’ అంటూ ఉండేవాడు) ఉంటే అతణ్ణి తోవలోకి తెచ్చుకొనే విధానాన్ని ఈ కథ చెబుతోంది. అతణ్ణి ఎదిరించి, బెదిరిస్తూ, లేఖలను పంపి, పై అధికారులకు చెప్పి ఏమాత్రమూ తోవలోకి తెచ్చుకోలేమట! అతణ్ణి విపరీతంగా ఆనందించేలా పొగిడి లేదా ఉబ్బిపోయేలా చేసి మాత్రమే కార్యసాధన చేసుకోగలమట! ఈ కథలో ఉన్న మరో అంతరార్థం ఇది. గజుడి తపశ్శక్తి ఎంతటిదంటే... తన ఉదరంలో ఉన్న శివలింగాన్ని ఆరాధిస్తున్న కారణంగా... గజాసురపురంలో ఉన్నవారందరికీ శివదర్శనంతోపాటు సర్వదేవతా దర్శనాన్ని కూడా చేయించగలిగాడు. కానీ అందరు దేవతల దర్శనం అయినప్పటికీ... అమ్మవారి దర్శనం మాత్రం అతనికి కాలేదు. ఎందుకంటే... శివారాధన వల్ల శివుడు వశుడు కావచ్చు, శ్రీహరితో సహా మొత్తం దేవతాగణం లొంగిపోవచ్చు. కానీ పార్వతీదేవి దర్శనానికి ఆ మాత్రపు తపస్సు సరిపోదు. ఎంతో చిక్కగా ఉండే చక్కటి కథ ఇది. వినాయకునికి నవరాత్రుల పేరిట ఉత్సవాలు చేస్తూ... తొమ్మిదిరోజుల పాటు తొమ్మిది రహస్యాలు తెలుసుకోవాలనేది పెద్దల మాట.
డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు,
9866700425
గజాసురుడు మాత్రమే కాదు... మనం అందరం జనన మరణ చక్రంలో తిరుగాడుతూ ఉండే లక్షణం ఉన్న వారిమే. రాక్షసుడైన అతనికి... తన జీవిత లక్ష్యం ఏమిటనే పరివర్తన కలిగినట్టు... మనకు కూడా పుట్టడం, చావడం అనే చక్రంలో ఉండిపోకుండా... అంతకన్నా ఉన్నత స్థితి కలిగేలా ఆధ్యాత్మికంగా ఎదగాలనే భావన కలగాలి.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎమ్మెల్యేలు ఇలా చేస్తే ఎలా.. సీఎం చంద్రబాబు ఫైర్
టీటీడీపై వైసీపీ బురద జల్లుతోంది.. జ్యోతుల నెహ్రూ ధ్వజం
Read Latest AP News and National News