Share News

Hidden Dangers at Home: ఇంట్లో ప్రమాదాలు

ABN , Publish Date - Sep 02 , 2025 | 04:05 AM

అన్నిటికంటే ఇల్లే పదిలం అనుకుంటాం. కానీ ఇంట్లో కూడా విషాలు, హాని కారకాలు పలు రూపాల్లో దాగి ఉంటాయి. ఆరోగ్యాన్ని కుదేలు చేసే ఆ హాని కారకాలను కనిపెట్టి, వాటిని తొలగించుకుందాం....

Hidden Dangers at Home: ఇంట్లో ప్రమాదాలు

అప్రమత్తం

అన్నిటికంటే ఇల్లే పదిలం అనుకుంటాం. కానీ ఇంట్లో కూడా విషాలు, హాని కారకాలు పలు రూపాల్లో దాగి ఉంటాయి. ఆరోగ్యాన్ని కుదేలు చేసే ఆ హాని కారకాలను కనిపెట్టి, వాటిని తొలగించుకుందాం!

పాడైన వంటపాత్రలు

నూనె వాడకం తగ్గుతుందనే నమ్మకంతో నాన్‌ స్టిక్‌ వంటపాత్రలను వాడుకుంటూ ఉంటాం. అయితే దెబ్బతిన్న, పైపొర తొలగిపోయిన నాన్‌స్టిక్‌ వంటపాత్రల వాడకం ప్రమాదకరం. ఇలా పైపొర తొలగిపోయిన ప్రదేశాల నుంచి పాలీఫ్లోరోఆల్కైల్‌ పదార్థాలు విడుదలై పునరుత్పత్తి సమస్యలతో పాటు తీవ్రమైన ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడతాయి. కాబట్టి నాన్‌ స్టిక్‌ కుక్‌వేర్‌ను స్టీలు లేదా చేత ఇనుము పాత్రలతో భర్తీ చేయాలి. సింథటిక్‌ పైపొర ఉండదు కాబట్టి ఆ పాత్రలు వంటకు సురక్షితమైనవి.

సింథటిక్‌ చక్కెరలు

డైట్‌ సోడాలు, షుగర్‌ ఫ్రీ పదార్థాలు, ఇతరత్రా తక్కువ క్యాలరీలున్న పదార్థాలన్నిట్లో సింథటిక్‌ చక్కెరలుంటాయి. వీటితో పదార్థాల్లోని క్యాలరీలు తగ్గే మాట వాస్తవమే అయినా, వీటి దుష్ప్రభావాలు ఎంతో తీవ్రంగా ఉంటాయి. దీర్ఘకాలం పాటు వీటిని తీసుకోవడం వల్ల మెటబాలిక్‌ సమస్యలతో పాటు, మఽధుమేహం, గుండెజబ్బుల ముప్పు పెరిగే ప్రమాదం ఉంటుంది. అలాగే సింథటిక్‌ చక్కెరలతో పేగుల్లోని మంచి బ్యాక్టీరియా దెబ్బతింటుంది. ఈ చక్కెరలు శరీరంలో వాపు, నొప్పులకు కారణమవుతాయి. శరీరం శక్తిని ఖర్చు చేసే వేగాన్ని కుంటుపరుస్తాయి. కాబట్టి సింథటిక్‌ చక్కెరలతో తయారైన పదార్థాలకు బదులుగా సహజసిద్ధ చక్కెరలతో కూడిన పండ్లను తింటూ ఉండాలి.

ప్లాస్టిక్‌ సీసాలు

మినరల్‌ వాటర్‌ బాటిల్‌ ఖాళీ అయ్యాక, దాన్లోనే నీళ్లు నింపి వాడుకునే వాళ్లున్నారు. కానీ ఈ అలవాటు అత్యంత ప్రమాదకరం. మరీ ముఖ్యంగా వాటిని వేడి జనించే పరిసరాల్లో ఉంచడం వల్ల ముప్పు మరింత పెరుగుతుంది. విషాలు ప్లాస్టిక్‌ సీసాలోని నీళ్లలో కలిసిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ సీసాల్లోని రసాయనాలు హార్మోన్‌ వ్యవస్థను అస్తవ్యస్థం చేస్తాయి. కాబట్టి వీటికి బదులుగా స్టీలు లేదా గాజు సీసాల్లో నీళ్లు నిల్వ చేసుకోవడం సురక్షితం.


ప్రాసెస్డ్‌ ఫుడ్స్‌

ఆకట్టుకునే రంగులతో కూడిన ప్యాకెట్లలో కృత్రిమ రంగులు, నిల్వ పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని అదే పనిగా తినడం వల్ల ఊబకాయం, మధుమేహం, గుండెజబ్బులు పెరుగుతాయి. పోషకవిలువలు అత్యల్పంగా ఉండే వీటిలో చక్కెరలు, సోడియం ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటికి ఇంట్లో స్థానం కల్పించకూడదు

సెంటెడ్‌ క్యాండిల్స్‌

పరిసరాలను పరిమళభరితం చేసే సువాసన వెదజల్లే క్యాండిల్స్‌ వాయు కాలుష్యాన్ని పెంచుతాయి. వీటిలోని థాలేట్స్‌, శ్వాస సమస్యలను పెంచుతాయి. కొవ్వొత్తులతో ఇంటి ఆకర్షణను పెంచాలనుకుంటే, సెంటెడ్‌ క్యాండిల్స్‌కు బదులుగా తేనెటీగల మైనం, లేదా సోయాతో తయారైన కొవ్వొత్తులనే వాడుకోవాలి.

స్నానం సబ్బులు

యాంటీబ్యాక్టీరియల్‌ సబ్బుల్లో, ఇల్లు శుభ్రం చేసే ఉత్పత్తుల్లో ట్రైక్లోసాన్‌ అనే ప్రమాదకరమైన పదార్థం ఉంటుంది. ఇది హార్మోన్‌ వ్యవస్థను కుదిపేయడంతో పాటు, శరీరంలో యాంటీబయాటిక్‌ రెసిస్టెన్స్‌ను పెంచుతుంది. కాబట్టి స్నానానికి సాధారణ సబ్బులనే ఎంచుకోవాలి. ఘాటు వాసనలు వెదజల్లే సబ్బులు, ఇల్లు శుభ్రం చేసే ఉత్పత్తుల వాడకం మానేయాలి.

సర్ఫ్‌లు, బట్టల సబ్బులు

సువానసలు వెదజల్లే డిటర్జెంట్‌ పౌడర్లలో అనేక రసాయనాలు, విషాలు ఉంటాయి. ఇవి ఉబ్బసం, అలర్జీలు, హార్మోన్ల హెచ్చుతగ్గులకు దారి తీస్తాయి. కాబట్టి సువాసనలు వెదజల్లని డిటర్జెంట్‌ పౌడర్లు, సబ్బులు వాడుకోవాలి.

ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీపై కమిటీ ఏర్పాటు

హరీష్ రావును టార్గెట్ చేసింది అందుకేనా..?

For More AP News And Telugu News

Updated Date - Sep 02 , 2025 | 04:05 AM