Share News

శరణార్థులకు ఆమె భరోసా

ABN , Publish Date - Mar 12 , 2025 | 06:02 AM

ఊహ తెలియకముందే శరణార్థిగా భారతదేశంలో అడుగుపెట్టారు జగదీశ్వరి శశిధరన్‌. అనేక ఆంక్షలు, పరిమితుల మధ్య తన కలను నెరవేర్చుకోవడానికి...

శరణార్థులకు ఆమె భరోసా

ఊహ తెలియకముందే శరణార్థిగా భారతదేశంలో అడుగుపెట్టారు జగదీశ్వరి శశిధరన్‌. అనేక ఆంక్షలు, పరిమితుల మధ్య తన కలను నెరవేర్చుకోవడానికి పోరాటం సాగించారు. ఇప్పుడు శ్రీలంక కాందిశీకుల పిల్లలకు మెరుగైన జీవితాలు కల్పించడానికి కృషి చేస్తున్నారు.

‘‘మాతృభూమి స్వర్గం లాంటిదంటారు. కానీ నేను పుట్టిన దేశం అంతర్యుద్ధంతో ప్రత్యక్ష నరకంగా మారిపోయింది. దాంతో ‘ఎక్కడో ఒక చోట బతికుంటే చాలు’ అనుకుంటూ ఎన్నో కుటుంబాలు ప్రాణాలను అరచేత పట్టుకొని పరుగులు తీశాయి. అలాంటి కుటుంబాల్లో మాదీ ఒకటి. మా స్వస్థలం శ్రీలంకలోని మన్నార్‌ జిల్లా పేసాలై. మా నాన్న పేరు చిదంబరం, అమ్మ భువనేశ్వరి. వారికి అక్కడ సొంత ఇల్లు, స్థిరమైన జీవనోపాధి ఉండేవి. 1990ల్లో అంతర్యుద్ధం, ఘర్షణలతో శ్రీలంక అట్టుడికిపోయింది. తమిళ సంతతికి చెందిన వారి మీద దాడులు తీవ్రతరమయ్యాయి. దాంతో నా తల్లితండ్రులు అన్నీ వదిలేసి... కట్టుబట్టలతో ఒక నాటు పడవ మీద భారతదేశానికి శరణార్థులుగా వచ్చారు. వారి దగ్గర పాస్‌పోర్ట్‌ లాంటి పత్రాలేవీ లేవు. వారితో పాటు ఇదే విధంగా శ్రీలంకను కొన్ని వేలమంది విడిచిపెట్టారు. రామేశ్వరం చేరుకున్నప్పుడు... సినీ నటుడు విజయకాంత్‌ వారందరినీ పరామర్శించి, భోజన సౌకర్యం కల్పించినట్టు నా తల్లితండ్రులు గుర్తు చేసుకొనేవారు. ఆ తరువాత అధికారులు వారిని మదురైకి సమీపంలో ఉన్న ‘అనైయూర్‌ శరణార్థ శిబిరాని’కి తరలించారు. అప్పటికి నా వయసు ఎనిమిది నెలలు. శ్రీలంకలో పరిస్థితులు చక్కబడిన తరువాత మళ్ళీ అక్కడికి వెళ్ళాలని అమ్మా నాన్నా అనుకున్నారు. కానీ ముప్ఫయ్యేళ్ళు దాటినా అది జరగలేదు.


  • సీటు ఇచ్చేది లేదన్నారు...

శరణార్థ శిబిరంలో తలదాచుకున్నవారికి ఎన్నో ఆంక్షలు, నిఘా ఉంటాయి. ఎక్కడికి వెళ్తున్నదీ నిర్వాహకులకు, అధికారులకు చెప్పాలి. నిర్ణీత సమయం లోపల తిరిగి శిబిరానికి చేరుకోవాలి. బతుకుతెరువు కోసం నా తల్లితండ్రులు భవన నిర్మాణ పనివారుగా మారారు. అప్పటి నుంచి మేము ‘కేరాఫ్‌ అనైయూర్‌ రెఫ్యూజీ క్యాంప్‌’గా మిగిలిపోయాం. చిన్న వయసులో నాకు చాలా కలలుండేవి. బాగా చదువుకోవాలనీ, మంచి డ్యాన్సర్‌నీ, నటినీ కావాలనీ... ఇలా ఎన్నో. ఇరుకైన ఇళ్ళు, చాలీచాలని వసతుల మధ్య బతుకుతున్నా నా కలల్ని ఎప్పుడూ చంపుకోలేదు. వాటిని నెరవేర్చుకోవడం కోసం కష్టపడ్డాను. అయితే ఈ క్రమంలో... నేను కాందిశీక కుటుంబానికి చెందినదాన్ని కావడంతో చాలా ఇబ్బందులు పడ్డాను. మదురై ప్రభుత్వ సంగీత కళాశాలలో... నృత్యంలో డిప్లమా చేయడానికి దరఖాస్తు చేసుకున్నాను. సీటు కూడా వచ్చింది. కానీ కమ్యూనిటీ సర్టిఫికెట్‌ లేకపోవడంతో అడ్మిషన్‌ ఇవ్వలేమని నిర్వాహకులు చెప్పారు. ఏడుస్తూ బయటకు వెళ్తున్న నన్ను కాలేజీ ఫ్యాకల్టీ సభ్యురాలు తాంజై భవానీమణి గమనించి పిలిచారు. ‘‘విద్యకు ఆంక్షలేమిటి?’’ అని కాలేజీవారిని నిలదీసి, నాకు సీటు ఇప్పించారు. ఆ తరువాత ఎన్నో ప్రదర్శనల్లో నా నైపుణ్యాన్ని ప్రదర్శించడంతో... నాడు అభ్యంతరపెట్టినవారే ‘‘నువ్వు మా కాలేజీకి గర్వకారణం’’ అని మెచ్చుకున్నారు. చదువు పూర్తి కాగానే పలు సంస్థల్లో పార్ట్‌-టైమ్‌ లెక్చరర్‌గా పని చేశాను. మరోవైపు ప్రసిద్ధ తమిళ గాయని డాక్టర్‌ విజయలక్ష్మీ నవనీత కృష్ణన్‌ బృందంలో పదహారేళ్ళుగా దేశంలోని పలుచోట్ల ప్రదర్శనలు ఇచ్చాను. విదేశాల్లో కూడా ఎన్నో అవకాశాలు, ఆహ్వానాలు వచ్చాయి. కానీ శరణార్థినైన నాకు పాస్‌పోర్ట్‌ లేకపోవడంతో వాటన్నిటినీ వదులుకోవాల్సి వచ్చింది. 2010లో సొంతంగా ఒక డ్యాన్స్‌ స్కూల్‌ ఏర్పాటు చేశాను. మరోవైపు వివిధ పాఠశాలల్లో డ్యాన్స్‌టీచర్‌గా ఉన్నాను. ఏడేళ్ళుగా పలువురు పిల్లలకు ఉచిత శిక్షణ అందిస్తున్నాను.


  • అదే మా కల...

భర్త, ఒక కుమారుడి బాధ్యతలు, నా ప్రదర్శనలు, బోధన... వీటన్నిటితో బిజీగా ఉన్న నాకు కొవిడ్‌ సమయం కావలసినంత తీరిక కల్పించింది. అప్పటివరకూ మా శరణార్థ శిబిరంలోని పిల్లలకు తరచుగా వివిధ రూపాల్లో సాయం చేస్తున్నా... పూర్తి స్థాయి ప్రణాళికతో ముందుకి సాగే అవకాశాన్ని అది కలిగించింది. వారిలో చాలామందికి ఎదగాలనే ఆశ ఉన్నా కాందిశీకులనే ముద్ర వెంటాడుతూనే ఉంది. శరణార్థులను అక్రమ చొరబాటుదారులుగా చూసే ధోరణి కూడా ఎక్కువ కావడంతో... సమాజంలో అవమానాలను, అసమానతలను ఎదుర్కోవాల్సి వస్తోంది. చక్కగా చదువుకోడానికి అవకాశం కల్పిస్తే వారిలో ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. అందుకే నా ప్రదర్శనల ద్వారా వచ్చే డబ్బు, కొందరు స్పాన్సర్ల సహకారంతో... ప్రతిభ, ఆసక్తి ఉన్న పిల్లల చదువుకు సాయం చెయ్యడం ప్రారంభించాను. మొదట ఒకరు, తరువాత మరొకరు... ఇలా అనైయూర్‌ క్యాంప్‌ నుంచి 15 మందికి పైగా పిల్లలు ఉన్నత చదువుల్ని పూర్తి చేసి, ఉద్యోగాలు సంపాదించుకున్నారు. వారిలో ఒకరు సివిల్‌ ఇంజనీర్‌. ఒక అమ్మాయి అగ్రికల్చర్‌ బిఎస్సీ ఫైనలియర్‌లో చదువుతోంది. మరికొందరు పిల్లలు కూడా సాయం పొందుతున్నారు. ఒక బాలుడికి బోన్‌ మారో మార్పిడి అవసరం అయింది. నా అభ్యర్థన మేరకు మాజీ ఐఎఎస్‌ ఒకరు ముందుకొచ్చి, ఆ ఖర్చు భరించారు. ఆ ఆపరేషన్‌ విజయవంతమైంది. ఆ రోజు నేను పొందిన ఆనందాన్ని నా జీవితంలో ఎన్నడూ అనుభూతి చెందలేదు. ఇక, కొందరు వితంతువులకు కుట్టు మిషన్లు సమకూర్చి వారి జీవనోపాధికి దోహదం చేశాను. అలాగే... ఇతర అవసరాల్లో ఉన్నవారిని కూడా ఆదుకోవడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తున్నాను. వీలున్నంతవరకూ దీన్ని కొనసాగిస్తాను. ఎప్పుడో ఈ దేశానికి కాందిశీకులుగా వచ్చాం. మాకు భద్రతతో సహా ప్రతిదీ ఈ దేశం ఇచ్చింది. అందుకే భారతీయ పౌరులుగా మరణించాలనేది మా కల. పరిస్థితులు క్రమంగా మారి, నా కుమారుడితో సహా తరువాతి తరం పిల్లలకైనా భారతీయ పౌరసత్వం లభించాలని, శరణార్థి శిబిరాల్లో కాకుండా హుందాతనంతో గౌరవంగా జీవించే అవకాశం దక్కాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నాను.’’

మరిన్నీ తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: వైసీపీ భూ కుంభకోణాన్ని ఎండగట్టిన ఎంపీ

Also Read: నా చేతిలో కత్తి పెట్టి..

Also Read: అందంగా ఉందని ప్రియురాలిని చంపేశాడు..

For AndhraPradesh News And Telugu News

Updated Date - Mar 12 , 2025 | 06:02 AM