Hamsikas Inspirational Journey: మమ్మల్ని అలా చూడొద్దు
ABN , Publish Date - Jul 07 , 2025 | 04:45 AM
అందరు పిల్లాల్లానే బాల్యం ఆడుతూ పాడుతూ సాగిపోయేది. కానీ... వయసు పెరుగుతున్నకొద్దీ చూపు మందగించింది. దీంతో అన్నింటా వెనకడుగు... అది ఆమెను కుంగదీసింది. అయితే తల్లిదండ్రుల...
సంకల్పం
అందరు పిల్లాల్లానే బాల్యం ఆడుతూ పాడుతూ సాగిపోయేది. కానీ... వయసు పెరుగుతున్నకొద్దీ చూపు మందగించింది. దీంతో అన్నింటా వెనకడుగు... అది ఆమెను కుంగదీసింది. అయితే తల్లిదండ్రుల సహకారంతో ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకుంది. అంధుల క్రికెట్‌తో పాటు పారా క్రీడల్లోనూ రాణిస్తోంది.. సిద్ధిగాడ్రి హంసిక. తన ఈ ప్రయాణంలో ఎదురైన సవాళ్లు, సమస్యలు, వాటిని అధిగమించిన తీరును ఆమె ‘నవ్య’తో పంచుకుంది.
‘‘ఎన్నో ఆశలు.. అందమైన ఊహలు.. జీవితంలో ఏవేవో సాధించాలని కలలు కన్నాను. కానీ అవన్నీ కల్లలయ్యాయి. ఇకపై నేను మునుపటిలా చూడలేనని వైద్యులు చెప్పడంతో ఎంతో కుమిలిపోయా. కానీ అంతటితోనే ఆగిపోవాలని అనుకోలేదు. నాలాగా చూపు లేనివారు ఎందరో అద్భుతాలు చేస్తున్నారు. అలాంటివారి స్ఫూర్తితో అడుగు ముందుకు వేశాను. మాది దిగువ మధ్య తరగతి కుటుంబం. నాన్న ప్రభు... పాలకోవా తదితర పాల ఉత్పత్తులు విక్రయించి కుటుంబాన్ని పోషిస్తారు. అమ్మ గాయత్రి... నాన్నకు చేదోడు వాదోడుగా ఉంటోంది. ముగ్గురు సంతానంలో నేనే పెద్దదాన్ని. చెల్లి హాసిని, తమ్ముడు అర్జున్ నాకు అన్ని విషయాల్లో తోడుగా ఉంటారు. సికింద్రాబాద్ పద్మారావునగర్‌లో ఒక చిన్న ఇంట్లో అద్దెకు ఉంటున్నాం. నాలుగో తరగతి వరకు నేను చదువు, క్రీడల్లో ముందుండేదాన్ని. పాఠశాలలో, ఇంటర్ స్కూల్ పోటీల్లో... పాల్గొన్న ప్రతి ఈవెంట్‌లో ఫస్ట్ వచ్చేదాన్ని. ఆ తర్వాత నాకున్న కంటి చూపు సమస్యతో అన్నింట్లో వెనకబడడం మొదలైంది. తొలుత సాధారణంగా వచ్చే చూపు మాంద్యం అని వైద్యులు ఇచ్చిన కళ్లద్దాలు ఉపయోగించా. నాకు 13 ఏళ్లు వచ్చేసరికి సమస్య మరీ ఎక్కువ కావడంతో హైపవర్ లెన్స్ వాడాను. అవి పెట్టుకున్నాక మైగ్రేన్ నొప్పి, కళ్లల్లో నుంచి విపరీతంగా నీళ్లు కారడంతో ఆ కళ్లద్దాలు పక్కన పెట్టేశాను.
ఆస్పత్రికి వెళితే..
కొందరి సలహా మేరకు సరోజినీ దేవి కంటి ఆస్పత్రికి అమ్మా నాన్న నన్ను తీసుకెళ్లారు. కళ్లలోని రెటీనాలో చుక్కలు ఉండడంతో ఒక అడుగు దూరానికి మించి ఏమీ చూడలేవని వైద్యులు చెప్పారు. అది విని నా గుండె ఆగినంత పనైంది. మా కుటుంబం షాక్‌లోకి వెళ్లిపోయింది. ఇది చాలా అరుదైన సమస్య అని, దీనికి చికిత్స లేదని వైద్యులు చెప్పారు. నాకు 80 శాతం పైగా అంధత్వం ఉందని సర్టిఫికెట్ ఇచ్చారు. ఆయుర్వేదంతో పాటు పలు రకాల వైద్యం చేయించుకున్నా ఫలితం కనిపించలేదు.
నేను ఏదైనా ఒక వస్తువునే చూడగలను. దాని చుట్టూ ఉన్నవి అలికినట్టు కనపడతాయి. బాల్యంలో నా సవుస్యను ఎవరికీ చెప్పుకోలేకపోయాను. ఒకసారి స్కూల్‌లో పరుగెడుతున్నప్పుడు మధ్యలో స్తంభం అడ్డుంటే నాకు కనిపించక.. దాన్ని ఢీకొట్టా. ముక్కు నుంచి తీవ్ర రక్తస్రావమైంది. నాకు క్రీడలంటే ఇష్టమున్నా అప్పటి నుంచి ఆటలకు దూరమయ్యా. చదువులోనూ వెనకపడ్డా. బోర్డు పైన అక్షరాలు సరిగ్గా కనిపించక, నోట్స్ రాయలేకపోయేదాన్ని. విన్న పాఠాలనే నెమరేసుకుని, అవే పరీక్షల్లో రాశాను. మంచి మార్కులు రానివారిని వెనుక బెంచీల్లో కూర్చొబెట్టేవారు. ఎందుకు సరిగ్గా చదవడం లేదని టీచర్లు తిట్టేవారు. నాకు కళ్లజోడు పెట్టుకున్నా ఏం కనిపించదని తోటి విద్యార్థులు ఎగతాళి చేసేవారు. ఎనిమిదో తరగతికి వచ్చాక కానీ నా కంటి సమస్య గురించి ఉపాధ్యాయులకు తెలియలేదు. తర్వాత స్కూల్‌లో ఉపాధ్యాయులు నా గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.

అనుకోని మలుపు..
నాకున్న అంధత్వంతో సాధారణ స్కూల్‌లో చదవడం కష్టమనిపించి తొమ్మిదో తరగతి తర్వాత బేగంపేటలోని దేవనార్ అంధుల పాఠశాలలో చేరా. అంతవరకు ఒక తరహా విద్యా విధానానికి అలవాటు పడిన నాకు, ఈ స్కూల్‌లో అంతా కొత్తగా అనిపించింది. దాంతో ఇంటర్మీడియేట్‌కు వచ్చేసరికి మళ్లీ సాధారణ కాలేజ్‌లో చేరి ఎంఈసీ పూర్తి చేశా. ఆ తర్వాత చినజీయార్ స్వామి నేత్ర విద్యాలయ ట్రస్టులో బీకాం కంప్యూటర్స్ చదివా. ఇక్కడకు వచ్చాక నా జీవితం అనుకోని మలుపు తిరిగింది. స్వామివారి సహకారంతో క్రికెట్, పవర్ లిఫ్టింగ్‌ల్లో శిక్షణ తీసుకోవడం ప్రారంభించా.
టీమిండియా ప్రొబబుల్స్‌లో..
నాకు క్రికెట్ అంటే బాగా ఇష్టం. నేత్ర విద్యాలయలో చేరిన తర్వాత క్రికెట్ అంటే ఆసక్తి ఉన్నవారితో కలిసి టీమ్ తయారు చేశా. నేను పేస్ ఆల్‌రౌండర్‌ని. ఎడమ చేతివాటం బౌలర్, కుడి చేతివాటం బ్యాటర్‌ని. రాష్ట్ర స్థాయిలో వివిధ అంధ పాఠశాల జట్లతో తలపడ్డాం. మా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాను. 2023లో జాతీయ స్థాయి అంధుల క్రికెట్ పోటీల్లో తెలంగాణ జట్టుకు వైస్‌కెప్టెన్‌గా వ్యవహరించా. ఈ టోర్నీలో ఉత్తమ బ్యాటర్, బౌలర్ అవార్డులతో పాటు బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు కూడా గెలుచుకున్నా. వచ్చే నవంబరులో ప్రపంచ మహిళల అంధుల క్రికెట్ వరల్డ్‌కప్ ఉంది. దాని కోసం టీమిండియాకు ఎంపిక చేసిన 29 మంది ప్రొబబుల్స్‌లో తెలంగాణ నుంచి నాకు మాత్రమే చోటు లభించింది. టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాలనేది నా చిరకాల స్వప్నం. జట్టులో స్థానమే లక్ష్యంగా కఠోర సాధన చేస్తున్నా. ‘క్రికెట్ అసోసియేషన్ ఫర్ బ్లయిండ్’లో కర్ణాటకకు చెందిన శిఖా మేడమ్ నన్ను ఎంతో ప్రోత్సహిస్తున్నారు.
పవర్‌లిఫ్టింగ్‌లో...
నా శరీర ధారుడ్యం బట్టి క్రికెట్‌తో పాటు అథ్లెటిక్స్‌లో కూడా పాల్గొనమని నేత్ర విద్యాలయలో కృష్ణ కుమారి మేడం ప్రోత్సహించారు. అలా 2020లో జరిగిన రాష్ట్ర స్థాయి పారా అథ్లెటిక్స్ పోటీల్లో షాట్‌పుట్, డిస్కస్ త్రో, 100 మీటర్ల పరుగులో కాంస్య పతకాలు సాధించా. తాజాగా తొలిసారిగా జాతీయ పవర్‌లిఫ్టింగ్ చాంపియన్‌షి్‌పలో పాల్గొన్నా. గత నెల ఉడుపీలో జరిగిన ఈ పోటీల్లో 69 కిలోల విభాగంలో 155 కిలోల బరువెత్తి స్వర్ణ పతకం సాధించి, జాతీయ చాంపియన్‌గా నిలిచా. ఎల్బీ స్టేడియంలో శాట్ కోచ్‌లు రవి, ప్రవీణ్ సార్‌లు అతితక్కువ కాలంలో నన్ను ఈ పోటీలకు సిద్ధం చేశారు. ఇప్పటివరకు నేను ఏ పోటీల్లో బరిలోకి దిగాలన్న చినజీయర్ స్వామి ట్రస్టు సాయంతోనే పాల్గొనగలిగా. ఆ విషయంలో స్వామివారికి జీవితాంతం రుణిపడి ఉంటా.
రోడ్డు ప్రమాదంతో..
మూడేళ్ల కిందట నేను ముచ్చింతల్ నేత్ర విద్యాలయంలో చదువుతున్నప్పుడు రోడ్డు ప్రమాదంలో నేను నాన్న గాయపడ్డాం. నాన్నతో బైక్ మీద విద్యాలయంకు వెళుతుండగా. వేరే వాహనం ఢీకొట్టింది. నా మోకాలికి దెబ్బ తగిలింది. నాన్న వెన్నులో ఎముకలు విరగడం వల్ల శస్త్రచికిత్స చేశారు. అప్పటి నుంచి నాన్న మూడేళ్లు మంచానికే పరిమితమయ్యారు. దీంతో మా కుటుంబ ఆర్థిక పరిస్థితి తలకిందులైంది. అమ్మపైనే కుటుంబ భారం పడింది. ఇప్పుడిప్పుడే నాన్న కాస్త నడవగలుగు తున్నారు. నా లక్ష్యం ఒక్కటే క్రికెట్‌లో బాగా రాణించి ఉన్నత స్థాయికి చేరుకోవాలి. తర్వాత సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలి. మంచి వ్యాపారవేత్తగా గుర్తింపు పొందాలి.’’
ఎస్.ఎస్.బి.సంజయ్
జాలి... దయ చూపించొద్దు...
గుడ్డివాళ్లు అనగానే కొందరు జాలి, దయ చూపిస్తారు. మరికొందరు ఈసడించుకుంటారు. దయచేసి అలా ఎవరూ చూడవద్దు. ఇలా వ్యవహరించడం వల్ల తెలియకుండానే మాలో ఏదో ఆత్మనూన్యత భావన ఏర్పడతుంది. మమ్మల్ని సాధారణ వ్యక్తులుగానే చూడండి. అలానే ఆదరించండి. మా బంధువులు చాలా మంది నేను ఎదురుపడినప్పుడు ఎక్కడలేని జాలి చూపిస్తారు. నేను కొంచెం పక్కకి వెళ్లాక ‘ఇంట్లో ఒక మూల కూర్చోక ఈ గుడ్డి దానికి ఈ ఆటలు, పాటలు ఎందుక’ని నా వెనకాల తిడుతుంటారు. ఇలాంటి వాటిని పట్టించుకుంటే జీవితంలో ముందుకు వెళ్లలేం. ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురు చూడడం పెద్ద తప్పు. మన కష్టం ఏదో మనమే పడాలి. ఎవరైనా సహాయం చేసినా అది కొంతవరకే. చివరి వరకు ఎవరూ తోడు ఉండరు. కాబట్టి ఒకరిపై ఆధారపడకుండా మన కాళ్లపై మనమే నిలబడాలి.
ఈ వార్తలు కూడా చదవండి
సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో దరఖాస్తుల ఆహ్వానం
డిజిటల్ అరెస్టు పేరుతో.. వృద్ధుడికి రూ.53 లక్షల కుచ్చుటోపీ
Read Latest Telangana News And Telugu News