Foot Nail Problems: కాలి గోళ్ల సమస్యలు గుంభనంగా
ABN , Publish Date - Oct 28 , 2025 | 02:05 AM
ముఖం మీద కనబరిచినంత శ్రద్ధ పాదాల మీద కనబరచం. మరీ ముఖ్యంగా కాలి గోళ్లలో చోటుచేసుకునే మార్పులు, సమస్యలను నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. కానీ కాలి గోళ్ల ఇన్‌ఫెక్షన్లను అశ్రద్ధ చేయడం అత్యంత ప్రమాదకరం...
ఫుట్ కేర్
ముఖం మీద కనబరిచినంత శ్రద్ధ పాదాల మీద కనబరచం. మరీ ముఖ్యంగా కాలి గోళ్లలో చోటుచేసుకునే మార్పులు, సమస్యలను నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. కానీ కాలి గోళ్ల ఇన్‌ఫెక్షన్లను అశ్రద్ధ చేయడం అత్యంత ప్రమాదకరం అంటున్నారు పోడియాట్రిక్ సర్జన్, డాక్టర్ నరేంద్రనాధ్ మేడ.
గుండె, కాలేయం, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు.. ఇలా మనందరం ప్రధానమైన అవయవాల ఆరోగ్యం మీదే దృష్టి పెడుతూ ఉంటాం. కానీ కాలి గోళ్ల మీద మనకెప్పుడూ ఆసక్తి ఉండదు. భరించలేని నొప్పి వేధించినప్పుడు, నడక ఇబ్బందికరంగా మారినప్పుడు మాత్రమే మన దృష్టి కాలిగోళ్ల వైపు మళ్లుతుంది. కానీ ఆరోగ్యం గోళ్లలో ప్రతిబింబిస్తూ ఉంటుందని ఎంతమందికి తెలుసు? రంగు మారడం, మందంగా మారిపోవడం లేదా ఆకారంలో మార్పులు చోటుచేసుకోవడం లాంటివి పలు రకాల ఇన్‌ఫెక్షన్లు, కంటికి కనిపించని రుగ్మతలను సూచిస్తాయి.
రంగు మారితే...
ఆరోగ్యకరమైన గోళ్లు నునుపుగా, లేత గులాబీ రంగులో మెరుస్తూ ఉండాలి. అయితే కాలి గోళ్లు పసుపు, గోధుమ రంగు, ఆకుపచ్చగా మారితే వాటిలో ఏదో సమస్య మొదలైందని అర్థం. గోళ్లు రంగు మారడానికి, వాటికి సోకే ఫంగల్ ఇన్‌ఫెక్షన్లే ప్రధాన కారణం. ప్రత్యేకించి గంటల తరబడి బూట్లు వేసుకునే వాళ్లు, లేదా జిమ్స్, ఈత కొలనుల దగ్గరి తడి వాతావరణంలో ఎక్కువ సమయాలు గడిపే వాళ్లలో ఈ సమస్య ఎక్కువ. అయితే గోళ్లు రంగు మారితే దాన్నొక తీవ్రమైన సమస్యగా పరిగణించేవారు ఎంతో తక్కువ. నెయిల్ పాలిష్ వల్ల గోళ్లు రంగు మారి ఉంటాయని కొందరు సర్దుకుపోతూ ఉంటారు. కానీ ఇదే సమస్యను నిర్లక్ష్యం చేస్తే, ఈ ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు మరింత పెరిగి గోళ్లు మరింత మందంగా, పెళుసుగా మారిపోతాయి. కొన్ని తీవ్రమైన పరిస్థితుల్లో ఆ ఇన్‌ఫెక్షన్ గోళ్ల నుంచి, చుట్టూరా ఉన్న చర్మానికి వ్యాపించి, నడక, బూట్లు ధరించడం కష్టమైపోతుంది.
గోరు లోపలకు పెరిగితే...
అత్యంత సాధారణంగా కనిపించే మరొక సమస్య ఇది. గోరు మూలలు కాలి వేలి లోపలకు పెరుగుతూ ఉంటాయి. సాధారణంగా బొటనవేలి గోళ్లలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. బిగుతైన బూట్లు, గోళ్లను సక్రమమైన తీరులో కత్తిరించుకోకపోవడం, గోటికి దెబ్బ తగలడం వల్ల గోరు లోపలకు పెరగడం మొదలుపెడుతుంది. మొదట్లో వేలు కందిపోయి, ఎర్రగా మారి నొప్పి పెట్టడం మొదలుపెడుతుంది. గోరు లోపలకు పెరిగేకొద్దీ, వేలు మొత్తం వాచిపోతుంది. చీము పట్టి, నడక కష్టమైపోతుంది. మధుమేహం, రక్తప్రసరణ తగ్గడం లేదా వ్యాధినిరోధకశక్తి బలహీనపడడం లాంటి సమస్యలు తీవ్రమైన పరిణామాలకు దారి తీస్తాయి. కొన్ని సందర్భాల్లో గోళ్లలో కొంత భాగాన్ని తొలగించవలసి వస్తుంది. అరుదుగా కొందర్లో పూర్తి వేలునే తొలగించవలసి రావచ్చు.

గోళ్ల సమస్యల పట్ల నిర్లక్ష్యం ఎందుకు?
చాలా మంది గోళ్ల సమస్యలను గృహవైద్యాలతో సరిదిద్దే ప్రయత్నం చేస్తూ ఉంటారు. నొప్పి, అసౌకర్యాల నుంచి ఉపశమనం కోసం వెనిగర్‌లో పాదాలను నానబెట్టడం లేదా గోళ్లను కత్తిరించుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే వీటితో కొంతమేరకు ఉపశమనం లభించవచ్చు. కానీ అసలు సమస్య పరిష్కారం అవక, మరింత తీవ్రమవుతుంది. గోళ్ల ఇన్‌ఫెక్షన్లు వాటంతట అవే మానిపోవనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలి. వాటికి సరైన వ్యాధినిర్థారణ, చికిత్సలు అవసరమవుతాయి. గోళ్ల సమస్యలను వైద్యుల దృష్టికి తీసుకువెళ్లకపోవడానికి మరొక కారణం కూడా ఉంది. కొందరు రంగు మారిన గోళ్లను వైద్యులను చూపించడానికి సిగ్గుపడి, సొంత చికిత్సలతో సరిపెట్టుకుంటూ ఉంటారు. చివరకు సమస్య తీవ్రమైన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లోనే వైద్యులను కలుస్తూ ఉంటారు. అయితే గోళ్లకు సోకే ఇలాంటి సమస్యలను సరిదిద్దడం కోసమే పోడియాట్రి్‌స్టలు ఉంటారనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.
ఈ జాగ్రత్తలు పాటించాలి
పొడిగా, శుభ్రంగా: ప్రతి రోజూ పాదాలను శుభ్రంగా కడిగి, వేళ్లు, గోళ్ల దగ్గర తడి లేకుండా పొడిగా తుడుచుకోవాలి
గోళ్లు కత్తిరించాలి: మూలలను గుండ్రంగా కత్తిరించుకోకుండా, నేరుగా కత్తిరించుకోవాలి
గాలి చొరబడేలా: పాదాలకు సౌకర్యంగా ఉండేలా, గాలి చొరబడేలా ఉండే బూట్లనే ఎంచుకోవాలి
సాక్స్‌లు: ప్రతి రోజూ సాక్సులు మార్చుకుంటూ ఉంటే, ఫంగస్ వృద్ధి చెందదు
నడక: బహిరంగ ప్రదేశాల్లో చెప్పులు లేకుండా నడవడం మానేయాలి. మరీ ముఖ్యంగా ఈత కొలనులు అక్కడి లాకర్ రూమ్స్‌లో చెప్పుల్లేకుండా నడవడం వల్ల ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు సోకే ముప్పు ఉంటుంది
వైద్యులను కలవాలి: వాపు, నొప్పి కనిపించిన వెంటనే వైద్యులను కలవాలి
పెడిక్యూర్ : మధుమేహులు, గోళ్లకు ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు సోకినవారు, మెడికేటెడ్ పెడిక్యూర్ కోసం పోడియాట్రి్‌స్టలను మాత్రమే ఆశ్రయించాలి
నెయిల్ ఎక్స్‌టెన్షన్లు: వీటిలో జిగురు వల్ల గోళ్లకు ఇన్‌ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంటుంది. కాబట్టి గోళ్ల సమస్యలు ఉన్నవాళ్లు వీటికి దూరంగా ఉండాలి
రక్తం గడ్డకడితే: ఆరోగ్యవంతులకు గోళ్ల అడుగున ఏర్పడే చిన్నపాటి రక్తపు గడ్డలతో ప్రమాదం ఉండదు. అయితే సమస్య తీవ్రమైనప్పుడు వైద్యులను కలవడానికి వెనకాడకూడదు. అయితే మధుమేహలు గోళ్లకు దెబ్బలు తగిలి, రక్తం గడ్డలు ఏర్పడితే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను కలవడం మంచిది.
పోడియాట్రిస్ట్ అంటే?
పాదాలు, గోళ్లు, దిగువ అవయవాలకు సోకే ఇన్‌ఫెక్షన్లు, వ్యాధులను నిర్థారించి చికిత్స చేసే వైద్య నిపుణులనే పోడియాట్రిస్ట్ అంటారు. సాధారణ వైద్యులకు భిన్నంగా పోడియాట్రి్‌స్టల దగ్గర ప్రత్యేకించి పాదాలు, గోళ్లకు సంబంధించిన రుగ్మతలను నమయం చేసే అధునాతన వైద్య పరికరాలు, చికిత్సలు అందుబాటులో ఉంటాయి. ఫంగల్, బ్యాక్టీరియల్...వీటిలో గోళ్లకు సోకిన సమస్య ఏదన్నది వీళ్లు మాత్రమే కనిపెట్టగలుగుతారు. దెబ్బ తగలడం వల్ల గోరు దెబ్బ తిందా లేదంటే, దీర్ఘకాల మధుమేహం వల్ల దెబ్బ తిందా అన్నది కూడా ఈ వైద్యులే కనిపెట్టగలుగుతారు. వ్యాధి సోకిన గోళ్లకు యాంటీఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ మందులతో, సున్నితమైన గోటి చికిత్సలతో, లేజర్ థెరపీతో సరిదిద్దుతారు. లోపలకు పెరిగిన గోళ్లను నేర్పుగా కత్తిరించి సమస్యను సరిదిద్దగలుగుతారు. అలాగే సమస్య రాకుండా తీసుకోవలసిన ముందు జాగ్రత్త చర్యలను కూడా సూచిస్తారు.
గోళ్లలో మార్పులు అందుకే...
గోళ్లు... కాలి వేళ్లకు రక్షణ కల్పించడంతో పాటు, మన ఆరోగ్యాన్నీ, జీవనశైలినీ ప్రతిబింబిస్తాయి. పలు రకాల అనారోగ్య సమస్యలు గోళ్లలో ప్రతిఫలిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ దిగువ మార్పుల మీద ఓ కన్నేసి ఉంచాలి
క్లబ్ నెయిల్స్: సరిపడా ఆక్సిజన్ అందక, గోళ్లు ఉబ్బెత్తుగా మారే సమస్య ఇది. దీన్ని గుండె సమస్యకు సూచనగా భావించాలి
పెళుసుబారితే: పాదాలకు రక్తప్రసరణ తగ్గినప్పుడు గోళ్లు పెళుసుబారిపోతాయి. కాబట్టి దీన్ని కూడా గుండె సమస్యగా భావించవచ్చు
పసుపు గోళ్లు: కామెర్ల వ్యాధిలో ఈ లక్షణం కనిపిస్తుంది
నలుపు రంగు గోళ్లు: ఫంగల్ ఇన్‌ఫెక్షన్లకు సూచన
డాక్టర్ నరేంద్రనాధ్ మేడ,
హెచ్‌ఒడి అండ్ సీనియర్ కన్సల్టెంట్ వాస్క్యులర్ అండ్ ఎండోవ్యాస్క్యులర్ సర్జన్,
పోడియాట్రిక్ సర్జన్,
కిమ్స్ హాస్పిటల్, హైదరాబాద్
ఈ వార్తలు కూడా చదవండి..
రైళ్లు రద్దుపై రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ప్రయాణికులకు కీలక సూచన
కార్తీక మాసంలో ఈ నాలుగు ఆచరిస్తే..
For More AP News And Telugu News