Share News

Dr Kummari Adilakshmis Inspiring Journey: చదువు కోసం పెద్ద యుద్ధమే చేశాను

ABN , Publish Date - Oct 15 , 2025 | 01:13 AM

‘‘బాగా చదువుకోవాలన్న సంకల్పం, పట్టుదల ఉంటే చాలు... పేదరికం, వివక్ష లాంటి అవరోధాలను అధిగమించి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చు. అయితే అది అంత సులభం కూడా కాదు...

Dr Kummari Adilakshmis Inspiring Journey: చదువు కోసం పెద్ద యుద్ధమే చేశాను

‘‘బాగా చదువుకోవాలన్న సంకల్పం, పట్టుదల ఉంటే చాలు... పేదరికం, వివక్ష లాంటి అవరోధాలను అధిగమించి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చు. అయితే అది అంత సులభం కూడా కాదు... పోరాటం చేయాల్సిందే’’ అంటారు డాక్టర్‌ కుమ్మరి ఆదిలక్ష్మి. నంద్యాల జిల్లాలోని ఆవులదొడ్డి గ్రామానికి చెందిన ఆమె హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం నుంచి తెలుగు పరిశోధనలో ఈ మధ్యే పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు. ‘‘తొమ్మిదో తరగతితోనే ఆగిపోతుందనుకున్న చదువు ఇక్కడి వరకు కొనసాగడానికి కుటుంబంతో సమాజంతో పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది’’ అంటున్న ఆదిలక్ష్మి ‘నవ్య’తో తన కథను పంచుకున్నారు.

‘‘నల్లగా, పొట్టిగా ఉన్న పిల్లను ఎవరు పెళ్లి చేసుకుంటారు?... ఇలాంటి మాటలు బంధువులు, ఇరుగుపొరుగు వారి నోళ్ల నుంచి నిత్యం వింటూ పెరిగిన నాకు ఆ వెక్కిరింతలే దీవెనలయ్యాయి. ఆ అవమానాలే నన్ను మారుమూల పల్లెటూరు నుంచి హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం వరకూ తీసుకువచ్చాయి. మా ఊర్లో అమ్మాయిలకు చదువు అంటే తొమ్మిది లేదా పదోతరగతి... అంతే! ఇప్పటికీ అదే పరిస్థితి. తొమ్మిదో తరగతిలో ఉండగా నాకు కూడా మా ఇంట్లో వాళ్లు పెళ్లి చేయాలని చూశారు. కాకపోతే, వచ్చిన సంబంధాలు వచ్చినట్టే వెనక్కివెళ్లడంతో ‘హమ్మయ్య... ఇక సంతోషంగా చదువుకోవచ్చు’ అనుకున్నాను. అలా నా రూపమే నాకు మనోబలాన్ని, సంకల్పానికి శక్తిని అందించింది అయితే నా పాలిట మరొక విలన్‌ ఉంది! అదే పేదరికం. నా తల్లిదండ్రులకు నన్ను చదివించడానికి స్థోమత ఒక్కటే కాదు, ఆ దిశగా నన్ను ప్రోత్సహించాలన్న కనీస ఆలోచనకూడా లేదు. నా చదువు గురించి వారికి అస్సలు ఏమీ తెలీదు కూడా. కాకపోతే, నా ఇష్టానికి నన్ను వదిలేశారు. అదొక్కటే నా జీవితాన్ని నాకు నచ్చినట్టుగా మలచుకోవడానికి అవకాశం కల్పించింది.


పురుగుల అన్నం తింటూ...

పొలం పనులు సాగకపోవడంతో అమ్మ, నాన్న కూలి పనుల కోసం కర్నూలుకు వచ్చినప్పుడు నన్నూ వెంట తీసుకువెళ్లారు. ఒక ప్రభుత్వ వసతి గృహంలో చేర్పించారు. నేను అక్కడ ఉండలేకపోతున్నానని ఎంత ఏడ్చి చెప్పినా ‘‘చదువుకోవాలంటే తప్పదు’’ అన్నారు. సెలవుల్లో నేనూ కూలికి వెళతానని చెప్పడంతో.... నన్ను ఇంటికి తీసుకువచ్చారు. అలా ఇంటర్‌, డిగ్రీ వరకు పత్తిగింజల ఫ్యాక్టరీలో లేదంటే అప్పడాలు అమ్మడంలాంటి పనులుచేస్తూ కొనసాగాను. వచ్చిన కూలీని ఇంట్లోనే ఇచ్చాను. కొద్ది రోజులకు అమ్మావాళ్లు తిరిగి మా సొంతూరు వెళ్లడంతో... మళ్లీ ప్రభుత్వ వసతిగృహంలో చేరాల్సి వచ్చింది. ఆ జీవితం నరకప్రాయం. మరుగుదొడ్లు లేవు. చీకటితోనే లేచి ఆరుబయట స్నానాలు చేయాల్సి వచ్చేది. అన్నంలో పురుగులు ఏరుకొని తినాల్సి వచ్చేది. ఎప్పుడైనా కాలేజీలో స్పెషల్‌ క్లాసువల్ల హాస్టల్‌కు ఆలస్యంగా వెళితే... మాకు ఆ వేళ ఉపవాసమే. రికార్డులు, నోటు పుస్తకాలకు డబ్బులు అడిగితే ఇంట్లోవాళ్లు లేవనేవారు. సెలవుల్లో కూలి పనులు చేస్తే వచ్చిన డబ్బుతో అవసరమైనవి సమకూర్చుకోవడం ఒక్కటే నాకు మిగిలిన దారి. ఈ రోజుల్లో డిగ్రీ చదవడం చాలామందికి పెద్ద విషయమేమీ కాదు. కానీ నాలాంటి ఆడపిల్లలకు మాత్రం అది పెద్ద యుద్ధమే. అందులో గెలవడానికి ఎన్ని బాధలు పడాలో అవన్నీ అనుభవించాను.

సెంట్రల్‌ వర్సిటీలో సీటు వచ్చింది...

డిగ్రీలో ఉండగా హైదరాబాద్‌ సెంట్రల్‌ వర్సిటీలో ప్రవేశ పరీక్ష ద్వారా పోస్టు గ్రాడ్యుయేషన్‌లో చేరవచ్చునని తెలిసింది. అప్పటివరకు నాకు ఆ యూనివర్సిటీ ఉందనే విషయమే తెలియదు. ఎంట్రన్స్‌ రాశాను. మంచి ర్యాంకు రావడంతో ఎమ్మే తెలుగులో చేరాను. తెలుగు అంటే సులువుగా ఉంటుందని అనుకున్నా, ఇక్కడ చేరాక కానీ తెలియలేదు... అది ఎంత కష్టమో. చదువుమీద ఇష్టంతో ఆ కష్టాన్ని కూడా సునాయాసంగా దాటాను. మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించిన తర్వాత పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షలోనూ రెండవ ర్యాంకు సాధించాను. జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషి్‌పకి ఎంపికయ్యాను. ఆచార్య గోనా నాయక్‌ సర్‌ పర్యవేక్షణలో ‘తెలుగు కథా సాహిత్యం - వివాహ వ్యవస్థలో పరిణామాలు... పరిశీలన’ అనే అంశంపై పరిశోధన పూర్తిచేసి, మొన్నటి స్నాతకోత్సవంలో డాక్టరేట్‌ అందుకున్నాను. ఈ టాపిక్‌కూడా మా ప్రొఫెసర్‌ దార్ల వెంకటేశ్వరరావు సర్‌ సూచించారు. మా ప్రొఫెసర్లు మాత్రం నాకు చక్కటి మార్గనిర్దేశం చేశారు కాబట్టే సాధారణ అమ్మాయినైన నేను డాక్టర్‌ ఆదిలక్ష్మి కాగలిగాను. మా ఊర్లో పీహెచ్‌డీ చేసిన మొదటి అమ్మాయి నేనే కావచ్చు. ఇది గర్వంతో చెప్పడంలేదు, ‘ఇన్నేళ్ల స్వాతంత్య్ర ఫలాలు మా పల్లెలాంటి ఇంకెన్ని పల్లెలకు చేరలేదో?’ బాధతోనే అంటున్నాను.


00-navya.jpg

అదే నా లక్ష్యం...

సెంట్రల్‌ యూనివర్సిటీలో ఉండగా అక్కడే మరో కోర్సు చదువుతున్న ఒక అతను పరిచయమయ్యాడు. ఒకరినొకరం ఇష్టపడి కులాంతరాలను సైతం కాదని పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నాం. ఇన్నాళ్లూ తల్లిదండ్రుల నుంచి అందని ప్రేమాభిమానాలు, ప్రోత్సాహం భర్త నుంచి ఆశించాను. తాను ఒకటి తలిస్తే, విధి మరొకటి తలచిందని... వివాహమైన నెలరోజులకే కట్నం కోసం కొట్లాటలు మొదలయ్యాయి. మా అమ్మా నాన్నా నా చదువుకు సహకరించకపోయినా... ఆంక్షలు మాత్రం విధించలేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త మాత్రం చదువుకోవద్దని ఒక రోజు, ‘ఇప్పటికిప్పుడు ఉద్యోగం తెచ్చుకోవాల్సిందే’ అని మరొక రోజు నానా మాటలతో చిత్రవధ చేయడం మొదలుపెట్టాడు. పీహెచ్‌డీ పరిశోధన ఆపేయమన్నాడు. మగ ప్రొఫెసర్లతో మాట్లాడకూడదని షరతులు పెట్టాడు. ఆ హింస భరించలేక ఇంటి నుంచి బయటకు వచ్చాను. ఇంకోవైపు పుట్టింటి నుంచి సహకారం లేదు. ఒకానొక సమయంలో డిప్రెషన్‌లోకి వెళ్లాను. తిరిగి నాలో నేనే ధైర్యం తెచ్చుకొని పీహెచ్‌డీ పరిశోధన పూర్తిచేశాను. ఉపాధ్యాయ వృత్తి అంటే నాకు మొదటి నుంచి చాలా ఇష్టం. టీచర్‌ అవ్వాలనీ, నాలాంటి నిరుపేద అమ్మాయిలు మరికొందరికి అండగా నిలవాలనీ నా కోరిక. ప్రస్తుతం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాను. జీవితంలో ఎన్నో యుద్ధాలు చేసి గెలిచిన నేను ఈ పోరాటంలోనూ తప్పకుండా విజయం సాధిస్తాను.’’

సాంత్వన్‌


చదువు ఒక్కటే దారి...

చదువు ఒక్కటే మన జీవితాన్ని ఒక మెట్టుపైకి తీసుకెళుతుందని గుర్తించాను. కొంతమంది దృష్టిలో చదువుకోవడం అంటే పాఠ్యపుస్తకాలు వల్లెవేసి, పరీక్షల్లో మంచి మార్కులు సాధించడం మాత్రమే. కానీ నాలాంటి అమ్మాయిలకు మాత్రం చదువు అంటే అదొక పెద్ద సంగ్రామం. సమాజంతో, కుటుంబంతో నిత్యం పోరాడాలి. అవమానాలు, ఛీత్కారాలు భరించాలి. ‘అమ్మాయిలకు అంత పెద్ద చదువు అవసరమా’ లాంటి సామాజిక ఒత్తిళ్లను అధిగమించాలి. అప్పుడుకాని తరగతి గదికి చేరుకోలేం. నా పీహెచ్‌డీ పరిశోధనలో భాగంగా వివాహ వ్యవస్థ గురించి డాక్టర్‌ కె.శ్రీదేవి, మల్లాది సుబ్బమ్మ, ఓల్గా, కాత్యాయనీ విద్మహే లాంటి ప్రఖ్యాత రచయిత్రులు రాసిన వ్యాసాలు అధ్యయనం చేశాను. దీనివల్ల భారతీయ సమాజంమీద, ముఖ్యంగా స్త్రీ, పురుష సంబంధాలమీద స్పష్టమైన అవగాహన నాలో ఏర్పడింది. వారి రచనలు నన్ను మరింత విశాల ప్రపంచంలోకి తీసుకువెళ్లాయి.

ఆ విషయం ఏడాదిన్నర దాచాను...

మా ప్రాంతంలో రజస్వల అయిన వెంటనే అమ్మాయిలకు పెళ్లి చేస్తారు. ఇప్పటికీ ఉమ్మడి కర్నూలు జిల్లాలోని చాలా గ్రామాలలో బాల్యవివాహాలు తరచుగా జరుగుతుంటాయి. కొన్ని పల్లెల్లో అయితే ఒకరిద్దరు మాత్రమే ఇంటర్‌, డిగ్రీ వరకు చదివి ఉంటారు. మూఢనమ్మకాలు కూడా ఎక్కువే. పుష్పవతి అయ్యానని తెలిసి, నాకు పెళ్లి చేస్తారేమోనన్న భయంతో ఏడాదిన్నర పాటు అమ్మకు కూడా చెప్పకుండా ఆ విషయాన్ని దాచాను.

ఈ వార్తలు కూడా చదవండి..

విశాఖ ఏఐ రాజధానిగా మారుతుంది: మంత్రి సత్యప్రసాద్

విశాఖ గూగుల్ ఏఐ హబ్.. భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు బలం: ప్రధాని మోదీ

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 15 , 2025 | 01:13 AM