సమత్వ సాధనే మోక్ష మార్గం
ABN , Publish Date - May 16 , 2025 | 05:14 AM
అజ్ఞానంతో జీవించడం చీకట్లో జీవించడం లాంటిది. చీకట్లో తడుముకుంటూ, పడుతూ, లేస్తూ...మనల్ని మనం గాయపరుచుకుంటాం. తదుపరి స్థితి... కొన్ని వెలుగు రేఖలను అనుభూతి చెందడం లాంటిది. అప్పుడు కూడా...
గీతాసారం
అజ్ఞానంతో జీవించడం చీకట్లో జీవించడం లాంటిది. చీకట్లో తడుముకుంటూ, పడుతూ, లేస్తూ...మనల్ని మనం గాయపరుచుకుంటాం. తదుపరి స్థితి... కొన్ని వెలుగు రేఖలను అనుభూతి చెందడం లాంటిది. అప్పుడు కూడా క్షణకాలం పాటు అవగాహన పొంది, తిరిగి అజ్ఞానంలోకే జారిపోతాం. చివరి స్థితి సూర్యకాంతి లాంటి శాశ్వతమైన కాంతిని పొందడం. ఇక్కడ అవగాహన అత్యున్నత స్థాయికి చేరుకుంటుంది. అక్కడి నుంచి ఇక వెనక్కి తిరిగి రావడం అనేది ఉండదు. ఇటువంటి స్థితిని ‘మోక్షం’ అంటారు. ఇది ‘నేను’ (సంబంధిత వ్యక్తి) పొందే స్వేచ్ఛ కాదు, ‘నేను’ (అనే భావన) నుంచి స్వేచ్ఛ. ఎందుకంటే బాధలన్నిటికీ కారణం ఈ ‘నేను’ కనుక.
‘‘ఎవరైతే తమ మనసును, బుద్ధిని ఆత్మలో స్థిరపరుచుకుంటారో... వారు జ్ఞాన సాధనతో పాపరహితులై, పునరావృతరహితమైన పరమగతిని (మోక్షాన్ని) పొందుతారు’’ అని ‘భగవద్గీత’లో శ్రీకృష్ణుడు చెప్పాడు. మరి ఆ స్థితిని పొందాలంటే కావలసింది ఏమిటి? సమత్వం. విద్యాసంపన్నులైన ఉన్నత వర్ణాలవారి పట్ల, నిమ్న కులాల వారిపట్ల, అలాగే గోవు, ఏనుగు, శునకం లాంటి జంతువుల పట్ల జ్ఞానులు సమదృష్టిని కలిగి ఉంటారన్నాడు శ్రీకృష్ణుడు. ఈ ‘సమత్వం’ అనేది భగవద్గీతకు పునాదుల్లో ఒకటి. అందరిలోనూ స్వయాన్ని (తనను), స్వయంలో అందరినీ చూడగలగడం అనేది సమత్వానికి కేంద్రం లాంటిది. అంటే ఇతరులలో కూడా మనలాగే మంచి విషయాలు ఉన్నాయని, మనలో కూడా ఇతరుల మాదిరిగా చెడు విషయాలు ఉన్నాయని గుర్తించడం. కనిపించే వైరుధ్యాలను సమానంగా చూడడం, అజ్ఞానం నుంచి ఉద్భవించిన ద్వేషాల్ని, అయిష్టాల లాంటి వాటిని త్యజించడం తరువాతి స్థాయిలు. ‘ఒకే కారణం వల్ల ఒకసారి లాభం కలగవచ్చు, మరోసారి నష్టం కలుగవచ్చని తెలుసుకొని... మనం నిమిత్రమాత్రులం’ అని గ్రహించాలి.
సమతుల్యత లేని మనసుతో చేసిన కర్మ దుఃఖాన్ని తీసుకువస్తుందని అర్థం చేసుకోవాలి. ఈ అవగాహన నుంచి సమత్వభావం ఉద్భవిస్తుంది. ‘‘వర్తమానంలో ఎవరైతే సమత్వ భావంలో స్థిరపడతారో... వారు నిష్పక్షపాతులవుతారు. లోపరహితులై... పరమాత్మతో ఏకత్వాన్ని పొంది, జీవన్ముక్తులవుతారు’’ అని శ్రీకృష్ణుడు చెబుతున్నాడు.
కె.శివప్రసాద్
ఈ వార్తలు కూడా చదవండి..
Rahul Gandhi: రాహుల్‌పై చర్యలకు రంగం సిద్ధం..
Abhinandan Vardhaman: అభినందన్ వర్థమాన్‌ను భారత్‌కి పాక్ ఆర్మీ అప్పగించిన తర్వాత ఏమైందంటే..
Supreme Court: సుప్రీంకోర్టులో సజ్జల భార్గవ్‌కు చుక్కెదురు
For Telangana News And Telugu News