Environmental Activist Bhavna Meenan: ప్రకృతి పాఠాలు
ABN , Publish Date - Dec 25 , 2025 | 02:14 AM
‘‘ఎవరో వచ్చి, ఏదో చేస్తారనే ఎదురుచూపులు వ్యర్థం. మన సమస్యల్ని మనమే పరిష్కరించుకోవాలి’’ అని చెప్పడమే కాదు... ఆ దిశగా వందలమందికి మార్గనిర్దేశం చేస్తున్నారు పర్యావరణ ఉద్యమకారిణి...
‘‘ఎవరో వచ్చి, ఏదో చేస్తారనే ఎదురుచూపులు వ్యర్థం. మన సమస్యల్ని మనమే పరిష్కరించుకోవాలి’’ అని చెప్పడమే కాదు... ఆ దిశగా వందలమందికి మార్గనిర్దేశం చేస్తున్నారు పర్యావరణ ఉద్యమకారిణి భావన మీనన్.పులుల భయంతో జనం అనుక్షణం బిక్కుబిక్కుమంటూ గిడపే బంధవ్‌గఢ్ ప్రాంతంలో... విద్యార్థుల్లో చైతన్యం రగిలించి... అడవుల పరిరక్షణకు దోహదం చేస్తున్నారు.
‘‘బడికి వెళ్ళడం ప్రాణాలతో చెలగాటమైన ప్రాంతం మధ్యప్రదేశ్‌లోని బంధవ్‌గఢ్. సంజయ్ దుబ్రీ (బంధవ్‌గఢ్) నేషనల్ పార్క్‌ను ఆనుకొని ఉన్న గ్రామాల్లో... పులుల దాడిలో మరణించిన లేదా గాయపడినవారు ప్రతి కుటుంబంలో ఒక్కరైనా ఉంటారు. పదకొండేళ్ళ కుమారుణ్ణి పులి దాడిలో కోల్పోయిన ఒక కుటుంబాన్ని కొన్నేళ్ళ క్రితం కలిశాను. ‘‘మీకు కలిగిన ఈ నష్టానికి బాధ్యత ఎవరిదనుకుంటున్నారు?’’ అని అడిగాను. ‘‘మేము అడవిని నిందించం. అది మాకు ఎంతో ఇస్తోంది’’ అని ఆ బాలుడి తల్లిదండ్రులు జవాబు ఇచ్చారు. అక్కడ ప్రజలకు అడవి మీద ద్వేషం లేదు. కానీ పులుల దాడులనుంచి తమను ఎలా కాపాడుకోవాలో తెలియని నిస్సహాయత. నేను మూడేళ్ళ క్రితం ఆ ప్రాంతంలో అడుగుపెట్టినప్పుడు ఉన్న పరిస్థితి ఇది.
పూల సేకరణ కోసం...
నా స్వస్థలం మహారాష్ట్రలోని పుణే. చదువు పూర్తయిన తరువాత... సుమారు పదేళ్ళ నుంచి దేశంలోని వివిధ అటవీ ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణ కోసం పని చేస్తున్నాను. టైగర్ రిజర్వ్ అయిన బంధవ్‌గఢ్ నేషనల్ పార్కును సందర్శించినప్పుడు... ప్రకృతి సౌందర్యం ఎంతగానో నన్ను ఆకర్షించింది. అలాగే ప్రజల దుస్థితిపై తీవ్రమైన ఆవేదన కూడా కలిగింది. 2001 నుంచి 2021 మధ్య దాదాపు 200 మంది పులుల దాడుల్లో ప్రాణాలు పోగొట్టుకున్నారు. రెండువేలకు పైగా పశువులు బలయ్యాయి. బిక్కుబిక్కుమని బతుకుతున్న ప్రజల్లో భయాన్ని పోగొట్టడానికి, భద్రత కల్పించడానికి ఏం చెయ్యాలి? ఇదే ఆలోచన. సమస్య మూలం ఏమిటో గుర్తించడానికి ప్రయత్నించాను. మహువా పువ్వుల సేకరణ ఆ గ్రామ ప్రజలకు ప్రధాన జీవనోపాధి. ఆ పువ్వులు సాధారణ నేల మీద స్పష్టంగా కనిపించవు. కాబట్టి వాటిని సేకరించడం సులువవుతుందనే కారణంతో అడవి నేల మీద మంటలు వేసి కాల్చేస్తూ ఉంటారు. అది పెద్ద ప్రమాదాలకు కూడా కారణమవుతోంది. కొన్నేళ్ళుగా మధ్యప్రదేశ్ అడవుల్లో సంభవించిన 28 వేల కార్చిచ్చుల్లో దాదాపు 77 వేల చదరపు కిలోమీటర్లు నాశనమైంది. అగ్నిప్రమాద భయం వల్ల, అడవులు నాశనం కావడం వల్ల పులులు జనావాసాల మీద పడుతున్నాయి. మనుషులను, పశువులను చంపేస్తున్నాయి.

చైనత్యం కలిగించేలా...
దీనికి అడ్డుకట్ట వేయాలి. ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురుచూడడం కన్నా స్థానికులే తమ సమస్య పరిష్కారానికి పోరాడాలి. అది భవిష్యత్తులో కొనసాగాలంటే పిల్లలు దానిలో ప్రధానపాత్ర వహించాలి. ఈ ఆలోచనతో... 2024లో ప్రకృతి పాఠశాలను ప్రారంభించాను. బంధవ్‌గఢ్ చుట్టుపక్కల గ్రామాల్లోని విద్యార్థులను భాగస్వాముల్ని చేశాను. నేను, మరికొందరు వాలంటీర్లు... పులుల దాడుల వల్ల నష్టపోయిన కుటుంబాలవారికి కౌన్సెలింగ్ ఇచ్చాం. వారి పిల్లల చదువుకోసం ఆర్థిక సాయం అందించాం. విస్తృతంగా మొక్కల నాటేలా ప్రోత్సహించాం. నేచర్ ఎడ్యుకేషన్ క్యాంపులు, ఫారెస్ట్, వాక్స్, ఇంటింటి అవగాహన కార్యక్రమాలు లాంటివి నిర్వహించాం. ప్రకృతి పాఠశాలలో ప్రకృతి పరిరక్షణ గురించి నేర్చుకున్న పిల్లలను గ్రామాల్లో చైతన్యం కలిగించేలా తీర్చిదిద్దాం.
జూనియర్ ఫైర్ వాచర్స్ స్క్వాడ్...
అడవుల్ని తగలబెట్టడాన్ని నిరోధించడానికి అదే ఏడాది ‘జూనియర్ ఫైర్ వాచర్స్ స్క్వాడ్’ ఏర్పాటు చేశాం. ఎక్కడైనా మంటలు వేసినట్టు గుర్తిస్తే... వెంటనే స్క్వాడ్‌లోని ఇతర సభ్యులను, తోటి విద్యార్థులను వారు అప్రమత్తం చేస్తారు. మరోవైపు మొహువా పువ్వుల సేకరణలో పాత పద్ధతులను విడిచిపెట్టాలనీ, చెట్ల కింద వస్త్రాలను పరిచి పువ్వులు సేకరించాలనీ, మంటలు పెట్టడం మానాలనీ వారి ద్వారా ప్రచారం చేయిస్తున్నాం. ఈ చర్యలన్నీ మంచి ఫలితాలు ఇచ్చాయి. తమ పిల్లలు చెప్పిన మాటలు తల్లిదండ్రులను ఆలోచింపజేశాయి. అడవుల్లో మంటలు పెట్టే చర్యలు 99 శాతం తగ్గాయని స్వయంగా టైగర్ రిజర్వ్ అధికారులే చెబుతున్నారు. అలాగే ఈ రెండేళ్ళలో కొన్ని వేల మొక్కలు నాటించాం. ప్రకృతి పాఠశాలలో రెండో ప్రాజెక్టును ఈ ఏడాది ప్రారంభించాం. ప్రస్తుతం పాతిక గ్రామాలకు చెందిన 326 మంది విద్యార్థులు, 26 మంది టీచర్లు ఈ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ప్రకృతి శిబిరాలను కూడా వారే నిర్వహిస్తున్నారు. ఇదివరకటిలా పులుల దాడులు దాదాపుగా జరగడం లేదు. దీనికి నావంతుగా దోహదం చేసినందుకు సంతృప్తిగా ఉంది. ఈ స్ఫూర్తిని విద్యార్థులు ఇలాగే కొనసాగిస్తారనీ, అడవులను, తమ భావితరాలను కాపాడుకుంటారనీ నా గట్టి నమ్మకం.’’
2024లో ప్రకృతి పాఠశాలను ప్రారంభించాను. బంధవ్‌గఢ్ చుట్టుపక్కల గ్రామాల్లోని విద్యార్థులను భాగస్వాముల్ని చేశాను. నేను, మరికొందరు వాలంటీర్లు... పులుల దాడుల వల్ల నష్టపోయిన కుటుంబాలవారికి కౌన్సెలింగ్ ఇచ్చాం. వారి పిల్లల చదువుకోసం ఆర్థిక సాయం అందించాం. విస్తృతంగా మొక్కల నాటేలా ప్రోత్సహించాం.
ఇవి కూడా చదవండి...
వీరన్న హత్య కేసులో వీడిన మిస్టరీ... అసలు నిజం ఇదే
తిప్పలు పెడితే రాసుకోండి.. మిత్తీతో సహా తీర్చేద్దాం: హరీష్ రావు
Read Latest Telangana News And Telugu News